అంతా బోగస్.. రాత్రికి రాత్రే ప్రభుత్వ, ప్రైవేటు భూములకు పట్టాలు

దిశప్రతినిధి, నిజామాబాద్ : నిజామాబాద్ నగరంలో రియల్ బూమ్ పెరగడం, నగర విస్తరణ, నుడా పరిధిలోకి రావడంతో అక్రమార్కుల కన్ను ప్రభుత్వ భూములు, ప్రైవేట్ భూములపై పడింది. దీంతో భూముల ధరలు అమాంతం పెరిగాయి. దీనిని అదునుగా భావించిన కొందరు నకిలీ పత్రాలు తయారు చేసి లిటిగేషన్ మొదలు సర్కారు, ప్రైవేట్ భూములను కబ్జా చేస్తున్నారు. వారికి రెవెన్యూ సహకారం, సర్వేయర్ల అండదండలు ఉండటంతో భూములకు రాత్రికి రాత్రే యజమానులు పుట్టుకొస్తున్నారు. గతంలో పని చేసిన తహసీల్ధార్ల […]

Update: 2021-10-08 12:14 GMT

దిశప్రతినిధి, నిజామాబాద్ : నిజామాబాద్ నగరంలో రియల్ బూమ్ పెరగడం, నగర విస్తరణ, నుడా పరిధిలోకి రావడంతో అక్రమార్కుల కన్ను ప్రభుత్వ భూములు, ప్రైవేట్ భూములపై పడింది. దీంతో భూముల ధరలు అమాంతం పెరిగాయి. దీనిని అదునుగా భావించిన కొందరు నకిలీ పత్రాలు తయారు చేసి లిటిగేషన్ మొదలు సర్కారు, ప్రైవేట్ భూములను కబ్జా చేస్తున్నారు. వారికి రెవెన్యూ సహకారం, సర్వేయర్ల అండదండలు ఉండటంతో భూములకు రాత్రికి రాత్రే యజమానులు పుట్టుకొస్తున్నారు. గతంలో పని చేసిన తహసీల్ధార్ల సంతకాలతో పాత పట్టాల తయారీ జరిగిపోతోంది. కొత్తగా ఆన్‌‌లైన్ చేర్చడం, తొలగించడం, రికార్డల మార్పులు జరుగుతుండటంతో రియల్ దందాలో ఇప్పుడు ఇ ట్రెండ్ జోరుగా సాగుతోంది.

ప్రభుత్వ భూములను కబ్జా చేయడానికి కొందరు అక్రమార్కులు కొత్త పంథాను అలవర్చుకున్నారు. అందుకోసం రెవెన్యూ ఉద్యోగి సూత్రధారిగా వ్యవహరిస్తున్నారు. నిజామాబాద్ అర్బన్‌‌లో తహసీల్దార్ కార్యాలయం కేంద్రంగా ప్రభుత్వ భూములను అన్యాక్రాంతం చేస్తూ దర్జాగా కబ్జా చేస్తున్నారు. ఆ తర్వాత రెవెన్యూ డిపార్ట్మెంట్‌లోని భూమి సంబంధిత పత్రాలను తారుమారు చేసి ఇ ఆన్లైన్ చేసుకొని లక్షలాది రూపాయలకు అమ్మకాలు జరుపుతున్నారు. రూ. 20 వేలు ఖర్చు పెడితే చాలు రూ.25 లక్షలు సంపాదించవచ్చు అనే ఆలోచనతో కొంతమంది ప్రభుత్వ భూములను లక్ష్యంగా ఈ దందా కొనసాగిస్తు్న్నారు.

