‘గ్రేటర్’ వార్.. నామినేషన్ల ప్రక్రియ షురూ!

గ్రేటర్‌ హైదరాబాద్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ ఎన్నికల నగారా మోగింది. మంగళవారం ఉదయం హైదరాబాద్‌లోని మాసాబ్‌ట్యాంక్‌లో రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్‌ పార్థసారథి షెడ్యూల్‌ విడుదల చేశారు. గ్రేటర్‌ పరిధిలోని 150 వార్డులకు ఎన్నికలు జరుగుతాయని ప్రకటించారు. బుధవారం నుంచే నామినేషన్లను స్వీకరిస్తారు. డిసెంబరు ఒకటిన ఎన్నికలు జరుగుతాయి. ఇందుకోసం అధికార యంత్రాంగం అన్ని ఏర్పాట్లను పూర్తి చేసింది. బందోబస్తుకు 30 వేల మంది పోలీసులను వినియోగిచనున్నారు. దిశ, తెలంగాణ బ్యూరో: గ్రేటర్​ఎన్నికలకు నోటిఫికేషన్​ విడుదల అయ్యింది, 18వ […]

Update: 2020-11-17 22:15 GMT

గ్రేటర్‌ హైదరాబాద్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ ఎన్నికల నగారా మోగింది. మంగళవారం ఉదయం హైదరాబాద్‌లోని మాసాబ్‌ట్యాంక్‌లో రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్‌ పార్థసారథి షెడ్యూల్‌ విడుదల చేశారు. గ్రేటర్‌ పరిధిలోని 150 వార్డులకు ఎన్నికలు జరుగుతాయని ప్రకటించారు. బుధవారం నుంచే నామినేషన్లను స్వీకరిస్తారు. డిసెంబరు ఒకటిన ఎన్నికలు జరుగుతాయి. ఇందుకోసం అధికార యంత్రాంగం అన్ని ఏర్పాట్లను పూర్తి చేసింది. బందోబస్తుకు 30 వేల మంది పోలీసులను వినియోగిచనున్నారు.

దిశ, తెలంగాణ బ్యూరో: గ్రేటర్​ఎన్నికలకు నోటిఫికేషన్​ విడుదల అయ్యింది, 18వ తేదీ నుంచి 20వ తేదీ వరకు మూడు రోజుల పాటు నామినేషన్లు స్వీకరించనున్నారు. 21న నామినేషన్ల పరిశీలన, 24న నామినేషన్ల ఉపసంహరణ ఉంటుంది, అనంతరం అభ్యర్థుల తుది జాబితాను ప్రకటించి అదే రోజు గుర్తులు కేటాయిస్తారు. డిసెంబర్‌ ఒకటిన పోలింగ్‌ జరగనుంది. ఎక్కడైనా అనివార్య కారణాలతో పోలింగ్​వాయిదా పడితే తిరిగి డిసెంబర్‌ మూడున రీపోలింగ్‌ నిర్వహించనున్నట్లు ఎన్నికల సంఘం కమిషనర్ ప్రకటించారు. కొవిడ్​పరిస్థితుల నేపథ్యంలో పోలింగ్ సమయాన్ని గంటపాటు పెంచారు. ఉదయం ఏడు గంటల నుంచి సాయంత్రం ఆరు గంటల వరకు పోలింగ్‌ జరుగుతుందని చెప్పారు. డిసెంబర్ నాలుగున ఓట్ల లెక్కింపు నిర్వహించి అదే రోజు ఫలితాలు ప్రకటించనున్నట్లు వెల్లడించారు. షెడ్యూల్‌ విడుదలతో తక్షణమే ఎన్నికల కోడ్‌ అమలులోకి వచ్చిందని చెప్పారు.

2016 రిజర్వేషన్లతో ఎన్నికలు..

జీహెచ్ఎంసీ ఎన్నికలు బ్యాలెట్‌ పద్ధతిలోనే జరుగుతాయని పార్థసారధి వెల్లడించారు. జీహెచ్‌ఎంసీ చట్టం ప్రకారమే 150 వార్డులకు ఎన్నికలు నిర్వహిస్తామని, 2016 జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో అమలైన రిజర్వేషన్లే ఇప్పుడూ కొనసాగిస్తామని తెలిపారు. రిజర్వేషన్ల కేటాయింపులు అనేది ప్రభుత్వ వ్యవహారమని, అసెంబ్లీ ఓటర్ల జాబితా ఆధారంగానే ఈ‌ ఎన్నికలు నిర్వహిస్తామని పేర్కొన్నారు. 2020 జనవరి ఒకటి నాటికి 18 ఏళ్లు పూర్తి చేసుకున్న వారు ఓటు వేసేందుకు అర్హులని అన్నారు. బల్దియా పరిధిలో ఉన్న ఓటర్లలో 52.09 శాతం పురుషులు, 47.90 శాతం మహిళలు ఉన్నారని వివరించారు. జీహెచ్‌ఎంసీ పరిధిలో మొత్తం 74,04,000 మందికి పైగా ఓటర్లున్నారని, మైలార్‌దేవ్‌పల్లిలో అత్యధికంగా 79,290 మంది, రామచంద్రాపురంలో అత్యల్పంగా 27,997 మంది ఓటర్లు ఉన్నారని తెలిపారు. ఎన్నికల ఏర్పాట్ల ప్రక్రియకు కావాల్సిన అన్ని పనులు పూర్తి చేసినట్లు చెప్పారు. మేయర్ పదవి జనరల్‌ మహిళకు కేటాయించామని పేర్కొన్నారు. రెండు వార్డులు ఎస్టీలు, 10 వార్డులు ఎస్సీలకు, 50 బీసీలకు, జనరల్‌ మహిళ 44, మరో 44 స్థానాలు జనరల్‌కు రిజర్వు చేసినట్లు వివరించారు.

