‘కమీషన్​’ ఏదీ.?.. రూ. 155 కోట్ల కమీషన్​ పెండింగ్​

దిశ, తెలంగాణ బ్యూరో : ధాన్యం కొనుగోలు కమీషన్​ ఆంక్షల మధ్య చిక్కుకుంది. సీజన్​లో కొనుగోళ్ల కోసం పట్టుబట్టి, కేంద్రాలను ఏర్పాటు చేయించే ప్రభుత్వం కమీషన్​ ఇప్పించడంలో మాత్రం చేతులెత్తేస్తోంది. తాజాగా గన్నీ సంచుల లెక్క తేలితేనే కొనుగోలు కేంద్రాల నిర్వాహకులకు కమీషన్​ వచ్చే పరిస్థితి నెలకొంది. ఎఫ్​సీఐ నుంచి వచ్చిన గన్నీ సంచుల లెక్కలు తేలడం లేదని ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వానికి లేఖలు రాశారు. కొనుగోళ్లు, చెల్లింపులు, లక్ష్యాలను అన్నీ పక్కన పెట్టి గన్నీ సంచుల […]

Update: 2021-04-14 22:09 GMT

దిశ, తెలంగాణ బ్యూరో : ధాన్యం కొనుగోలు కమీషన్​ ఆంక్షల మధ్య చిక్కుకుంది. సీజన్​లో కొనుగోళ్ల కోసం పట్టుబట్టి, కేంద్రాలను ఏర్పాటు చేయించే ప్రభుత్వం కమీషన్​ ఇప్పించడంలో మాత్రం చేతులెత్తేస్తోంది. తాజాగా గన్నీ సంచుల లెక్క తేలితేనే కొనుగోలు కేంద్రాల నిర్వాహకులకు కమీషన్​ వచ్చే పరిస్థితి నెలకొంది. ఎఫ్​సీఐ నుంచి వచ్చిన గన్నీ సంచుల లెక్కలు తేలడం లేదని ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వానికి లేఖలు రాశారు. కొనుగోళ్లు, చెల్లింపులు, లక్ష్యాలను అన్నీ పక్కన పెట్టి గన్నీ సంచుల లెక్క తేల్చిన తర్వాతే కమీషన్​ చెల్లిస్తామనే తరహాలో ఎఫ్​సీఐ స్పష్టం చేసింది. మరోవైపు యాసంగి కొనుగోళ్లపై దృష్టి పెట్టిన రాష్ట్ర ప్రభుత్వం గన్నీ సంచుల వివరాలను పట్టించుకునే పరిస్థితుల్లో లేదు. ఫలితంగా మహిళా సంఘాలకు కమీషన్​ దక్కుతుందా లేదా అనే సందేహాలు నెలకొన్నాయి.

48.84 లక్షల ధాన్యం కొనుగోలు

వానాకాలం సీజన్​లో రాష్ట్ర వ్యాప్తంగా 6,497 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి 48.84 లక్షల మెట్రిక్​ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేశారు. అందులో లావు ధాన్యం 28.89 లక్షలు, సన్నాలు 19.95 లక్షల మెట్రిక్​ టన్నులు. మొత్తం 10,98,940 మంది రైతులు ధాన్యం విక్రయించగా రూ. 9,091.31 కోట్లు చెల్లించారు. వాస్తవంగా వానాకాలం సీజన్‌కు సంబంధించి ధాన్యం కొనుగోళ్లలో ప్రభుత్వం నిర్ణీత లక్ష్యంలో సగాన్ని మాత్రమే చేరుకోగలిగింది. 85.69 లక్షల టన్నుల ధాన్యం కొనుగోలు చేస్తామని ప్రకటించిన ప్రభుత్వం మొత్తం 48.84 లక్షల మెట్రిక్‌ టన్నులు కొనుగోలు చేసి కేంద్రాలను మూసేసింది.

