రాజమ్మ కష్టాలు విని.. కంటతడి పెట్టిన గవర్నర్

దిశ, తెలంగాణ బ్యూరో: సరైన ఇల్లు లేక చెట్టుకిందనే ఏళ్ళ తరబడి జీవిస్తున్న ఓ నిరుపేద వృద్ధురాలిని గవర్నర్ తమిళిసై సౌందర్ రాజన్ బుధవారం రాజ్‌భవన్‌లో విందుకు ఆహ్వానించారు. వికలాంగుడైన కొడుకు యోగక్షేమాలు చూసుకుంటూ కాలం నెట్టుకొస్తున్న 75ఏళ్ళ వృద్ధురాలి జీవితంలో ఎదురైన కష్టాలను విని తెలుసుకున్న గవర్నర్ కంట తడి పెట్టుకున్నారు. స్వంతంగా కొంత నగదును, నిత్యావసరాలను సమకూర్చారు. సకాలంలో వైద్యం అందక కోడలిని, మనుమరాలిని పోగొట్టుకున్న వృద్ధురాలి అనుభవం నేపథ్యంలో ఇకపైన ఏ ఒక్కరూ […]

Update: 2021-01-06 11:45 GMT

దిశ, తెలంగాణ బ్యూరో: సరైన ఇల్లు లేక చెట్టుకిందనే ఏళ్ళ తరబడి జీవిస్తున్న ఓ నిరుపేద వృద్ధురాలిని గవర్నర్ తమిళిసై సౌందర్ రాజన్ బుధవారం రాజ్‌భవన్‌లో విందుకు ఆహ్వానించారు. వికలాంగుడైన కొడుకు యోగక్షేమాలు చూసుకుంటూ కాలం నెట్టుకొస్తున్న 75ఏళ్ళ వృద్ధురాలి జీవితంలో ఎదురైన కష్టాలను విని తెలుసుకున్న గవర్నర్ కంట తడి పెట్టుకున్నారు. స్వంతంగా కొంత నగదును, నిత్యావసరాలను సమకూర్చారు. సకాలంలో వైద్యం అందక కోడలిని, మనుమరాలిని పోగొట్టుకున్న వృద్ధురాలి అనుభవం నేపథ్యంలో ఇకపైన ఏ ఒక్కరూ వైద్యం అందని కారణంతో తనువు చాలించరాదని అభిప్రాయపడ్డారు. ప్రభుత్వానికి కూడా ప్రాథమిక ఆరోగ్య కేంద్రం మొదలు అన్ని ప్రభుత్వాసుపత్రుల్లో అత్యవసర, కనీస మందులు అందుబాటులో ఉండేలా చొరవ తీసుకోనున్నారు.

జనగామ జిల్లా పాలకుర్తి మండలం లక్ష్మీనారాయణపురం గ్రామంలో ఇటీవల కురిసిన వర్షాల కారణంగా నిలువ నీడ లేక ఇబ్బంది పడుతున్న రాజమ్మ అనే వృద్ధురాలిని చూసి చలించిపోయిన స్థానిక ఎస్ఐ సతీష్ తన రెండు నెలల జీతం ద్వారా వచ్చిన రూ. 80వేలను, స్నేహితుల దగ్గర పోగుచేసిన మరో రూ. 80 వేలను కలిపి ఇల్లు కట్టించి ఇచ్చారు. ఈ విషయాన్ని తెలుసుకున్న గవర్నర్ ఆ వృద్ధురాలిని స్వయంగా రాజ్‌భవన్‌కు పిలిపించి ఆమె జీవితంలో ఎదుర్కొన్న కష్టాలను అడిగి తెలుసుకున్నారు. పాముకాటుకు గురై ఆమె మనుమరాలు చనిపోయారు. సరైన వైద్యం అందకపోవడంతో అనారోగ్యంపాలైన కోడలు కూడా మృతి చెందారు. ఇప్పుడు అంగవైకల్యంతో మంచం నుంచి కదలలేని కొడుకు బాగోగులు చూసుకుంటున్నారు. నడవలేని స్థితిలో, నిలువ నీడ లేకున్నా బతుకు పోరాటం చేస్తున్నారు.

రాజమ్మ దయనీయ పరిస్థితి విని కంట తడి పెట్టిన గవర్నర్ కొంత నగదు సాయాన్ని, నిత్యావసరాలను అందించి ఇంటికి సాగనంపారు. ఆపదలో ఆదుకున్న ఎస్ఐ సతీష్‌ కృషిని అభినందించి ప్రశంసా పత్రాన్ని అందజేశారు. పేదరికం, సామాజిక చిన్నచూపు ఏ వ్యక్తికీ వైద్యం అందకుండా ఉండడానికి కారణాలుగా ఉండరాదని, ప్రతీ ఒక్కరికీ తారతమ్యాలు లేని వైద్యసేవలు లభించాల్సిన అవసరం ఉందని గవర్నర్ నొక్కిచెప్పారు. ముఖ్యంగా పల్లె ప్రాంతాల్లోని ఆరోగ్య కేంద్రాల్లో పాముకాటుకు అవసరమైన మందులు తప్పనిసరిగా ఉండాలని అభిప్రాయపడ్డారు.

Tags:    

Similar News