గ్రేటర్​ ఎన్నికలకు ప్రాధాన్యం..

గ్రేటర్‌ హైదరాబాద్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ ఎన్నికలకు ఎంతో ప్రాధాన్యం ఉందని పార్థసారధి అన్నారు. నోటిఫికేషన్‌ విడుదల చేసిన అనంతరం ఆయన మాట్లాడుతూ హైదరాబాద్ గ్లోబల్‌ సిటీ అని, ఇక్కడ నివసించాలని దేశవ్యాప్త ప్రజలు కోరుకుంటారన్నారు. వచ్చే ఫిబ్రవరిలో జీహెచ్‌ఎంసీ ప్రస్తుత పాలకవర్గం గడువు ముగుస్తుందని, రాజ్యాంగం ప్రకారం అంతకు మూడు నెలలలోపు ఎన్నికలు నిర్వహించాల్సి ఉందని అన్నారు. కొవిడ్‌ నిబంధనల మేరకు ఎన్నికలు నిర్వహిస్తున్నామని, ఈసారి ఎన్నికల్లో వార్డుల విభజన లేదని స్పష్టం చేశారు. ఎన్నికల కోసం జీహెచ్‌ఎంసీ, రాజకీయ పార్టీలతో సమావేశాలు నిర్వహించాక తుది ఓటరు జాబితా విడుదల చేసినట్లు చెప్పారు. అసెంబ్లీ ఎన్నికల ఓటరు జాబితా ప్రకారమే ఎలక్షన్స్‌ నిర్వహిస్తున్నామని, దాని ప్రకారమే ఏర్పాట్లు పూర్తి చేశామని అన్నారు. 150 వార్డుల్లో కౌంటింగ్‌ కేంద్రాలు, స్ట్రాంగ్‌ రూమ్స్‌ ఉంటాయన్నారు. ఈవీఎంలపై అభ్యంతరాలు రావడంతో బ్యాలెట్‌ పద్ధతిలోనే నిర్వహిస్తున్నామన్నారు. తెలుపు రంగు బ్యాలెట్‌ను వినియోగిస్తున్నట్లు పేర్కొన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ అభ్యర్థులు రూ.2500, ఇతరులు రూ.5 వేలు డిపాజిట్‌ చెల్లించాల్సి ఉంటుందన్నారు. అభ్యర్థులు నామినేషన్లు ఆన్‌లైన్‌లో దాఖలు చేయవచ్చని, ఫారం వెరిఫికేషన్‌ ఆన్‌లైన్‌లో చూసుకోవచ్చని, నామినేషన్​ పత్రాలను కూడా టీ పోల్​సాఫ్ట్​వేర్​ నుంచి డౌన్​లోడ్​ చేసుకోవచ్చని వివరించారు. నామినేషన్లను మాత్రం రిటర్నింగ్​ అధికారులకు సమర్పించాల్సి ఉంటుందన్నారు.

కరోనా నిబంధనలు..