రూ. 155 కోట్ల కమీషన్​ పెండింగ్​

ప్రభుత్వం తరుపున ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాల నిర్వహణను మొత్తం మహిళా సంఘాలకు అప్పగించారు. ప్రతిఏటా మహిళా సంఘాలే ఈ కొనుగోళ్ల ప్రక్రియను పూర్తి చేస్తున్నాయి. ప్రభుత్వ కేంద్రాల్లో కొనుగోలు చేసిన ధాన్యం క్వింటా ఒక్కింటికి ఏ గ్రేడ్‌కు రూ.32, కామన్‌గ్రేడ్‌ రకానికి రూ.31.50పైసలు చొప్పున పౌరసరఫరాలశాఖ నుంచి మహిళా సంఘాలకు కమీషన్‌ చెల్లించాల్సి ఉంది. కమీషన్​ వస్తుండటంతో మహిళా సంఘాలు వంతుల వారీగా ఈ కొనుగోళ్లను నిర్వహిస్తున్నాయి. గతంలో కొంత మేరకు ఆలస్యంగానైనా మహిళలకు కమీషన్​ చెల్లించేవారు. కానీ ఈసారి కమీషన్​ పెండింగ్​లో పెట్టారు. ప్రభుత్వ లెక్కల ప్రకారం రాష్ట్ర మహిళలకు రూ. 155 కోట్లు కమీషన్​ రూపంలో రావాల్సి ఉంది.
వాస్తవంగా ధాన్యం కొనుగోలు కేంద్రాల నిర్వహణతో వచ్చే కమీషన్​తో మహిళా సంఘాలు ఆర్థికాభివృద్ధి వ్యాపారాలను నిర్వహించుకుంటున్నాయి. తిరిగి చెల్లింపులు లేని సొమ్ము కావడంతో ఉమ్మడిగా మహిళా సంఘాలు పెట్టుబడులు పెట్టుకునేవి.

ముందు గన్నీ లెక్క తేల్చండి

కొనుగోలు కేంద్రాల ఏర్పాటు సందర్భంగా ఎఫ్‌సీఐ నుంచి రాష్ట్రానికి గన్నీ సంచులను తరలించారు. వీటికి తోడుగా రాష్ట్రంలోని రేషన్​ దుకాణాల నుంచి కూడా కొంతమేరకు సేకరించుకున్నారు. వానాకాలంలో మొత్తం దాదాపుగా 21 కోట్ల గన్నీ సంచులు అవసరముండగా… ఇందులో 10 కోట్లు కొత్తవాటిని పంపించగా… 9 కోట్లు పాత గన్నీ సంచులను ఇచ్చారు. మిగిలిన వాటిని స్థానికంగా సేకరించుకున్నారు. అయితే గన్నీ సంచుల సంఖ్యలో చాలా తేడాలు వచ్చినట్లు తర్వాత గుర్తించారు. స్థానికంగా తీసుకున్న వాటికి, ఎఫ్​సీఐ పంపినవాటితో లెక్క కుదరలేదు. ఫలితంగా ఇది వివాదంగా మారింది.
అయితే ఎఫ్‌సీఐ, రాష్ట్రం మధ్య వివాదం మహిళా సంఘాల కమీషన్‌కు లింకు పెట్టినట్లుగా మారింది. గన్నీ సంచుల లెక్కలు తేలిన తర్వాతే కమీషన్​ను విడుదల చేస్తామంటూ ఎఫ్‌సీఐ స్పష్టంగా పేర్కొంటోంది. కానీ ప్రభుత్వానికి మాత్రం అధికారికంగా చెప్పడం లేదు. కమీషన్​విషయంలో ఏం తేల్చడం లేదు. అటు ప్రభుత్వం కూడా గన్నీ సంచుల విషయాన్ని తేల్చడం లేదు. ఫలితంగా మహిళా సంఘాల కమీషన్ రావడం లేదు.

 

Tags:    

Similar News