ఉద్యోగులకు శుభవార్త.. త్వరలోనే..

దిశ, న్యూస్ బ్యూరో: రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల పదవీ విరమణ వయసు పెంపునకు ముహూర్తం దాదాపు ఖరారైంది. జూలై రెండోవారంలో ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించే అవకాశం ఉంది. అదే నెల నుంచి ఈ నిర్ణయం అమలులోకి వస్తుందని సమాచారం. ఈ అంశంపై ఇప్పటికే పలు రాష్ట్రాల్లో అమలవుతున్న తీరును ప్రభుత్వం అధ్యయనం చేసింది. ఏపీ, కర్ణాటక, మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, బీహార్, గుజరాత్, పంజాబ్ రాష్ట్రాల్లో ఉద్యోగుల పదవీ విరమణ వయస్సు 60 ఏండ్లుగా ఉంది. […]

Update: 2020-06-29 20:37 GMT

దిశ, న్యూస్ బ్యూరో: రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల పదవీ విరమణ వయసు పెంపునకు ముహూర్తం దాదాపు ఖరారైంది. జూలై రెండోవారంలో ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించే అవకాశం ఉంది. అదే నెల నుంచి ఈ నిర్ణయం అమలులోకి వస్తుందని సమాచారం. ఈ అంశంపై ఇప్పటికే పలు రాష్ట్రాల్లో అమలవుతున్న తీరును ప్రభుత్వం అధ్యయనం చేసింది. ఏపీ, కర్ణాటక, మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, బీహార్, గుజరాత్, పంజాబ్ రాష్ట్రాల్లో ఉద్యోగుల పదవీ విరమణ వయస్సు 60 ఏండ్లుగా ఉంది. దీంతో తెలంగాణలో 61 ఏండ్లు చేసేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా టీఆర్ఎస్ తన ఎన్నికల మేనిఫెస్టోలోనే ఈ హామీ ఇచ్చింది. ఇప్పటికే దీనిపై నిర్ణయం తీసుకోవాల్సి ఉండగా పలు కారణాలతో వాయిదా పడుతూ వస్తోంది. దాదాపు రెండేళ్లు కావస్తున్నా పీఆర్సీ నివేదిక ప్రభుత్వానికి ఇంకా అందలేదు. ప్రస్తుతం రాష్ట్ర ఆర్థిక పరిస్థితుల నేపథ్యంలో ఖజానా మీద పదవీ విరమణ భారం పడే అవకాశం ఉంది. దానికంటే పదవీ విరమణ వయస్సును పెంచడమే ఉత్తమమని ప్రభుత్వం భావిస్తోంది. అధికారిక ప్రకటన వెలువడితే వెంటనే అది అమలులోకి వచ్చే అవకాశం ఉందని ఉద్యోగులు అభిప్రాయపడుతున్నారు.

ఖజానాపై తగ్గనున్న భారం

పదవీ విరమణ పెంపు, పీఆర్సీ కమిషన్ అంశాల్లో ఉద్యోగ సంఘాలు లెక్కలేసి ప్రభుత్వానికి నివేదిక సమర్పించాయి. ఈ ఏడాది నుంచి 2023 వరకు పదవీ విరమణ చేసే ఉద్యోగులు, వారికి చెల్లించాల్సిన రిటైర్మెంట్ బెనిఫిట్స్ వంటి వివరాలన్నింటినీ అందులో పేర్కొన్నాయి. ఈ మూడేండ్ల కాలంలో పదవీ విరమణ పెంపుతో ప్రభుత్వ ఖజానాకు రూ.11,725 కోట్లు మిగులుతాయని, ఆర్థిక భారం ఉండదని వివరించాయి. ఇప్పుడున్న పరిస్థితుల్లో ప్రభుత్వానికి కూడా ఇది ఆర్థికంగా ఉపశమనం కల్గించే అంశమే. కరోనా కలవరం నేపథ్యంలో పీఆర్సీ, ఐఆర్ వంటి డిమాండ్ల జోలికి వెళ్లకుండా పదవీ విరమణ వయస్సు పెంపుపై నిర్ణయం తీసుకుంటే ఉద్యోగుల్లో అసంతృప్తిని తగ్గించగల్గుతామని ప్రభుత్వానికి ఆ సంఘాల నేతలు విన్నవించారు. ఎన్నికల తర్వాత ఉద్యోగులకు రెగ్యులర్‌గా వచ్చే డీఏ తప్ప ఎలాంటి ప్రయోజనాలు అందలేదని అంటున్నారు. రిటైర్మెంట్‌పై నిర్ణయం తీసుకోవాల్సిన సమయం ఇదేనని సూచిస్తున్నారు. ఈ మూడేండ్లు పదవీ విరమణ చేసేవారికి రూ.14,781 కోట్లు చెల్లించాల్సి వస్తుంది. వయస్సు పరిమితిని పెంచితే రూ.3,055.68 కోట్లు వేతనాలుగా చెల్లిస్తే చాలు. ప్రభుత్వానికి రూ.11,725 కోట్ల ఆర్థిక భారం తగ్గుతుందని నివేదికలో వెల్లడించారు.

