హోర్డింగ్స్ దండి.. ఖజానాకు గండి
దిశ, న్యూస్ బ్యూరో : గ్రేటర్ పరిధిలో అనుమతుల్లేని ఫ్లెక్సీలు, హోర్డింగ్‌లను తొలగిస్తున్నామని బల్దియా అధికారులు హడావిడి ఆపరేషన్ చేపడుతున్నారు. మరోవైపు అనధికారికంగా, నిబంధనలకు విరుద్ధంగా హోర్డింగ్‌లు ఏర్పాటు చేస్తున్నా అధికారులకు కండ్లకు కనిపించడం లేదు. రూ. వందల కోట్ల ఆదాయాన్ని బల్దియా కోల్పోవడంతోపాటు ప్రజల ప్రాణాలకు ప్రమాదకరంగా మారిన హోర్డింగ్‌లపై కథనం.. నగరంలోని టవర్లు, హోర్డింగ్‌లతో ప్రమాదం పొంచి ఉంది. రక్షణ చర్యలు చేపట్టకుండానే హోర్డింగ్‌లు ఏర్పాటు చేస్తుండటంతో చిన్న గాలి వచ్చినా ఇవి కుప్పకూలిపోతున్నాయి. […]
దిశ, న్యూస్ బ్యూరో :
గ్రేటర్ పరిధిలో అనుమతుల్లేని ఫ్లెక్సీలు, హోర్డింగ్‌లను తొలగిస్తున్నామని బల్దియా అధికారులు హడావిడి ఆపరేషన్ చేపడుతున్నారు. మరోవైపు అనధికారికంగా, నిబంధనలకు విరుద్ధంగా హోర్డింగ్‌లు ఏర్పాటు చేస్తున్నా అధికారులకు కండ్లకు కనిపించడం లేదు. రూ. వందల కోట్ల ఆదాయాన్ని బల్దియా కోల్పోవడంతోపాటు ప్రజల ప్రాణాలకు ప్రమాదకరంగా మారిన హోర్డింగ్‌లపై కథనం..
నగరంలోని టవర్లు, హోర్డింగ్‌లతో ప్రమాదం పొంచి ఉంది. రక్షణ చర్యలు చేపట్టకుండానే హోర్డింగ్‌లు ఏర్పాటు చేస్తుండటంతో చిన్న గాలి వచ్చినా ఇవి కుప్పకూలిపోతున్నాయి. హోర్డింగ్‌ల ఏర్పాటు నాణ్యత, మన్నిక పరిశీలనలో బల్దియా అధికారులు విఫలమవుతుండటంతో ప్రజాభద్రత ప్రశ్నార్థకమవుతోంది. గ్రేటర్ పరిధిలో హోర్డింగ్‌లు పడిపోయి ప్రమాదాలు జరిగిన నేపథ్యంలో గతంలో వీటిపై నిషేధం విధించారు. 2016లో అనుమతి లేకుండా 330 భారీ హోర్డింగ్‌లు ఉన్నట్టు గుర్తించిన జీహెచ్‌ఎంసీ అధికారులు రెండేండ్ల పాటు కష్టపడి 300 మాత్రమే తొలగించారు. ఈ కాలంలో ఇతర చోట్లలో కొత్త హోర్డింగ్‌లు వెలిశాయి. ఆ తర్వాత హోర్డింగ్‌ల గురించి బల్దియా పట్టించుకున్న దాఖాలాలు కనిపించడం లేదు. వ్యాపార వర్గాల నుంచి పెద్ద ఎత్తున ఆందోళన వచ్చిన నేపథ్యంలో మే, 2017 నుంచి కొన్ని షరతులతో హోర్డింగ్‌లకు అనుమతులు ఇస్తున్నారు. అయితే సరైన పద్ధతిలో అమర్చని హోర్డింగ్‌లు కూలి పడి ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. మరోవైపు హోర్డింగ్‌ల ఏర్పాటు నుంచి బల్దియాకు రావాల్సిన ఆదాయానికి రూ.కోట్లలో గండి పడుతున్నా పట్టించుకోవడం లేదు.
‘హోర్డింగ్ ఫ్రీ సిటీ’ సాధ్యమేనా!
