నువ్వో రోజు.. నేనో రోజు..!
దిశ ప్రతినిధి, నిజామాబాద్ : కరోనా మహమ్మారితో విద్యాశాఖ అకడమిక్ క్యాలెండర్లో పెను మార్పులు చేసింది. కొవిడ్ వ్యాప్తి నేపథ్యంలో విద్యార్థులకు ఆన్లైన్లో క్లాసులు నిర్వహించేలా చర్యలు తీసుకుంది. అయితే టీచర్లు వైరస్ బారిన పడకుండా రోజూ 50 శాతం హాజరు కావాలని ఆదేశించింది. ఇది కొంత మందికి చాలా కలిసి వచ్చింది. అధికారుల పర్యవేక్షణ లోపంతో ఆ యాభై శాతంలో కనీసం సగం మంది కూడా పాఠశాలలకు అటెండ్కావడం లేదు. నువ్వో రోజు.. నేనో రోజు […]
దిశ ప్రతినిధి, నిజామాబాద్ : కరోనా మహమ్మారితో విద్యాశాఖ అకడమిక్ క్యాలెండర్లో పెను మార్పులు చేసింది. కొవిడ్ వ్యాప్తి నేపథ్యంలో విద్యార్థులకు ఆన్లైన్లో క్లాసులు నిర్వహించేలా చర్యలు తీసుకుంది. అయితే టీచర్లు వైరస్ బారిన పడకుండా రోజూ 50 శాతం హాజరు కావాలని ఆదేశించింది. ఇది కొంత మందికి చాలా కలిసి వచ్చింది. అధికారుల పర్యవేక్షణ లోపంతో ఆ యాభై శాతంలో కనీసం సగం మంది కూడా పాఠశాలలకు అటెండ్కావడం లేదు. నువ్వో రోజు.. నేనో రోజు డుమ్మా కొడదామని ‘క్విడ్ ప్రో కో’ పద్ధతిలో విధులు నిర్వర్తిస్తున్నారనే ఆరోపణలున్నాయి.
ఉపాధ్యాయుల ఇష్టారాజ్యం..
కరోనా నేపథ్యంలో తరగతులు ఎటూ లేవు. పిల్లలకు ఫోన్ లోనే కదా సలహాలు.. సూచనలు ఇచ్చేదనే భావన ఉపాధ్యాయుల్లో నెలకొంది. దీంతో చాలామంది కనీసం పాఠశాల మొహం చూడడం లేదు. ఎవరైనా అధికారులు తనిఖీలకు వస్తే వారికుండే సమాచారంతో ముందస్తుగానే రిజిస్టర్లో సెలవు పత్రం పెట్టి ఎంచక్కా తప్పించుకుంటున్నారనే ఆరోపణలున్నాయి. ప్రాథమిక పాఠశాలల తరగతులు మధ్యాహ్నం 12 వరకు, హైస్కూల్ విద్యార్థులకు 2.30 వరకు జరుగుతుండగా ఇంకొంతమంది టీచర్లు క్లాసులు పూర్తి కాకుండానే జారుకుంటున్నారు. మరికొందరైతే ఉదయం ఇష్టం వచ్చినప్పుడు పాఠశాలలకు రావడం, నచ్చినప్పుడు వెళ్లిపోవడం చేస్తున్నారనే ఆరోపణలున్నాయి.
తలకు మించిన భారం..
టీచర్ల హాజరును హెడ్మాస్టర్లు సీఆర్పీలకు పంపుతున్నారు. వారు ర్యాండమ్ గా స్కూళ్లను తనిఖీ చేసి హాజరు నివేదికను ఎంఈవోలకు అందజేస్తారు. మండల విద్యాశాఖాధికారిగా తాను ప్రధానోపాధ్యాయుడిగా ఉన్న పాఠశాలలపై నజర్ వేయడానికే సమయం సరిపోతుందని, ఇక మండల పరిధిలోని అన్ని పాఠశాలల తనిఖీలు తమకు తలకు మించిన భారం అవుతోందని పలువురు వాపోతున్నారు. మండల విద్యాశాఖాధికారుల తనిఖీ విషయం కాంప్లెక్స్ ల వారీగా లేదా హెడ్మాస్టర్ల ద్వారా ముందే లీక్ అవుతోందని, దీంతో డుమ్మా కొట్టిన ఉపాధ్యాయులు, విధులకు ఆలస్యంగా హాజరయ్యేవారు, పాఠశాల తెరిచి ఉండగానే నిర్ణీత సమయానికి ముందుగానే జారుకునేవారు అప్రమత్తం అవుతున్నారనే ఆరోపణలున్నాయి.
ఒకే ఒక్కడు..
ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఉన్న మండలాల్లో శాశ్వత ఎంఈవో ఒక్కరు ఉన్నారు. మిగిలిన మండలాల విద్యాశాఖాధికారులంతా సీనియర్ గెజిటెడ్ హెడ్మాస్టర్లు కావడంతో వారు చేస్తున్న తనిఖీలపై తోటి ఉపాధ్యాయులే పెదవి విరుస్తున్నారని తెలుస్తోంది. ఆన్లైన్ తరగతుల ప్రయోజనం తెలియాలంటే పరీక్షలు జరగాలి.. ఫలితాలు రావాలి.. దానికి ఉపాధ్యాయులు నిత్యం పాఠశాలలకు హాజరు కావాలి. ఆన్ లైన్ పాఠాలపై అవగాహన, పున:శ్చరణ గురించి ఆరా తీసి సలహాలు సూచనలు ఇవ్వాలి.
మెమోల జారీతోనే సరి..
పాఠశాలల్లో ఉపాధ్యాయుల పనితీరును పర్యవేక్షించడానికి డీఈవోలు చేస్తున్న ప్రయత్నాలు సత్ఫలితాలను ఇవ్వాలంటే కఠినంగా వ్యవహరించాలి. తనిఖీ సమయంలో ఉపాధ్యాయులకు మెమో జారీ చేసి చేతులు దులుపుకోవడంతో వారిలో భయం లేకుండా పోయిందనే ఆరోపణలున్నాయి. నిజామాబాద్, కామారెడ్డి జిల్లాలో ఇప్పటి వరకు 80 మందికి తాఖీదులు ఇస్తే సంజాయిషీ ఇచ్చుకుని బయటపడ్డవారే ఎక్కువని తెలుస్తోంది.
నిజామాబాద్, హైదరాబాద్ నుంచి కామారెడ్డి జిల్లాలోని శివారు ప్రాంతాలకు అప్ అండ్డౌన్ చేసే టీచర్లు పాఠశాలలను ఎప్పుడు తెరుస్తారు.. ఎప్పుడు మూస్తారో తెలియని పరిస్థితి నెలకొందనే ఆరోపణలున్నాయి. కాగా, ప్రతిరోజు విద్యార్థుల తరగతుల నిర్వహణ, హోంవర్క్ ను పరిశీలించాల్సిన ఉపాధ్యాయులపై నిఘా కరువైంది. దీంతో తమ ఆన్ లైన్ క్లాసుల వల్ల తమ పిల్లలకు ఎలాంటి ప్రయోజనం చేకూరడం లేదని ఆరోపిస్తున్నారు. తమ పిల్లలను పాఠశాలలకు పంపేందుకు సిద్ధంగా ఉన్నామని, స్కూళ్లు ఎప్పుడు తెరుస్తారని తల్లిదండ్రులు ఉపాధ్యాయులను ప్రశ్నిస్తున్నారు.