జూలై నుంచే అమలు?

పదవీ విరమణ పెంపును జూలై నుంచి అమల్లోకి తీసుకురావాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. మూడు నెలల వేతనాల్లో కోత పెట్టిన సర్కారు జూన్ నుంచి పూర్తి జీతం ఇస్తున్నట్లు ప్రకటించింది. వేతనాల్లో కోత పెట్టడంపై ఉద్యోగ సంఘాల్లో తీవ్ర అసంతృప్తి ఉంది. ఇలాంటి సమయంలో పదవీ విరమణ వయస్సు పెంపు నిర్ణయం తీసుకుంటే పరిస్థితి చల్లబడుతుందని సంఘాల నేతలు ప్రభుత్వానికి నచ్చచెప్పారు. వాస్తవంగా ఇప్పటికే పీఆర్సీ రెండేండ్లు వెనక్కి పోయింది. రెండు సంవత్సరాల కిందటే పీఆర్సీ ప్రకటించాల్సి ఉంది. కానీ ప్రభుత్వం పీఆర్సీ కమిటీ గడువు పెంచుతూ కాలయాపన చేస్తోంది. పదవీ విరమణ వయస్సును పెంచితే రిటైర్మెంట్‌కు దగ్గరగా ఉన్న వారికి పీఆర్సీ కలిసి రానుంది. దీంతో ఉద్యోగుల్లో కొంత సానుకూలంగా మారుతుందని భావిస్తున్నారు.

01-04-2020 నుంచి 31-03-2021 వరకు
పదవీ విరమణ పొందే ఉద్యోగులు 9790
చెల్లించాల్సిన రిటైర్మెంట్ బెనిఫిట్స్ రూ. 4895 కోట్లు
నెలనెలా పదవీ విరమణ చేసే వారికి చెల్లించాల్సింది రూ. 407.92 కోట్లు
వేతనాల రూపంలో చెల్లించాల్సిన సొమ్ము రూ. 83.22 కోట్లు
ప్రతినెలా మిగులుతున్న సొమ్ము రూ. 324.70 కోట్లు
రిటైర్మెంట్ వయస్సు పెంచితే మిగిలే సొమ్ము రూ. 3896.40 కోట్లు

01-04-2021 నుంచి 31-03-2022 వరకు
పదవీ విరమణ పొందే ఉద్యోగులు 9419
చెల్లించాల్సిన రిటైర్మెంట్ బెనిఫిట్స్ రూ. 4709.50 కోట్లు
ప్రతినెలా పదవీ విరమణ చేసే వారికి చెల్లించాల్సింది రూ. 392.46 కోట్లు
వేతనాల రూపంలో చెల్లించాల్సిన సొమ్ము రూ. 81.66 కోట్లు
ప్రతినెలా మిగులుతున్న సొమ్ము రూ. 310.80 కోట్లు
రిటైర్మెంట్ వయస్సు పెంచితే మిగిలే సొమ్ము రూ. 3729.60 కోట్లు

01-04-2022 నుంచి 31-03-2023 వరకు
పదవీ విరమణ పొందే ఉద్యోగులు 10,353
చెల్లించాల్సిన రిటైర్మెంట్ బెనిఫిట్స్ రూ. 5176.50 కోట్లు
ప్రతినెలా పదవీ విరమణ చేసే వారికి చెల్లించాల్సింది రూ. 431.36 కోట్లు
వేతనాల రూపంలో చెల్లించాల్సిన సొమ్ము రూ. 89.76 కోట్లు
ప్రతినెలా మిగులుతున్న సొమ్ము రూ. 341.06 కోట్లు
రిటైర్మెంట్ వయస్సు పెంచితే మిగిలే సొమ్ము రూ. 4099.20 కోట్లు

Tags:    

Similar News