గ్రేటర్​ ‘ఫెయిల్యూర్​’

దిశ, తెలంగాణ బ్యూరో : మహా నగర పోరులో రెండు సంస్థలు పూర్తిగా విఫలమయ్యాయి. ప్రతిపక్షాలకు ఊపిరి సలపకుండా ఎన్నికలకు వెళ్లాలనే ప్రభుత్వ నిర్ణయాలకు కట్టుబడిన జీహెచ్​ఎంసీ, ఎన్నికల సంఘాలు ఏర్పాట్లలో చేతులెత్తేశాయి. నిబంధనలకు పాతరేశాయి. పేరుకే ప్రత్యేక బృందాలు పెట్టినా ఒక్కటీ సక్రమంగా విధులు నిర్వర్తించలేదని తేలింది. ప్రచారంలో రెచ్చగొట్టే ప్రసంగాలు చేయకుండా తీసుకునే చర్యల నుంచి పోలింగ్​ ప్రక్రియ దాకా నిర్లక్ష్యం తేటతెల్లమైంది. ఎస్​ఈసీ, జీహెచ్​ఎంసీ సంయుక్తంగా ఫెయిల్యూర్​ను మూటగట్టుకున్నాయి. గ్రేటర్​ ఎన్నికలు చాలా […]

Update: 2020-12-01 07:05 GMT

దిశ, తెలంగాణ బ్యూరో : మహా నగర పోరులో రెండు సంస్థలు పూర్తిగా విఫలమయ్యాయి. ప్రతిపక్షాలకు ఊపిరి సలపకుండా ఎన్నికలకు వెళ్లాలనే ప్రభుత్వ నిర్ణయాలకు కట్టుబడిన జీహెచ్​ఎంసీ, ఎన్నికల సంఘాలు ఏర్పాట్లలో చేతులెత్తేశాయి. నిబంధనలకు పాతరేశాయి. పేరుకే ప్రత్యేక బృందాలు పెట్టినా ఒక్కటీ సక్రమంగా విధులు నిర్వర్తించలేదని తేలింది. ప్రచారంలో రెచ్చగొట్టే ప్రసంగాలు చేయకుండా తీసుకునే చర్యల నుంచి పోలింగ్​ ప్రక్రియ దాకా నిర్లక్ష్యం తేటతెల్లమైంది. ఎస్​ఈసీ, జీహెచ్​ఎంసీ సంయుక్తంగా ఫెయిల్యూర్​ను మూటగట్టుకున్నాయి.
గ్రేటర్​ ఎన్నికలు చాలా ముందస్తుగా నిర్వహించారు. దుబ్బాక ఉప ఎన్నికల ఫలితాల తర్వాత ప్రతిపక్షాలకు అవకాశం, సమయం ఇవ్వకుండా ఎన్నికలకు వెళ్లాలనే కోణంలో ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్లు తెలిసిందే. దీనికోసమే అన్నట్టుగా కొత్త రిజర్వేషన్లు చేయకుండా, వార్డుల విభజన లేకుండా అన్నీ పాత వాటితోనే ఎన్నికల నగార మోగించారు. అయితే అప్పటి వరకు ఎన్నికలకు సిద్ధంగా ఉన్న ఎస్​ఈసీ దాదాపు 20 శాతం పనులు కూడా మొదలుపెట్టలేదు. నోటిఫికేషన్​ జారీ చేసిన తర్వాతే అసలు పనులకు శ్రీకారం చుట్టింది. దీంతో ముందు నుంచే గ్రేటర్​ ఎన్నికల పనుల్లో హడావుడి కొనసాగింది.

ప్రచారం నుంచే మొదలు
ఎన్నికల సంఘం నిబంధనల్లో ప్రధానమైన ప్రక్రియలోనే విఫలమయ్యారు. ప్రచార సమయంలో రెచ్చగొట్టే ప్రసంగాలు, మత పరమైన ప్రసంగాలు చేయరాదంటూ స్పష్టంగా ఉంటోంది. కానీ గ్రేటర్​లో తలపడిన ప్రధాన పార్టీలు అదే అంశాన్ని తీసుకున్నాయి. బీజేపీ, ఎంఐఎం, టీఆర్​ఎస్​ పార్టీలు మత ప్రాతిపదికన రెచ్చగొట్టే ప్రసంగాలు చేశాయి. దీనికి మొదట్లోనే అడ్డుకట్ట వేయాల్సిన ఎన్నికల సంఘం.. ప్రచారపర్వం ముగిసే ఒక్క రోజు ముందు ప్రకటన చేసి వదిలేసింది. దీంతో మతపరమైన అంశాలు, నోములు, పూజలు కొనసాగాయి.

