అంచనాలకు మించిన ప్రత్యక్ష పన్ను వసూళ్లు!
దిశ, వెబ్‌డెస్క్: ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో నికర ప్రత్యక్ష పన్ను వసూళ్లు రూ. 6 లక్షల కోట్లకు చేరుకున్నాయని కేంద్ర రెవెన్యూ శాఖ కార్యదర్శి తరుణ్ బజాజ్ అన్నారు. అంతేకాకుండా ఈ ఆర్థిక సంవత్సరంలో వస్తు, సేవల పన్ను(జీఎస్టీ) నెలవారీ సగటు రూ. 1.15 లక్షల కోట్లుగా ఉండవచ్చని అంచనా వేస్తున్నామని, దీంతో 2021-22లో ప్రభుత్వ పన్ను వసూళ్ల అంచనాలను మించిపోతాయని తరుణ్ బజాజ్ పేర్కొన్నారు. పెట్రోల్, డీజిల్‌లపై ఎక్సైజ్ సుంకంతో పాటు వంటనూనెలపై కస్టమ్స్ సుంకం […]
దిశ, వెబ్‌డెస్క్: ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో నికర ప్రత్యక్ష పన్ను వసూళ్లు రూ. 6 లక్షల కోట్లకు చేరుకున్నాయని కేంద్ర రెవెన్యూ శాఖ కార్యదర్శి తరుణ్ బజాజ్ అన్నారు. అంతేకాకుండా ఈ ఆర్థిక సంవత్సరంలో వస్తు, సేవల పన్ను(జీఎస్టీ) నెలవారీ సగటు రూ. 1.15 లక్షల కోట్లుగా ఉండవచ్చని అంచనా వేస్తున్నామని, దీంతో 2021-22లో ప్రభుత్వ పన్ను వసూళ్ల అంచనాలను మించిపోతాయని తరుణ్ బజాజ్ పేర్కొన్నారు.
పెట్రోల్, డీజిల్‌లపై ఎక్సైజ్ సుంకంతో పాటు వంటనూనెలపై కస్టమ్స్ సుంకం తగ్గింపుతో ఈ ఆర్థిక సంవత్సరం ప్రభుత్వ ఖజానాకు దాదాపు రూ. 75,000-80,000 కోట్ల మధ్య నష్టం వాటిల్లుతుందని చెప్పారు. రీఫండ్‌ల తర్వాత అక్టోబర్ నాటికి ప్రత్యక్ష పన్ను వసూళ్లలో దాదాపు రూ. 6 లక్షల కోట్లకు చేరుకున్నాము. ఇది సానుకూల పరిణామం. పరిస్థితులు ఆశాజనకంగా ఉన్నాయని తరుణ్ బజాజ్ అన్నారు. జీఎస్టీ ఆదాయం నవంబర్‌లో మెరుగ్గా ఉండొచ్చని, డిసెంబర్‌లో కొంత ప్రతికూలంగా మారి అనంతరం మార్చి త్రైమాసికంలో తిరిగి జీఎస్టీ వసూళ్లు పెరిగే అవకాశం ఉందని తరుణ్ బజాజ్ అభిప్రాయపడ్డారు.
ప్రభుత్వం ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి పన్ను వసూళ్ల మొత్తం 9.5 శాతం వృద్ధితో రూ. 22.2 లక్షల కోట్లుగా అంచనా వేసింది. ఇందులో ప్రత్యక్ష పన్నుల ద్వారా దాదాపు రూ. 11 లక్షల కోట్లతో సహా కార్పొరేట్ పన్ను ద్వారా రూ. 5.47 కోట్లు, ఆదాయ పన్ను ద్వారా రూ. 5.61 లక్షల కోట్ల ఆదాయం వస్తుందని అంచనా.