ఉస్మానియా టు గచ్చిబౌలి 'టిమ్స్'
దిశ, రంగారెడ్డి: గచ్చిబౌలిలోని స్పోర్ట్స్ టవర్ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిగా మారింది. రాష్ట్రానికే మణిహారంగా ఉండేలా ముఖ్యమంత్రి దీనికి ‘టిమ్స్’ (తెలంగాణ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్) నామకరణం చేశారు. దీనికి లాంఛనంగా మంగళవారం ప్రారంభోత్సవం కూడా జరిగింది. ఇకపై వైద్య చికిత్సలు ప్రారంభం కావాల్సి ఉంది. నగరంలోని ఉస్మానియా జనరల్ ఆసుపత్రికి అనుబంధంగా ఆవిర్భవించిన ఈ ఆసుపత్రి ఇకపై కరోనా అనుమానిత కేసులను ఐసొలేషన్‌లో ఉంచేందుకు ఉపయోగపడనుంది. ఆ అవసరాల కోసం ఉస్మానియా జనరల్ ఆసుపత్రి […]
దిశ, రంగారెడ్డి: గచ్చిబౌలిలోని స్పోర్ట్స్ టవర్ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిగా మారింది. రాష్ట్రానికే మణిహారంగా ఉండేలా ముఖ్యమంత్రి దీనికి ‘టిమ్స్’ (తెలంగాణ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్) నామకరణం చేశారు. దీనికి లాంఛనంగా మంగళవారం ప్రారంభోత్సవం కూడా జరిగింది. ఇకపై వైద్య చికిత్సలు ప్రారంభం కావాల్సి ఉంది. నగరంలోని ఉస్మానియా జనరల్ ఆసుపత్రికి అనుబంధంగా ఆవిర్భవించిన ఈ ఆసుపత్రి ఇకపై కరోనా అనుమానిత కేసులను ఐసొలేషన్‌లో ఉంచేందుకు ఉపయోగపడనుంది. ఆ అవసరాల కోసం ఉస్మానియా జనరల్ ఆసుపత్రి నుంచి కొన్ని వైద్య పరికరాలను, సిబ్బందిని తరలించే ప్రక్రియ ప్రారంభమైంది. అత్యాధునిక సౌకర్యాలన్నీ ఈ ఆసుపత్రిలో సమకూరుస్తున్నందున భవిష్యత్తులో ఉస్మానియా జనరల్ ఆసుపత్రి పరిమిత స్థాయిలోనే కొనసాగనుంది. గత కొంతకాలంగా ఉస్మానియా ఆసుపత్రి మరమ్మత్తులకు కూడా నోచుకోలేకపోతోంది. వారసత్వ కట్టడంగా ఉండడంతో దానిపై ప్రభుత్వం కూడా ఆచితూచి అడుగేయాల్సి వస్తోంది. ఫలితంగా పేషెంట్లకు సౌకర్యాలు కల్పించడంలో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఈ నేపథ్యంలో ఉస్మానియా ఆసుపత్రిపై భారం తగ్గించి గచ్చిబౌలి ‘టిమ్స్’ను ప్రత్యామ్నాయంగా తీర్చిదిద్దే పనులు ముమ్మరంగా జరుగుతున్నాయి.
కరోనా కేసులు ఎంత పెద్ద సంఖ్యలో వచ్చినా ప్రభుత్వం సర్వసన్నద్ధంగా ఉందని స్వయంగా ముఖ్యమంత్రి కేసీఆర్ పలు సందర్భాల్లో ప్రకటించారు. అప్పటికే గచ్చిబౌలి ఆస్పత్రిని కరోనా అనుమానిత పేషెంట్లను ఐసొలేషన్‌లో ఉంచడానికి వినియోగించనున్నట్లు ప్రభుత్వానికి స్పష్టత ఉంది. కరోనా పాజిటివ్‌గా తేలిన కేసులన్నీ గాంధీ ఆస్పత్రికే వెళ్తున్నాయి. అయితే ఐసొలేషన్ అవసరాలను దృష్టిలో పెట్టుకుని స్వల్ప సమయంలోనే గచ్చిబౌలి స్పోర్ట్స్ టవర్‌ను ప్రభుత్వం సిద్ధం చేసింది. కరోనా సమస్య ఉన్నంతవరకు ఐసొలేషన్ అవసరాల కోసం మాత్రమే కొనసాగే గచ్చిబౌలి సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి ఆ తర్వాత పూర్తిస్థాయి ఆస్పత్రిగా మారనుంది. అప్పటివరకూ కరోనా అనుమానితులను ఐసొలేషన్ వార్డుల్లో ఉంచి చికిత్స చేయనున్నట్లు ఉస్మానియా డాక్టర్లు పేర్కొన్నారు.