ప్రలోభాలను ఆపలేకపోయారు
ఈ గ్రేటర్​ ఎన్నికల్లో ప్రలోభాల పర్వం విచ్చలవిడిగా సాగింది. గతంలో లేని విధంగా బహిరంగంగా నగదు పంపిణీ చేశారు. కులాలు, సంఘాలు, బస్తీలు, కాలనీల వారీగా గంపగుత్త ఓట్లను కొనుగోలు చేశారు. ఓటర్లు తిరుగబడిన ప్రాంతాల్లో మాత్రమే నగదు పంపిణీ బయటకు వచ్చింది. కానీ సోషల్​ మీడియాలో హల్​చల్​ చేసి ఎస్​ఈసీ గుర్తించని ప్రలోభాల పర్వం ఎంతో ఉంది. ప్రధానంగా అధికార పార్టీ ఓట్ల కొనుగోళ్లు చేసింది. గులాబీ కండువాలతో నోట్లు పంచారు. దీనిపై ఫిర్యాదులు వెళ్లినా ఎస్​ఈసీ స్పందించే లోపే పంపిణీ కార్యం ముగిసింది. దీంతో ఆరోపణలు తీవ్రమవుతున్న నేపథ్యంలో 12 మంది ఐఏఎస్​, ఐపీఎస్​లతో పరిశీలకులను నియమించారు. అప్పటికే 60 పరిశీలన బృందాలు, 30 సర్వేలైన్లు టీంలు ఉన్నా ఒక్కచోట కూడా ధనప్రవాహాన్ని నిలువరించలేదని స్పష్టమైంది.

మహిళలకు గిప్ట్​లు
ఎన్నికల ప్రచారం ముగియడం, ఆ మరునాడే కార్తీక పౌర్ణమి కావడం, తెల్లారితే ఓటింగ్‌ కావడంతో మహిళల ఓట్లను రాబట్టుకునేందుకు చాలామంది నేతలకు అవకాశం దక్కింది. ముఖ్యంగా టౌన్‌షిప్పులు, అపార్ట్‌మెంట్లు, బస్తీలపై దృష్టిసారించారు. ఓటరు లిస్టు ఆధారంగా మహిళలను ఒకేచోటుకి చేర్చి కానుకలు ఇచ్చారు. కార్తీక నోములు, వ్రతాలు, బర్త్‌డేల పేరిట పలుచోట్ల విందులు నిర్వహించారు. వీటికి హాజరైన మహిళలకు రిటర్న్‌ గిఫ్ట్‌ల రూపంలో వెండి వస్తువులు, చీరలు, ఇతరత్రా కానుకలు ఇచ్చి పంపారు. అదే సమయంలో బస్తీలు, మురికివాడల్లో చాలామంది గల్లీ లీడర్ల సాయంతో ఓటుకు ఇంతని కుటుంబాలతో గంపగుత్తగా మాట్లాడుకుని నోట్లను పంచారు.

సోషల్​ మీడియా నో స్టాప్​
వాస్తవంగా బహిరంగ ప్రచారం ముగియగానే సోషల్ మీడియా ప్రచారాన్ని కూడా ఆపేయాల్సి ఉంటోంది. గతంలో జరిగిన ఎన్నికల్లో సోషల్​ మీడియాపై చాలా ఆంక్షలు విధించారు. కానీ గ్రేటర్​ ఎన్నికల్లో మాత్రం ఎన్నికల సంఘం, జీహెచ్​ఎంసీ దానిపై అసలే దృష్టి పెట్టలేదు. ప్రత్యక్ష ప్రచారం ఆదివారంతో ముగిసినా.. సోషల్‌ మీడియా, వాయిస్‌కాల్స్‌ ప్రచారహోరు మాత్రం ఆగలేదు. వరుస సెలవులతో ఓటర్లు ఇంటి పట్టునే ఉండటంతో వారిని ఆకట్టుకునేందుకు పాట్లు పడ్డారు. అభ్యర్థులు సోషల్‌మీడియా, వాయిస్‌కాల్స్‌ ప్రచారాన్ని ఆఖరు రోజు ముమ్మరం చేశారు. పోలింగ్​ జరిగే మంగళవారం కూడా వాయిస్‌కాల్స్, ఫేస్‌బుక్, వాట్సాప్‌ సందేశాలు, ఎస్సెమ్మెస్‌… ఇలా అవకాశమున్న దేన్నీ వదల్లేదు. దీంతో ప్రలోభాల ప్రచారాన్ని నిలువరించడంలో ఎస్​ఈసీ, జీహెచ్​ఎంసీ సంయుక్తగా విఫలమయ్యాయి.