గ్రేటర్‌లో హోర్డింగ్‌లతో తరచూ ప్రమాదాలు చోటు చేసుకుంటున్న నేపథ్యంలో నగరాన్ని ‘హోర్డింగ్ ఫ్రీ సిటీ’గా మారుస్తామని గతంలో మున్సిపల్ మంత్రిగా కేటీఆర్ ప్రకటించారు. అయితే, ఆ దిశగా ఇప్పటివరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదు. గ్రేటర్ పరిధిలో 2,600 హోర్డింగ్‌లకు మాత్రమే అనుమతి ఉండగా 5 వేలకు తగ్గకుండా ఉన్నట్టు అంచనా. అనుమతితో ఏర్పాటు చేసినా నాణ్యత, మన్నిక ఎలా ఉందనే అంశంపై జేఎన్‌టీయూ, ఐఐటీ నిపుణులతో అధ్యయన కమిటీని ఏర్పాటు చేశారు. ఆ అంశాలను అమలు చేయడంలో బల్దియా విఫలమవుతోంది. గతంలో హోర్డింగ్‌లపై నిషేధం విధించినపుడు హోర్డింగ్ ఏజెన్సీలకు ఏడాదికి రూ. 500 కోట్ల నష్టం వాటిల్లినట్టు అంచనా. అనుమతి తీసుకున్నా నిబంధనలను అతిక్రమించి హోర్డింగ్‌లు ఏర్పాటు చేస్తుండటంతో కీలకమైన బల్దియా పెద్దలకు వాటాలు అందుతున్నాయనే ఆరోపణలు ఉన్నాయి. దీంతో ఇది అంత పెద్ద సీరియస్ అంశమే కానట్టు బల్దియా అధికారులు వ్యవహరిస్తున్నట్టు కనిపిస్తోంది. రూ. కోట్లు చేతులు మారుతున్న ఈ వ్యాపారంలో బల్దియాకు కూడా రూ. కోట్ల ఆదాయాన్ని కోల్పోయే అవకాశం ఉండటంతో హోర్డింగ్‌లు పూర్తిగా తీసేయడం సాధ్యమయ్యే పని కాదు. అయితే బెంగళూరు మాదిరిగా ‘ప్రమాద రహిత హోర్డింగ్’ పాలసీ విధివిధానాలు రూపొందించి, అమలు చేయాల్సిన అవసరం ఉంది.
ఆదాయం ఆవిరి.. అమలు కాని నిబంధనలు
బల్దియాలో అనుమతి తీసుకున్న 2,600 హోర్డింగ్‌ల నుంచి బల్దియాకు ఏడాదికి రూ. 36 కోట్ల ఆదాయం వస్తోంది. అనుమతి తీసుకున్న సైజు వేరు, ఏర్పాటు చేస్తున్న హోర్డింగ్‌లు వేరని, నిబంధనలు పాటించడం లేదని ఆరోపణలు ఉన్నాయి. అయితే నగరంలో వాస్తవికంగా 5 వేలకు పైగా హోర్డింగ్‌లు ఉన్నట్టు, ఆయా ఏజెన్సీలు నిబంధనల ప్రకారం చెల్లించినా బల్దియాకు రూ. వంద కోట్ల ఆదాయం వస్తుందని గణంకాలతో సహా అప్పటి బల్దియా కమిషనర్ జనారర్దన్‌రెడ్డికి ‘తెలంగాణ వనరుల పరిరక్షణ కమిటీ’ ప్రతినిధులు వివరించారు. ఆ దిశగా కమిషనర్ పలు చర్యలు చేపట్టారు. ఆ తర్వాత ఆయన బదిలీ అయ్యారు. ఎల్‌బీ స్టేడియం వద్ద హోర్డింగ్ కూలి ఒకరు మరణించిన సందర్భంలో టవర్ల స్టెబిలిటీపై జేఎన్‌టీయూ, ఉస్మానియాకు చెందిన ఇంజినీరింగ్ నిపుణులతో అధ్యయనం చేయించి, తక్షణం నివేదిక సమర్పించాలని గతంలో జీహెచ్‌ఎంసీ కమిషనర్ దానకిశోర్ ఆదేశించారు. నగరంలో అనుసరించాల్సిన విధానంపైనా నివేదికను కోరారు. ప్రధాన మార్గాల్లోని హోర్డింగ్‌లపై ఫ్లెక్సీలను తొలగించాలని ఆయా ఏజెన్సీలకు కమిషనర్ స్పష్టం చేశారు. ఇప్పటికీ అవేవి పూర్తి స్థాయిలో అమలు కావడం లేదు.
నిబంధనల ప్రకారం..
– నేల, గోడలపైన హోర్డింగ్‌ల సైజు 40 ఫీట్ల పొడవు, 25 ఫీట్ల వెడల్పు ఉండాలి.
– భవనాలపై ఏర్పాటు చేస్తే రెండంతస్తుల కంటే ఎత్తులో ఏర్పాటు చేయకూడదు. వాటి పరిమాణం కూడా 30X25 మాత్రమే ఉండాలి.
– సింగిల్ ఫ్లెక్సీ/ వినైల్ మాత్రమే ఏర్పాటు చేయాలి. ఏర్పాటు చేసిన హోర్డింగ్‌లతో ఎలాంటి ప్రమాదాలు జరగబోవని సదరు ఏజెన్సీ అండర్‌టేకింగ్ ఇవ్వాలి. ఏదైనా ప్రమాదం జరిగినా హోర్డింగ్‌లు కింద పడకుండా వైర్లు ఏర్పాటు చేయాలి.
– శిథిల, పురాతన భవనాలపై ఉన్న హోర్డింగ్‌లకు ఫ్లెక్సీలు ఏర్పాటు చేయకూడదు. హోరు గాలి, భారీ వర్షం పడితే ఏజెన్సీలే స్వయంగా ఫ్లెక్సీలు తొలగించాలి.
