చేపల మార్కెటింగ్‌పై ప్రభుత్వం మరో కీలక అడుగు
దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్రంలో ఉత్పత్తి అవుతున్న చేపలను ప్రైవేటు భాగస్వామ్యంతో మార్కెటింగ్ చేపట్టేందుకు ప్రభుత్వం పరిశీలన చేస్తోందని పశు సంవర్థక, మత్స్యశాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. శనివారం మాసాబ్ ట్యాంక్ లోని తన కార్యాలయంలో మత్స్యశాఖ అధికారులతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. 2016-17 ఏడాదిలో రాష్ట్రంలో 1.97 లక్షల టన్నుల చేపల ఉత్పత్తి ఉండగా, 2020-21 సంవత్సరంలో 3.49 లక్షల టన్నులకు పెరిగిందని వివరించారు. రాష్ట్రంలో ఉత్పత్తి అవుతున్న చేపల్లో 60శాతం […]
దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్రంలో ఉత్పత్తి అవుతున్న చేపలను ప్రైవేటు భాగస్వామ్యంతో మార్కెటింగ్ చేపట్టేందుకు ప్రభుత్వం పరిశీలన చేస్తోందని పశు సంవర్థక, మత్స్యశాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. శనివారం మాసాబ్ ట్యాంక్ లోని తన కార్యాలయంలో మత్స్యశాఖ అధికారులతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. 2016-17 ఏడాదిలో రాష్ట్రంలో 1.97 లక్షల టన్నుల చేపల ఉత్పత్తి ఉండగా, 2020-21 సంవత్సరంలో 3.49 లక్షల టన్నులకు పెరిగిందని వివరించారు.
రాష్ట్రంలో ఉత్పత్తి అవుతున్న చేపల్లో 60శాతం రాష్ట్ర అవసరాలకు వినియోగిస్తుండగా, 21 శాతం పశ్చిమ బెంగాల్, 19 శాతం అస్సాం, తమిళనాడు, కేరళ తదితర రాష్ట్రాలకు ఎగుమతి చేస్తున్నామని పేర్కొన్నారు. మత్స్యకారులు దళారులకు తక్కువ ధరలకు చేపలను విక్రయించి నష్టపోతున్నారని, వారికి ఆర్థికంగా లబ్ధి చేకూర్చే ఉద్దేశంతో మత్స్య ఫెడరేషన్ ఆధ్వర్యంలో నేరుగా మత్స్యకార సంఘాల నుండి చేపలను కొనుగోలు చేయాలని యోచిస్తున్నట్లు తెలిపారు. మత్స్య ఫెడరేషన్ కొనుగోలు చేసిన చేపలను నాణ్యతా ప్రమాణాలతో తెలంగాణ చేపలు బ్రాండ్ తో మార్కెటింగ్ చేసేందుకు ప్రణాళికలను రూపొందిస్తున్నట్లుగా వివరించారు. మార్కెటింగ్ వ్యవస్థను పటిష్టపర్చడంలో భాగంగా మొబైల్ ఫిష్ ఔట్ లెట్స్ ను ప్రారంభించిన విషయాన్ని గుర్తుచేశారు.
మత్స్య సొసైటీల నుండి కొనుగోలు చేసిన చేపలను 2 లేదా 3 మండలాలను కలిపి ఒక క్లస్టర్ గా ఏర్పాటు చేసి అక్కడికి రవాణా చేయాలని ప్రణాళికలను రూపొందిస్తున్నట్లు వివరించారు. రాష్ట్రం మొత్తం సుమారు 200 వరకు క్లస్టర్ లను ఏర్పాటు చేసేందుకు పరిశీలిస్తున్నట్లు ఆయన చెప్పారు. 40 నుండి 50 క్లస్టర్ లకు ఒక ప్రధాన ప్రాసెసింగ్ యూనిట్ లకు అనుసంధానం చేయడం జరుగుతుందన్నారు. మొదటగా హైదరాబాద్ లోని శేరిగూడ, ఖమ్మం, కరీంనగర్, నిజామాబాద్, వరంగల్ లలో ఉన్న మత్స్య శాఖ కు చెందిన భూములలో అంతర్జాతీయ నాణ్యతా ప్రమాణాలతో ప్రధాన ప్రాసెసింగ్ యూనిట్ లను ఏర్పాటు చేయడానికి చర్యలు తీసుకోనున్నట్లు వివరించారు.
ఈ ప్రాసెసింగ్ యూనిట్లలో క్లస్టర్ల నుండి వచ్చిన చేపలను గ్రేడింగ్ చేయడం, ప్యాకింగ్ చేయడం, శుద్ధి చేయడం, ఫిష్ ఔట్ లెట్లకు సరఫరా చేయడం, ఇతర మార్కెట్లకు సరఫరా చేయడం లేదా ఇతర రాష్ట్రాలకు పంపించడం వంటి ప్రక్రియలు చేపట్టనున్నట్లు మంత్రి తలసాని వివరించారు. పెరిగిన మత్స్య సంపదకు అనుగుణంగా ప్రైవేట్ భాగస్వామ్యంతో (ఫ్రాంచైజ్) మరిన్ని కొత్త ఫిష్ ఔట్ లెట్ లను ప్రారంభించనున్నట్లు మంత్రి పేర్కొన్నారు. రాష్ట్రంలో కావలసినంతగా చేపల లభ్యత ఉన్నప్పటికీ వినియోగదారులకు చేపలను అందించలేకపోతున్నామని అన్నారు.
రాష్ట్రంలో మంచినీటి వనరులు విస్తారంగా ఉన్నాయని, 365 రోజులు నీరు నిల్వ ఉంటుందని చెప్పారు. మత్స్యకారులు కేవలం వేసవి కాలంలో మాత్రమే చేపల వేటను కొనసాగిస్తున్నారని, సంవత్సరం పొడవునా చేపల వేట నిర్వహించేలా, పట్టిన చేపలు పరిశుభ్రంగా ఉంచేలా అవగాహన కల్పించేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. మత్స్య ఫెడరేషన్ ద్వారా చేపట్టబోయే మార్కెటింగ్ వలన సుమారు 500 మందికి ప్రత్యక్షంగా, 5వేల మందికి పరోక్షంగా ఉపాధి లభిస్తుందని వివరించారు.