హైదరాబాద్.. అష్టదిగ్బంధం !

– కరోనా బాధితుల ఇళ్ళకు జియో ట్యాగింగ్ దిశ, హైదరాబాద్ : కొవిడ్ -19 వ్యాప్తి కారణంగా హైదరాబాద్ నగరాన్ని ప్రభుత్వ అధికారులు అష్ట దిగ్బంధనం చేశారు. ఈ వైరస్‌ మరింత వ్యాప్తి చెందకుండా ఉండేందుకు జీహెచ్ఎంసీ కట్టుదిట్టమైన చర్యలు ప్రారంభించింది. నగరంలోని కొవిడ్ -19 ప్రభావిత ప్రాంతాలను గుర్తించి, వాటికి కంటైన్మెంట్ క్లస్టర్లుగా నామకరణం చేసింది. ఇప్పటికే అధికారులు బాధితుల ఇళ్ళకు జియో ట్యాగింగ్‌ను పూర్తి చేయడంతో పాటు ఆ ప్రాంతాల్లో రాకపోకలను నిలిపివేసింది. ఇంకెంత […]

Update: 2020-04-09 11:03 GMT

– కరోనా బాధితుల ఇళ్ళకు జియో ట్యాగింగ్

దిశ, హైదరాబాద్ : కొవిడ్ -19 వ్యాప్తి కారణంగా హైదరాబాద్ నగరాన్ని ప్రభుత్వ అధికారులు అష్ట దిగ్బంధనం చేశారు. ఈ వైరస్‌ మరింత వ్యాప్తి చెందకుండా ఉండేందుకు జీహెచ్ఎంసీ కట్టుదిట్టమైన చర్యలు ప్రారంభించింది. నగరంలోని కొవిడ్ -19 ప్రభావిత ప్రాంతాలను గుర్తించి, వాటికి కంటైన్మెంట్ క్లస్టర్లుగా నామకరణం చేసింది. ఇప్పటికే అధికారులు బాధితుల ఇళ్ళకు జియో ట్యాగింగ్‌ను పూర్తి చేయడంతో పాటు ఆ ప్రాంతాల్లో రాకపోకలను నిలిపివేసింది. ఇంకెంత మంది కరోనా బాధితులు ఉన్నారో తేల్చేందుకు ఇంటింటి సర్వేకు శ్రీకారం చుట్టింది.

12 ప్రాంతాల్లో 89 పాజిటివ్ కేసులు..

తెలంగాణలో రోజురోజుకీ పాజిటివ్ కేసులు పెరుగుతున్న దృష్ట్యా.. వైరస్ వ్యాప్తి నివారణకు ప్రభుత్వం కఠిన చర్యలను ప్రారంభించింది. రాష్ట్రం నుంచి ఢిల్లీ నిజాముద్దీన్ ప్రార్థనలకు 1089 మంది వెళ్ళినట్టుగా గుర్తించిన ప్రభుత్వం.. వారిలో జీహెచ్ఎంసీ పరిధిలోనే సుమారు 604 మంది ఉన్నట్టుగా గుర్తించింది. కాగా, వీరిలో ఇప్పటి వరకు 175 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ప్రధానంగా నగరంలోని 12 ప్రాంతాల్లో 89 పాజిటివ్ కేసులు ఉన్నందున, పరిస్థితి మరింత చేజారకుండా ఉండేలా ముందస్తు చర్యలు చేపట్టాలని జీహెచ్ఎంసీ భావించింది. అందులో భాగంగానే నగరంలో పాజిటివ్ కేసులు అత్యధికంగా నమోదైన ప్రాంతాలకు కంటైన్మెంట్ క్లస్టర్లుగా నామకరణం చేసింది. ఈ ప్రాంతాల నుంచి ఎవరూ కూడా బయటికి వెళ్ళకుండా.. బయటివారు లోపలికి రాకుండా బారికేడ్లతో పూర్తిగా మూసివేసింది. ఇదిలా ఉండగా, నగరానికి సమీపంలోని మేడ్చల్, రంగారెడ్డి జిల్లాల పరిధిలోనూ 3 కంటైన్మెంట్ క్లస్టర్లను గుర్తించారు.

