ప్రాణం ఉన్నంత వరకు గౌడ్స్ హక్కుల కోసం పోరాడుతా
దిశ, తెలంగాణ బ్యూరో : ప్రాణం ఉన్నంత వరకు కల్లుగీత కార్మికుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని, వృత్తి బలోపేతానికి పాటుపడతానని రాష్ట్ర ఆబ్కారీ, క్రీడా, పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ స్పష్టం చేశారు. వృత్తిదారులను ఆదుకుంటున్న ఏకైక సీఎం కేసీఆర్ మాత్రమే అన్నారు. ప్రమాదవశాత్తు మరణించిన, శాశ్వత, తాత్కాలిక అంగ వైకల్యం పొందిన కల్లుగీత కార్మికులకు రాష్ర్ట ప్రభుత్వం మంజూరు చేసిన రూ. 13.96 కోట్ల ఆర్థిక సాయం పంపిణీని గురువారం రవీంద్ర […]
దిశ, తెలంగాణ బ్యూరో : ప్రాణం ఉన్నంత వరకు కల్లుగీత కార్మికుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని, వృత్తి బలోపేతానికి పాటుపడతానని రాష్ట్ర ఆబ్కారీ, క్రీడా, పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ స్పష్టం చేశారు. వృత్తిదారులను ఆదుకుంటున్న ఏకైక సీఎం కేసీఆర్ మాత్రమే అన్నారు. ప్రమాదవశాత్తు మరణించిన, శాశ్వత, తాత్కాలిక అంగ వైకల్యం పొందిన కల్లుగీత కార్మికులకు రాష్ర్ట ప్రభుత్వం మంజూరు చేసిన రూ. 13.96 కోట్ల ఆర్థిక సాయం పంపిణీని గురువారం రవీంద్ర భారతి వేదికగా కేసీఆర్ అభయ హస్తం పథకం కింద అందజేశారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రాష్ట్ర ప్రమాదవశాత్తు మరణించిన 126 మంది కల్లుగీత కార్మికులకు రూ. 5 లక్షల చొప్పున, శాశ్వత వైకల్యం పొందిన 147 మందికి రూ. 5 లక్షల చొప్పున, తాత్కాలిక అంగ వైకల్యం పొందిన 315 మందికి రూ. 10 వేల చొప్పున ఆర్థికసాయం అందజేశామన్నారు. హరితహారంలో భాగంగా 3 కోట్ల 25 లక్షల ఈత, తాటి మొక్కలను నాటామని గుర్తు చేశారు.
గౌడ వృత్తిదారుల భవనం కోసం కోకాపేట్‌లో కేటాయించిన 5 ఎకరాలు రూ. 300 కోట్ల విలువైన స్థలాన్ని సీఎం కేసీఆర్ కేటాయించారని, ఆ భవన నిర్మాణానికి రాష్ర్ట ప్రభుత్వం రూ. 5 కోట్లు మంజూరు చేసిందన్నారు. త్వరలోనే పనులు ప్రారంభించనున్నట్లు వెల్లడించారు. గౌడ వృత్తిదారులే కల్లుగీసి అమ్మేలా ప్రత్యేక జీవో , నీరా పాలసీని తీసుకొచ్చిన ఘనత సీఎం కేసీఆర్‌కే దక్కుతుందన్నారు. కులవృత్తుల వారు ఆత్మగౌరవంతో బతికేలా సీఎం కేసీఆర్ ఎన్నో పథకాలు అమలు చేస్తున్నారని తెలిపారు.
సర్దార్ సర్వాయి పాపన్నగౌడ్ నిర్మించిన సర్వాయిపేటలో కోటరక్షణకు ప్రత్యేక చర్యలు చేపట్టామని, అది చరిత్రకు ఆనవాళ్లుగా నిలువనుందన్నారు. ట్యాంక్‌బండ్‌పై రూ.20 కోట్లతో నీరా కేఫ్ ఏర్పాటు చేస్తున్నామని, ప్రతి జిల్లా కేంద్రంలో నీరా కేఫ్‌లు ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. ఔత్సాహికులు ముందుకు వస్తే లైసెన్సులు కూడా ఇస్తామని వెల్లడించారు. త్వరలో గౌడ సోదరులకు డిజైన్‌తో కూడిన లూనాలు అందిస్తామని వెల్లడించారు. గౌడ్ లకు వృత్తిపన్ను, ఎక్సైజ్ సుంకం రద్దు చేసింది తెలంగాణ ప్రభుత్వమేనన్నారు.
ఈ కార్యక్రమంలో మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, ఎమ్మెల్యే దానం నాగేందర్, మాజీ ఎంపీ బూర నర్సయ్యగౌడ్, గీత కార్పొరేషన్ మాజీ చైర్మన్ కటికం సత్తయ్యగౌడ్, బీసీ వెల్పేర్ సెక్రటరీ బూర వెంకటేశం గౌడ్, గౌడ సంఘాల ప్రతినిధులు పల్లె లక్ష్మణ్ గౌడ్, విజయ్ కుమార్, రవీందర్ గౌడ్, నగేష్, మాజీ ఎమ్మెల్యే రాజలింగం, నాగమణి, వట్టికూటి రామారావుగౌడ్, రాజేందర్, సర్పరాజ్, గౌడ సంఘాల నాయకులు, గౌడ కులస్తులు పాల్గొన్నారు.