గచ్చిబౌలిలోని 14 అంతస్తుల స్పోర్ట్స్ భవనంలో 540 గదులను పూర్తిస్థాయిలో అసుపత్రిగా మార్చారు అధికారులు. 1500 పడకలతో ఐసోలేషన్ కేంద్రంగా, 50 పడకలతో అత్యవసర చికిత్స విభాగాలను ఏర్పాటు చేశారు. బుధవారం నుంచి ఈ ఆసుపత్రిలో కరోనా పాజిటివ్ కేసులకు చికిత్స చేయనున్నట్లు టిమ్స్ సూపరింటెండెంట్, ఆర్ఎంవోలు తెలిపారు. ఉస్మానియా ఆసుపత్రికి వచ్చే రోగుల్లో కరోనా అనుమానితులు ఉన్నట్లయితే అక్కడ ఉంచుకోకుండా వెంటనే గచ్చిబౌలికి తరలిస్తామని తెలిపారు. ఇందుకోసం వాహనాలను కూడా సిద్ధం చేశామని, కొద్దిమంది సిబ్బందిని ఇప్పటికే అక్కడకు పంపించామని వివరించారు. ఇకపైన కూడా ఈ ప్రక్రియ కొనసాగుతుందని, కరోనా సమస్య సమసిపోయిన తర్వాత ఉస్మానియా తరహాలో టిమ్స్ కొత్త హంగులను సమకూర్చుకుంటుందని తెలిపారు.
ఉస్మానియాలో ఇక పరిమిత చికిత్స :
నిజాంకాలం నాటి ఉస్మానియా ఆస్పత్రి ప్రస్తుతం శిథిలావస్థకు చేరుకుంది. ఆస్పత్రిలో పైకప్పు పెచ్చులూడిపోతున్నాయి. చాలా సందర్భాల్లో అవి వార్డుల్లో పేషెంట్ల మీద పడుతున్నాయి. పేషెంట్లు, వారికి సహాయకంగా ఉండేవారు, డ్యూటీ డాక్టర్లపై పడి గాయపడిన సంఘటనలు కూడా ఉన్నాయి. ఈ ఆసుపత్రిని తరలించడానికి గతంలో ప్రభుత్వం ప్రయత్నాలు చేసింది. మరమ్మత్తులకూ కొన్ని ఆటంకాలు ఎదురయ్యాయి. అదే స్థలంలో కొత్త నిర్మాణాలు చేయాలన్న ప్రయత్నాలూ బెడిసికొట్టాయి. హెరిటేజ్ (వారసత్వ కట్టడం) నిబంధనలు అడ్డురావడంతో ప్రభుత్వం ధైర్యం చేయలేకపోయింది. ఇప్పుడు గచ్చిబౌలి స్పోర్ట్స్ టవర్ అందుబాటులోకి రావడంతో ‘టిమ్స్’గా తయారైంది. ఉస్మానియా ఆస్పత్రిని పరిమిత స్థాయిలో నడిపిస్తూ మెజారిటీ కేసులను టిమ్స్‌కు బదిలీ చేయాలన్న ఆలోచన ఉంది. అందులో భాగమే ప్రస్తుతం ఉస్మానియా ఆసుపత్రి సూపరింటెండెంట్ నాగేందర్, ఆర్ఎంవో సిద్వికాలేతో పాటు మరికొందరిని టిమ్స్ అధికారులుగా కొనసాగించాలని ప్రభుత్వం సూచించింది.
Tags: Telangana, Corona, Isolation Wards, Osmania General Hospital, TIMS