ఉదాహరణకు నిజామాబాద్ సౌత్ మండలం పరిధిలోని ఓ ప్రధాన రహదారికి పర్లాంగు దూరంలోని ఓ ప్రభుత్వంపై కన్నేశారు కొంతమంది కబ్జారాయుళ్లు. ఇంకేముంది వెంటనే ఆ ప్రభుత్వ భూమిని కొనుగోలు చేసినట్లు దానిపై నకిలీ పత్రాలు తయారు చేసి అసలు కథ మొదలు పెట్టారు. దానికి సమీపంలో ఉన్న పట్టా భూమికి సంబంధించిన యజమాని వివరాలను సేకరించారు. తర్వాతి భాగంలో రెవెన్యూ కార్యాలయంలో అధికారిని పట్టుకుని ఏకంగా ఆ భూములు ఆన్లైన్లో లేకుండా చేశారు. అలా చేసిన తర్వాత సదరు పట్టాదారు నుంచి ఒరిజినల్ పత్రాలను తీసుకుని కొంత మొత్తం ఇచ్చి చేతులు దులుపుకున్నారు. ఇంతవరకు బాగానే ఉన్నా అసలు కథ ఇక్కడే మొదలైంది. సదరు భూమిని పట్టా భూమిగా మార్చి అమ్మకాలు జరిపేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేస్తారు. ఇందుకోసం ఓ అధికారి చక్రం తిప్పి అసలు కథలో ఆన్లైన్లో ఉన్న రికార్డులలో భూ యజమానుల పేర్లని తీసేసి అక్రమార్కుల పేర్లను ఎక్కించారు. దాని ఆధారంగానే రిజిస్ట్రేషన్ కార్యాలయంలో మరోసారి చక్రం తిప్పి రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. ఇప్పుడు అ భూమి హట్ కేక్‌గా మారి కాసులు కురిపిస్తోంది.

ఒక వేళ ప్రభుత్వ భూమిని కబ్జా చేయదలిచినట్లయితే భూమికి ఇంటి నంబర్లను అంటే మున్సిపాలిటీలో అసెస్మెంట్ నెంబర్లను వేయించి వాటి ద్వారా ఆ భూమిని తమ ఆధీనంలోకి తీసుకుంటారు. తదుపరి ఇంటి నంబరు ప్రకారం ఇతరులకు లక్షల రూపాయలకు అమ్మకాలు చేస్తున్నారు. ఈ కోవలోనే నిజామాబాద్ నగరంలో ప్రభుత్వ భూములు అన్యాక్రాంతం అవుతున్నాయి. నాగారంలోని కథ యథావిధిగా ఇలాగే సాగింది. ఏకంగా ఈ వ్యవహారంలో నకిలీ పట్టా పాస్ బుక్కులను తయారుచేసి నకిలీ పత్రాల ద్వారా రెవెన్యూ శాఖలో పత్రాలను తారుమారు చేశారు. రెవెన్యూ అధికారులు మాత్రం లక్షల రూపాయలు మూటగట్టుకొని భూ అక్రమార్కులకు పత్రాలను అనుకూలంగా మారుస్తున్నారు. వాస్తవానికి గతంలోనే రెవెన్యూ రికార్డులు కాలిపోయాయి అని సమాధానం చెప్పే రెవెన్యూ అధికారులు మాత్రం అక్రమార్కుల అడ్డం పెట్టుకుని ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు.

లక్షలాది రూపాయల భూములను అన్యాక్రాంతం చేస్తున్నారు. ఇదిలా ఉంటే నగరంలోని ఓ ప్రభుత్వ భూమిని రాజకీయ నాయకుడు ఒకరు కబ్జా చేసి ఏకంగా ప్లాట్లు చేసి అమ్మకాలు జరిపారు. దీనిపై ఇటీవల మున్సిపల్ అధికారులు, రెవెన్యూ అధికారులు సర్వే చేసి స్వాధీనం చేసుకున్నారు. దీంతో బాధితులు రోడ్డున పడ్డారు. జిల్లా అధికారులకు ఫిర్యాదు చేసిన దీనిపై కనీసం స్పందించడం లేదు. ఇలా నిజామాబాద్ అర్బన్‌లో అక్రమార్కుల ఆగడాలకు అంతులేకుండా పోయింది. తలా పాపం తిలా పిడికెడు అన్నట్లు ఇటు రెవెన్యూ అధికారులు రికార్డుల పేరుతో, మరోవైపు మున్సిపల్ అధికారులు అసెస్మెంట్ నెంబర్ల పేరుతో లక్షలు దండుకుంటున్నారు. కానీ ఈ ప్లాట్లను కొనుగోలు చేసిన బాధితులు మాత్రం లబోదిబోమంటున్నారు. ఎవరికి చెప్పుకోవాలో తెలీక విలపిస్తున్నారు.

Tags:    

Similar News