టీఆర్ఎస్కు ‘సాగర్’ గుబులు
దిశ ప్రతినిధి, నల్లగొండ: నల్లగొండ జిల్లా టీఆర్ఎస్‌లో గ్రూపుల లొల్లి మొదలయ్యింది. నోముల నర్సింహయ్య మృతితో వచ్చిన నాగార్జునసాగర్ ఉపఎన్నిక పుణ్యమా అంటూ నేతల మధ్య కోల్డ్ వార్ బహిర్గతమవుతోంది. వాస్తవానికి చాలాకాలంగానే విభేదాలు ఉన్నా అవి బయటపడే సందర్భం రాలేదు. సాగర్ అభ్యర్థిత్వం విషయంలో తీవ్ర పోటీ నెలకొనడంతో ఇప్పటివరకు అంతర్గతంగా ఉన్న విభేదాలు బయటపడుతున్నాయి. టీఆర్ఎస్ అభ్యర్థిని ఖరారు చేయకపోవడంతో టికెట్ ఆశిస్తున్నవారు ‘ఎవరికి వారే..యమునా తీరే’ అన్న చందంగా ప్రచారాన్ని ముమ్మరం చేస్తున్నారు. […]
దిశ ప్రతినిధి, నల్లగొండ: నల్లగొండ జిల్లా టీఆర్ఎస్‌లో గ్రూపుల లొల్లి మొదలయ్యింది. నోముల నర్సింహయ్య మృతితో వచ్చిన నాగార్జునసాగర్ ఉపఎన్నిక పుణ్యమా అంటూ నేతల మధ్య కోల్డ్ వార్ బహిర్గతమవుతోంది. వాస్తవానికి చాలాకాలంగానే విభేదాలు ఉన్నా అవి బయటపడే సందర్భం రాలేదు. సాగర్ అభ్యర్థిత్వం విషయంలో తీవ్ర పోటీ నెలకొనడంతో ఇప్పటివరకు అంతర్గతంగా ఉన్న విభేదాలు బయటపడుతున్నాయి. టీఆర్ఎస్ అభ్యర్థిని ఖరారు చేయకపోవడంతో టికెట్ ఆశిస్తున్నవారు ‘ఎవరికి వారే..యమునా తీరే’ అన్న చందంగా ప్రచారాన్ని ముమ్మరం చేస్తున్నారు.
గత అసెంబ్లీ ఎన్నికలలో టికెట్ ఆశించి భంగపడ్డ ఎంసీ కోటిరెడ్డి, నర్సింహయ్య కుమారుడు నోముల భగత్, శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, స్థానిక సంస్థల ఎమ్మెల్సీ తేరా చిన్నపరెడ్డి, గడ్డంపల్లి రవీందర్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే గుండెబోయిన రామ్మూర్తియాదవ్ అల్లుడు గురవయ్యయాదవ్ తదితరులు టికెట్ రేసులో నిలిచారు. మంత్రి జగదీష్ రెడ్డి సన్నిహిత అనుచరుడు ఎంసీ కోటిరెడ్డి, నోముల భగత్, మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి పేర్లు ప్రముఖంగా విన్పిస్తున్నాయి. ఈ ముగ్గురు ఎవ్వరికివారే చాపకింద నీరులా ప్రచారం చేస్తున్నారనే చెప్పాలి. అధిష్టానం ఆదేశిస్తే.. పోటీ చేసేందుకు సిద్ధమేనన్న సంకేతాలను గుత్తా ఇప్పటికే పంపారు. మంత్రి చొరవతో తనకే టికెట్ దక్కుతుందన్న ఆశతో ఎంసీ కోటిరెడ్డి ధీమాతో ఉన్నారు. నోముల కుమారుడు భగత్ సిట్టింగ్ ఎమ్మెల్యే కుటుంబానికే సీఎం కేసీఆర్ టికెట్ ఇస్తారనే కోణంలో ఆశలు పెట్టుకున్నారు.
సర్వే నివేదికలు తెప్పించుకున్న అధిష్టానం
ఉపఎన్నిక టికెట్ ఆశిస్తున్న నేతల వ్యక్తిగత పనితీరు, ప్రజలతో సంబంధాలు, క్షేత్రస్థాయిలో వారి బలాబలాలపై సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ సర్వే ద్వారా నివేదిక తెప్పించుకున్నారని సమాచారం. ఈ విషయంపై నల్లగొండ జిల్లా టీఆర్ఎస్ నేతలతో పలుమార్లు మంత్రి కేటీఆర్ చర్చించారు. కాంగ్రెస్ నుంచి జానారెడ్డి పోటీ చేయనుండడంతో అందుకు దీటుగా టీఆర్ఎస్ అభ్యర్థి ఉండాలనే యోచనలో అధిష్టానం ఆలోచిస్తోంది. అందులో భాగంగానే సామాజిక వర్గాలు, ఓటర్లు, కులాల బలాబలాల ప్రతిపాదికన టికెట్ ఖరారు చేయనున్నట్టు తెలుస్తోంది.
వాస్తవానికి నాగార్జునసాగర్ నియోజకవర్గంలో నోముల నర్సింహయ్య హయాంలోనే గ్రూపు రాజకీయాలు మొదలయ్యాయి. సొంతపార్టీ నేతలు నోములను ఇబ్బందులకు గురి చేసేలా ప్రవర్తించడం.. ఎమ్మెల్యే తమను పట్టించుకోవడం లేదంటూ పరస్పర ఆరోపణలు నడిచాయి. దుబ్బాక ఉపఎన్నిక, జీహెచ్ఎంసీ ఫలితాల నేపథ్యంలో నాగార్జునసాగర్ ఉపఎన్నికలో విజయం సాధించాలనే బలమైన కాంక్షతో టీఆర్ఎస్ అధిష్టానం ఉంది. ఈ క్రమంలో సాగర్ నియోజకవర్గంలో గత ఎన్నికల్లో హామీనిచ్చి నేరవేర్చని కొన్నిపనులను సీఎం కేసీఆర్ మంజూరు చేశారు. నెల్లికల్ ఎత్తిపోతల పథకం, హాలియా డిగ్రీ కాలేజీ, గొర్రెల పంపిణీ పథకం వంటివి చేపట్టారు. ఈ క్రమంలోనే గ్రాండ్‌గా హాలియాలో బహిరంగ సభను నిర్వహించాలని పార్టీ అధిష్టానం నిర్ణయించింది.