కరోనా నిబంధనలు పాటిస్తూ ఎన్నికలు నిర్వహిస్తున్నట్లు పార్థసారధి తెలిపారు. పోలింగ్‌ కేంద్రాల్లో వన్‌ ప్లన్‌ త్రీ చొప్పున సిబ్బంది ఉంటారని, ఎన్నికలకు 48 వేల సిబ్బందిని వినియోగిస్తున్నామని వెల్లడించారు. పోలింగ్​కేంద్రాల ముసాయిదా జాబితాలో 9,238 పోలింగ్‌ స్టేషన్స్‌ ఉండగా, ఈ నెల 21న తుది జాబితా ప్రకటించనున్నామన్నారు. గ్రేటర్‌లో 257 క్రిటికల్‌, 1,439 సమస్యాత్మక, 1,004 అత్యంత సమస్యాత్మక పోలింగ్‌ కేంద్రాలను గుర్తించామని, ఆ ప్రాంతాల్లో అన్ని చర్యలు తీసుకున్నామని, బందోబస్తు ఏర్పాటు చేస్తున్నామని, ఎన్నికల్లో కోడ్‌ను ఉల్లంఘిస్తే కఠిన చర్యలుంటాయని హెచ్చరించారు. ప్రతి పోలింగ్‌ స్టేషన్‌కు ఇద్దరు పోలీసులతో బందోబస్తు నిర్వహిస్తారని, ఇందుకు 25 నుంచి 30 వేల మంది పోలీస్ సిబ్బందిని ఎన్నికలకు వినియోగించనున్నట్లు తెలిపారు. ఎన్నికల నిర్వహణ కోసం అక్కడక్కడా చెక్‌పోస్టులను ఏర్పాటు చేస్తున్నామన్నారు. 356 రూట్ మొబైల్ బృందాలు, 131 స్ట్రైకింగ్ ఫోర్స్, 44 స్పెషల్ స్ట్రైకింగ్ ఫోర్స్ బృందాలను ఏర్పాటు చేశామన్నారు. పోలింగ్‌‌కు 48 గంటల ముందు మద్యం విక్రయాలపై నిషేధం విధిస్తామన్నారు. గ్రేటర్​ఎన్నికల్లో ప్రతి ఓటర్‌కు ఓటరు స్లిప్స్‌ జారీ చేయనున్నామని, వెబ్‌సైట్‌, మొబైల్‌ యాప్‌ నుంచి పోల్‌ స్లిప్స్‌ డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చని వివరించారు. ఎన్నికల పర్యవేక్షణ కోసం ఒక్కో జోన్‌కు ఐఏఎస్‌ అధికారిని అబ్జర్వర్​గా మొత్తం ఆరుగురిని నియమించినట్లు చెప్పారు. ఈ-ఓటింగ్‌కు అవకాశం లేదని పార్ధసారధి స్పష్టం చేశారు.

ప్రచారంపై నిఘా..

గ్రేటర్ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థి ఖర్చు పరిమితి రూ.5 లక్షలు మాత్రమేనని పార్థసారధి వెల్లడించారు. ఎన్నికలు ముగిసిన తర్వాత 45 రోజుల లోపు అభ్యర్థి ఖర్చుల వివరాలను ఎస్​ఈసీకి సమర్పించాలన్నారు. తప్పుడు వివరాలు సమర్పించినా, ఖర్చు లెక్కలు ఇవ్వకున్నా అభ్యర్థులపై మూడేళ్లపాటు అనర్హుడిగా ప్రకటిస్తామన్నారు. 150 డివిజన్లకు 150 మంది ఆర్వోలు, 150 కౌంటింగ్ సెంటర్లు ఉంటాయని, నవంబర్ 21న పోలింగ్ కేంద్రాలను ప్రకటిస్తామని అన్నారు. ఈ నెల 24 నుంచి ప్రచారం మొదలవుతుందని, ప్రచారశైలిపై నిరంతరం నిఘా ఉంటుందని పేర్కొన్నారు. ఖర్చు వివరాలను క్షుణ్ణంగా పరిశీలిస్తామన్నారు. బుధవారం నుంచి మొదలయ్యే ఎన్నికల పర్వం 14 రోజుల్లో ముగియనుంది. ప్రచారానికి ఆరు రోజుల సమయమిచ్చారు. నోటిఫికేషన్​ జారీ చేసిన అనంతరం నామినేషన్లను స్వీకరించనున్నారు. దీంతో గ్రేటర్​మహా పోరు ప్రారంభం కానుంది.

షెడ్యూల్​..

నామినేషన్ల స్వీకరణ … నవంబర్ -18 నుంచి
నామినేషన్లకు చివరి రోజు నవంబర్ -20 (సాయంత్రం 5 గంటల వరకు)
నామినేషన్ల పరిశీలన నవంబర్ -21
నామినేషన్ల ఉపసంహరణ నవంబర్ -24
అభ్యర్థుల తుది జాబితా, గుర్తులు కేటాయింపు నవంబర్ -24
ప్రచారానికి గడువు -24 రాత్రి నుంచి 29 రాత్రి 10 గంటల వరకు
పోలింగ్​ డిసెంబర్ -01
రీపోలింగ్ (అవసరమైతే)​ డిసెంబర్ -03
ఓట్ల లెక్కింపు.. ఫలితాలు డిసెంబర్ -04

రిజర్వేషన్లు ఇలా..

మొత్తం వార్డులు : 150
మహిళలకు : 75
ఎస్టీలకు : 02 (1 జనరల్​, 1 మహిళ)
ఎస్సీలకు : 10 (5 జనరల్​, 5 మహిళలు)
బీసీలకు : 50 (25 జనరల్​, 25 మహిళలు)
జనరల్​ (మహిళలు) : 44
అన్ ​రిజర్వుడు : 44

Tags:    

Similar News