ఇంటింటా సర్వే..

హైదరాబాద్ జిల్లా పరిధిలో మర్కజ్ ప్రార్థనలకు వెళ్లి వచ్చిన 593 మందిలో 83 మందికి కరోనా వైరస్ సోకింది. వీరి నుంచి మరో 51 మందికి వ్యాపించగా.. వేర్వేరు మార్గాల ద్వారా మరో 70 మందికి వైరస్ వ్యాపించింది. వీరందరూ ఉండే ప్రాంతాలను ప్రభుత్వం జియో ట్యాగింగ్ చేస్తోంది. ఈ మేరకు హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల పరిధిలో బుధవారం నాటికి 659 మంది నివాసాలకు జియో ట్యాగింగ్ చేశారు. ఈ ప్రాంతాల నుంచి వైరస్ వ్యాప్తి నివారణకు జీహెచ్ఎంసీ ప్రత్యేక ప్రణాళికలను రూపొందిస్తోంది. నగర పోలీస్ కమిషనర్ అంజనీకుమార్‌తో చర్చించిన తర్వాత ఆయా ప్రాంతాలను మూసివేశారు. ప్రతి ఇంటిని వైద్య, ఆరోగ్య శాఖ, జీహెచ్‌ఎంసీ, సంబంధిత విభాగాలు తనిఖీ చేసేందుకు సిద్ధమయ్యారు. ప్రతి ఇంట్లో సర్వే చేసి, వ్యాధి లక్షణాలున్న వారిని ఆస్పత్రికి తరలించాలని, వైరస్‌ సోకితే ఐసొలేషన్‌ లేదా నిర్బంధ కేంద్రాలకు తరలించాలని అధికారులు భావిస్తున్నారు. అంతే కాకుండా, అక్కడున్న ప్రతీ వీధిని శుభ్రంగా ఊడ్చి, క్రమం తప్పకుండా క్రిమి సంహారకాలు పిచికారీ చేస్తూ నిత్యం పర్యవేక్షించనున్నారు.

కంటైన్మెంట్ కస్లర్ ప్రాంతాలివే..

కరోనా వైరస్ వ్యాప్తికి అడ్డుకట్ట వేసేందుకు ప్రభుత్వం నగరంలోని పలు ప్రాంతాలను కంటైన్మెంట్ కస్లర్లుగా గుర్తించారు. వీటిలో హైదరాబాద్ నగరంలో 12 ప్రాంతాలను గుర్తించి, అక్కడ కట్టుదిట్టమైన చర్యలు చేపడుతున్నారు. అందులో భాగంగా నగరంలోని ​​​​రాంగోపాల్‌పేట, షేక్‌పేట, ​రెడ్‌ హిల్స్‌, ​మలక్‌పేట- సంతోష్‌నగర్‌, ​చాంద్రాయణగుట్ట, ​అల్వాల్‌, ​మూసాపేట, ​కూకట్‌పల్లి, ​కుత్బుల్లాపూర్‌- గాజులరామారం, ​మయూరి నగర్‌, ​యూసుఫ్‌గూడ, ​చందానగర్‌, ​బాలాపూర్‌, ​చేగూరు, ​తుర్కపల్లి ప్రాంతాలను కంటైన్మెంట్ క్లస్టర్లుగా గుర్తించింది. ఈ ప్రాంతాల్లో ప్రభుత్వ చీఫ్ సెక్రెటరీ సోమేశ్ కుమార్, నగర్ సీపీ అంజనీ కుమార్, మున్సిపల్ శాఖ కార్యదర్శి అర్వింద్ కుమార్, జీహెచ్ఎంసీ కమిషనర్ లోకేష్ కుమార్ పర్యటించారు.

Tags: corona virus, corona effect, covid-19, ghmc, containment culsters, medchal, rangareddy

Tags:    

Similar News