ఓరుగల్లులో గులాబీకి గుబులు

దిశ ప్రతినిధి, వరంగల్: గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల ఫలితాల ప్రభావం త్వరలో జరిగే వరంగల్ కార్పొరేషన్ ఎన్నికలపై పడనుందా? ఇక్కడ కూడా టీఆర్ఎస్‌కు బీజేపీ గట్టి పోటీ ఇవ్వనుందా? అనే ప్రశ్నలు ఉత్పన్నం అవుతున్నాయి. దీంతో గులాబీ శ్రేణుల్లో ఆందోళన మొదలైంది. గతంలో వరంగల్ కార్పొరేషన్‌పై కాషాయజెండా ఎగిరిన చరిత్ర ఉంది. 2006కు ముందు బీజేపీ పార్టీ వరంగల్ మేయర్ పీఠాన్ని అధిష్ఠించింది. ప్రస్తుతం టీఆర్ఎస్ పార్టీపై ప్రజల్లో నెలకొన్న వ్యతిరేకత బీజేపీకి కలిసొచ్చేలా ఉందనే ప్రచారం […]

Update: 2020-12-06 02:12 GMT

దిశ ప్రతినిధి, వరంగల్: గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల ఫలితాల ప్రభావం త్వరలో జరిగే వరంగల్ కార్పొరేషన్ ఎన్నికలపై పడనుందా? ఇక్కడ కూడా టీఆర్ఎస్‌కు బీజేపీ గట్టి పోటీ ఇవ్వనుందా? అనే ప్రశ్నలు ఉత్పన్నం అవుతున్నాయి. దీంతో గులాబీ శ్రేణుల్లో ఆందోళన మొదలైంది. గతంలో వరంగల్ కార్పొరేషన్‌పై కాషాయజెండా ఎగిరిన చరిత్ర ఉంది. 2006కు ముందు బీజేపీ పార్టీ వరంగల్ మేయర్ పీఠాన్ని అధిష్ఠించింది. ప్రస్తుతం టీఆర్ఎస్ పార్టీపై ప్రజల్లో నెలకొన్న వ్యతిరేకత బీజేపీకి కలిసొచ్చేలా ఉందనే ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో అధికార పార్టీ నేతలు అయోమయానికి గురవుతున్నారు. అంతేకాకుండా టీఆర్ఎస్ కార్పొరేటర్ అభ్యర్థుల మధ్య నెలకొన్న పోటీ కారణంగా అసంతృప్తులకు బీజేపీ నేతలు గాలం వేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ అంశాలన్నీ వెరసి ఎక్కడ కొంప ముంచుతాయోనని టీఆర్ఎస్ ప్రజా ప్రతినిధులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

సర్కార్‌పై వ్యతిరేకత?

తెలంగాణ రాష్ట్రం ఆవిర్భావం తర్వాత జరిగిన కార్పొరేషన్ ఎన్నికల్లో టీఆర్ఎస్ విజయకేతనం ఎగురవేసింది. వరంగల్ మున్సిపల్ పరిధిలో 58 డివిజన్లకు గానూ 44 స్థానాలకు పైగా గెలిచి సింగిల్ లార్జెస్ట్ పార్టీగా అవతరించింది. ఆ తర్వాత మరి కొందరు కార్పొరేటర్లు అధికార పార్టీలో చేరడంతో ఆ సంఖ్య 53కు చేరింది. కానీ గడిచిన ఐదున్నరేళ్ల కాలంలో చెప్పుకోదగిన అభివృద్ధి జరగలేదనే విమర్శలున్నాయి. నగరంలో సుమారు 5 వేలకు పైగా డబుల్ బెడ్ రూం ఇండ్లు నిర్మించి ఇస్తానన్న హామీని ప్రభుత్వం విస్మరించిందనే విమర్శలున్నాయి.

వరద బాధితులను పట్టించుకోలే!

ఇటీవల నగరంలో కురిసిన వర్షాలకు లోతట్టు ప్రాంతాలు, పలు కాలనీలు నీట మునిగాయి. మురికివాడల ప్రజలకు తీవ్ర నష్టం వాటిల్లింది. రోడ్లన్నీ దెబ్బతిన్నాయి. కానీ బాధితులను ఆదుకోవడంలో ప్రజా ప్రతినిధులు నిర్లక్ష్యం ప్రదర్శించారని ప్రచారంలో ఉంది. వరద బాధితులకు ఆర్థిక సాయం చేయలేదని బాధితులు ఇప్పటికీ వాపోతున్నారు. దీనికి తోడు కేంద్ర ప్రభుత్వం స్మార్ట్ సిటీ, హృదయ్ పథకం కింద విడుదల చేసిన నిధులు సైతం రాష్ట్ర ప్రభుత్వం మింగేసి మొండి చేయి చూపిందనే ఆరోపణలు ఉన్నాయి. ఇలాంటి తరుణంలో ఎన్నికలు నిర్వహిస్తే మెజారిటీ స్థానాలు కోల్పోయే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.

జోరు మీదున్న బీజేపీ..

దుబ్బాక ఉప ఎన్నికల్లో విజయకేతనం, గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో సాధించిన సీట్లతో బీజేపీ నాయకులు ఉత్సాహంతో ఉన్నారు. త్వరలో జరగనున్న వరంగల్ కార్పొరేషన్ ఎన్నికల్లో మేయర్ పీఠాన్ని కైవసం చేసుకోవాలనే లక్ష్యంతో ముందుకు సాగుతున్నారు. టీఆర్ఎస్‌లోని అసంతృప్తులను లాక్కొని ఎలాగైనా మెజార్టీ సీట్లు సాధించాలని పట్టుదలతో ఉన్నట్లు తెలుస్తోంది. ఇటీవల నగరంలో వరదలు సంభవించినప్పుడు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, నిజామాబాద్ ఎంపీ అర్వింద్ కుమార్ వరంగల్‌లో పర్యటించారు. బాధితులను కలిసి పరామర్శించి అన్ని విధాలా ఆదుకుంటామని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా ప్రజల నుంచి అనూహ్యమైన స్పందన లభించింది. దీనిని జీర్ణించుకోలేని టీఆర్ఎస్ శ్రేణులు ఎంపీ కాన్వాయ్‌పై దాడికి దిగారు. ఈ ఘటనను ప్రజలు ఖండించిన ఘటనలు ఉన్నాయి. బీజేపీ నేతల పట్ల ప్రజలు సానుభూతి వ్యక్తం చేశారు.

బీజేపీలోకి కీలక నేతలు..

ఇప్పటికే ఇతర పార్టీలకు చెందిన సీనియర్ నేతలు కాషాయ కండువా కప్పుకున్నారు. జిల్లాకు చెందిన టీడీపీ సీనియర్ నేతలు గరికపాటి మోహన్ రావు, రేవూరి ప్రకాశ్ రెడ్డి, మరికొందరు బీజేపీలో చేరారు. దాదాపు టీడీపీ నేతలంతా బీజేపీలో చేరుతున్నారు. అంతే కాకుండా వరంగల్ నగరానికి చెందిన మాజీ ఎమ్మెల్యేలు మార్తినేని ధర్మారావు, వన్నాల శ్రీరాములు, మందాడి సత్యనారాయణ, కొండేటి శ్రీధర్ పార్టీలో చురుగ్గా వ్యవహరిస్తున్నారు. యువ నాయకులను కలుపుకుని కార్పొరేషన్ ఎన్నికల్లో విజయఢంకా మోగించేందుకు వ్యూహాలు రచిస్తున్నారు.

Tags:    

Similar News