కరోనా మాటున కబ్జాలు

దిశ, మేడ్చల్: ప్రపంచ దేశాలన్నీ కరోనా వైరస్ (కొవిడ్ -19) మహమ్మారి వ్యాప్తితో వణికిపోతున్నాయి. ఓ వైపు దాన్ని నియంత్రించేందుకు అధికారులు, పోలీసులు అహర్నిశలు శ్రమిస్తున్నారు. మరోవైపు లాక్‌డౌన్‌తో ప్రజలు ఇళ్లకే పరిమితమవుతున్నారు. ఇంతకంటే మంచి సమయం వారికి కన్పించలేదేమో మరి. రాత్రికి రాత్రి రూ.కోట్ల విలువ చేసే భూముల కబ్జాకు ప్రయత్నిస్తున్నారు. రోజురోజూకీ కరోనా వైరస్ తీవ్రత పెరుగుతున్న నేపథ్యంలో అధికారులు ఆ డ్యూటీల్లో నిమగ్నమవుతున్నారు. ఇదే అదునుగా భావించిన అక్రమార్కులు ప్రభుత్వ భూములపై కన్నేసి […]

Update: 2020-04-05 04:15 GMT

దిశ, మేడ్చల్: ప్రపంచ దేశాలన్నీ కరోనా వైరస్ (కొవిడ్ -19) మహమ్మారి వ్యాప్తితో వణికిపోతున్నాయి. ఓ వైపు దాన్ని నియంత్రించేందుకు అధికారులు, పోలీసులు అహర్నిశలు శ్రమిస్తున్నారు. మరోవైపు లాక్‌డౌన్‌తో ప్రజలు ఇళ్లకే పరిమితమవుతున్నారు. ఇంతకంటే మంచి సమయం వారికి కన్పించలేదేమో మరి. రాత్రికి రాత్రి రూ.కోట్ల విలువ చేసే భూముల కబ్జాకు ప్రయత్నిస్తున్నారు. రోజురోజూకీ కరోనా వైరస్ తీవ్రత పెరుగుతున్న నేపథ్యంలో అధికారులు ఆ డ్యూటీల్లో నిమగ్నమవుతున్నారు. ఇదే అదునుగా భావించిన అక్రమార్కులు ప్రభుత్వ భూములపై కన్నేసి కాజేస్తున్నారు. మేడ్చల్ జిల్లా జవహర్‌నగర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని ల్యాండ్ మాఫియా తీరిది.

చెట్టూ, పుట్టా.. కాదేది కబ్జాకు అనర్హం.. అన్న చందంగా కన్పించిన ఖాళీ స్థలాన్నంతా ఆక్రమించేశారు. ఎక్కడ ప్రభుత్వ భూమి కన్పిస్తే.. అక్కడ గద్దల్లా వాలిపోయారు. ఎకరాలకు ఎకరాలు మాయం చేశారు. అడ్డొచ్చిన వారికి అమ్యామ్యాలివ్వడం.. వినకపోతే స్థానిక నేతల సాయంతో బెదిరించడం.. ఇలా రియల్ వ్యాపారుల అక్రమ దందా మూడు పువ్వులు ఆరు కాయలు అన్న చందంగా సాగుతోంది.

రూ.కోట్లు విలువచేసే ప్రభుత్వ భూమి..

మేడ్చల్ జిల్లాలో 7,925 ఎకరాల ప్రభుత్వ భూమి ఆక్రమణకు గురయ్యింది. జిల్లాలో గజం భూమి విలువ కనీసం రూ.25వేలకు పైగా పలుకుతుంది. అందుకే ల్యాండ్ మాఫియా కన్ను ఇటువైపు పడింది. ఇందులో భాగంగానే జవహర్ నగర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని మల్కారం, ఫరానగర్‌లోని సర్వే నంబర్ 1,021, 1,028, 1,032, 1,038 నెంబర్లలో ప్రభుత్వ భూమి ఉంది. దీన్ని ఇప్పటికే కొంతమంది కబ్జాదారులు మాయం చేసేందుకు ప్రయత్నించారు. దీనిపై పలువురు రెవెన్యూ ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయడంతో ఆ ప్రయత్నాలు ముందుకు సాగలేదు. కాని లాక్‌డౌన్ కారణంగా ఎవరూ ఇళ్లలో నుంచి బయటకు రాకపోవడం.. అధికారులు సైతం కరోనా వైరస్ డ్యూటీలో బిజీగా ఉండటం వల్ల కబ్జాదారుల పని సులువయ్యింది.

ప్రభుత్వ భూమిని ప్లాట్లుగా చేసి..

కొందరు భూ కబ్జాదారులు జవహర్ నగర్ కార్పొరేషన్ పరిధిలోని మల్కారం ఫరానగర్ లో గల సర్వే నెంబర్ 1,021, 1,028, 1,032, 1,038 లోని ప్రభుత్వ స్థలాన్ని యథేచ్ఛగా కబ్జాచేసి ప్లాట్లుగా విభజించి అమాయక ప్రజలకు కట్టబెట్టి లక్షల్లో సొమ్ము చేసుకుంటున్నారు. ఇప్పటికే ఈ స్థలం విషయంలో రెవెన్యూ అధికారులు భూ కబ్జాదారులను గతంలోనే హెచ్చరించారు. అయినా వీరి ఆగడాలకు అడ్డూ అదుపు లేకుండా పోయింది. కరోనా సమస్యతో రెవెన్యూ, పోలీసు యంత్రాంగం ప్రజాసేవలో అంకితమై ఉన్నారని గమనించిన భూ కబ్జాదారులు ఇదే సరైన సమయమని భావించి తమ పని తాము చాపకింద నీరులా చేసుకుంటూ పోతున్నారు. అయితే ఇలాంటి విపత్కర సమయంలో రెవెన్యూ ఉన్నతాధికారులు వీరిపై ఏమైనా చర్యలు తీసుకుంటారా లేదా అన్నది వేచిచూడాల్సిందే.

Tags: corona virus, covid 19, realtors, land mafia, eye on govt land

Tags:    

Similar News