– హోర్డింగ్ ఏర్పాటు చేసేటపుడు, ఆ తర్వాత జేఎన్‌టీయూ, ఐఐటీ నిపుణులతో నిర్మాణ నాణ్యతను పరీక్షించాలి.
నిద్రావస్థలో బల్దియా అడ్వర్టయిజింగ్ విభాగం..
మెట్రో ప్రారంభించిన తొలి నాళ్లలో హోర్డింగ్‌లు పడిపోయి రైళ్ల రాకపోకలకు ఇబ్బందులు కలగడంతోపాటు ప్రత్యేక పవర్ డిస్ట్రిబ్యూషన్ సిస్టంలో కూడా సమస్యల వచ్చాయి. దీంతో మెట్రో ఉన్నతాధికారులు పరిశీలించి హోర్డింగ్లను తొలగించాలని జీహెచ్‌ఎంసీకి 2018, మే 30న లేఖ రాశారు. మెట్రో అధికారులే సర్వే చేసి నాగోల్-మియాపూర్, ఎల్‌బీనగర్- మియాపూర్ మధ్య 147 హోర్డింగ్‌లు ఉన్నట్టు బల్దియాకు నివేదించారు. అయినా ఒక్కటి కూడా తీసేయడం లేదు. గ్రేటర్ పరిధిలో 40/25, 30/25 సైజు మాత్రమే అనుమతించారు. హోర్డింగ్లు పడిపోకుండా చర్యలు లేకుండానే పరిమిత పరిమాణం కంటే ఎక్కువ సైజుల్లో హోర్డింగ్‌లు ఏర్పాటు చేస్తున్నారు. అనుమతి ఉన్న 2600 హోర్డింగులను, వాస్తవిక హోర్డింగ్‌లను పరిశీలిస్తే రూ. వంద కోట్ల ఆదాయానికి తగ్గకుండా వస్తుందని అంచనా. మరో 3 వేల హోర్డింగ్‌లు అనుమతి లేకుండా ఉన్నాయని సాధారణ అంచనా. కనీసం అడ్వర్టయిజ్‌మెంట్ ఐడెంటెఫికేష్ నంబర్(ఏఐఎన్) లేకుండానే భారీ హోర్డింగ్‌లు పెడుతున్నా ఒక్క సంస్థ మీద బల్దియా అడ్వర్టయిజ్‌మెంట్ విభాగం జరిమానా విధించలేదు. సామాన్యుల నుంచి పన్నులు, జరిమానాలు వేసి ఆదాయాన్ని ఆర్జించాలనుకున్న జీహెచ్‌ఎంసీ బడా సంస్థలు కనిపించడం లేదు.
బల్దియాపై ఏజెన్సీలే పైచేయి
హోర్డింగ్‌ల ఏర్పాటు నిబంధనల అమలు చేయడంతోపాటు నిబంధనలు పాటించని వారిపై చర్యలు తీసుకునే అధికారం బల్దియా అడ్వర్టయిజింగ్ విభాగానికి ఉంది. బల్దియాలో ఓ అడిషనల్ కమిషనర్‌తోపాటు ప్రతి జోన్‌కు ఒక అడ్వర్టయిజ్‌మెంట్ ఇన్స్‌పెక్టర్, అసిస్టెంట్ ఇంజినీర్‌ను ఏర్పాటు చేశారు. నిషేధం విధించినపుడు అడ్వర్టయిజ్‌మెంట్ సంస్థలు కోర్టుకు వెళ్లినా బల్దియాకే అనుకూలంగా ఉత్తర్వులు వచ్చాయి. మెట్రో పరిధిలో లిబ్రా, కళ్యాణ్, రెయిన్‌బో, రిలయన్స్ ఔట్‌డోర్, ప్రకాశ్, దివ్య, నీరూస్, శ్వేత, సోనోవిజన్, యూనియాడ్స్.. సహా అన్ని హోర్డింగ్‌లు ఏర్పాటు చేశాయని, వాటిని తొలగించాలని లొకేషన్లతో సహా హెచ్‌ఎంఆర్ వివరాలు ఇచ్చినా బల్దియా పట్టించుకోవడంలేదు. గతంలో పనిచేసిన ఓ ఐఏఎస్ అధికారి హోర్డింగ్ సంస్థలపై ఉక్కుపాదం మోపేందుకు సిద్ధమైన నేపథ్యంలో ఏజెన్సీ సంస్థలు పావులు కదిపి ఆ విభాగం నుంచి ఆయన్ని బదిలీ చేయించినట్టు తెలుస్తోంది. తర్వాత హోర్డింగ్‌లపై దృష్టి సారించేవారు కనిపించడం లేదు. ఏజెన్సీల నుంచి బల్దియాలోని పెద్ద తలకాయలకు నేరుగా ముడుపులు అందడం వల్లే అడ్వర్టయిజ్‌మెంట్ విభాగం నిస్తేజంగా మారిపోయిందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.
Tags : GHMC, Hoardings, File, Income, Agency