గుర్తులు ఎలా మారాయి
పోలింగ్ రోజున ఓల్డ్ మలక్‌పేటలో ఎన్నికల కమిషన్ నిర్లక్ష్యం బయటపడింది. ఓల్డ్ మలక్ పేట్‌లో కంకి కొడవలి గుర్తుకు బదులుగా సుత్తి కొడవలిని ముద్రించారు. గుర్తులు పరిశీలించి పోలింగ్‌‌ను ఎస్​ఈసీ రద్దు చేసింది. కంకి కొడవలి గుర్తుకు బదులు సుత్తికొడవలి నక్షత్రం గుర్తు రావడంతో ఈ నిర్ణయానికి వచ్చింది. ఓల్డ్‌ మలక్‌పేట్‌లో 1, 2, 3, 4, 5 పోలింగ్ కేంద్రాల్లో ఓటింగ్‌‌ను నిలిపివేశారు. ఈ పోలింగ్ కేంద్రాలకు సంబంధించిన పోలింగ్‌ను ఈ నెల 3న నిర్వహించనున్నట్టు ఎస్​ఈసీ వెల్లడించింది.
వాస్తవంగా పోలింగ్​కు రెండు రోజుల ముందే బరిలో అభ్యర్థుల వివరాలు, వారికి కేటాయించిన గుర్తులు ఎన్నికల సంఘం రిలీజ్​ చేసి, సిబ్బందికి అందిస్తుంది. ఎన్నికల సిబ్బంది ఈ అంశాలను పరిశీలించి సామాగ్రిని పోలింగ్​ కేంద్రాలకు చేరవేస్తారు. కానీ గుర్తులు మారిన అంశం ఎందుకు గుర్తించలేదనే సందేహాలు వ్యక్తం చేస్తున్నారు.

ఓట్లు మాయమయ్యాయి
జియాగూడ వార్డుల్లో ఓట్లు గల్లంతయ్యాయి. జియాగూడలో చాలా ఓట్లు గల్లంతయ్యాయని ఉదయమే ఓటర్లు ఆందోళనకు దిగారు. అయితే ఇక్కడ ఓట్లు గల్లంతు కాలేదని, వేరే పోలింగ్​ కేంద్రాలకు మార్చారంటూ సమర్థించుకునేందుకు జీహెచ్​ఎంసీ ప్రయత్నాలు చేసింది. కానీ ఈసారి పాత పోలింగ్​ కేంద్రాలను ప్రామాణికంగా తీసుకున్నారు. ఈ లెక్కన ఓట్లు ఎలా మారుతాయనేది సందేహమే.

ఓటేయలేదు
ప్రతి ఒక్కరూ ఓటేయాలని సినీతారలతో ప్రచారం నిర్వహిస్తున్నామని, చర్యలు తీసుకుంటున్నామనే అంశాలు కేవలం ప్రకటనలకే పరిమితమయ్యాయి. కారణాలేమైనా… నిర్లక్ష్యమైనా… జీహెచ్ఎంసీ ఓటర్లు మారలేదు. ఎప్పటిలాగే ఓటు వేయడానికి ఆసక్తి చూపడం లేదు. మధ్యాహ్నం 1 గంట వరకు 18.20 శాతం, మధ్యాహ్నం 3 గంటల వరకు 25.34 శాతం ఓటింగ్​ నమోదైంది. దీంతో గ్రేటర్​ పోరులో నగరంలో ఓటింగ్ శాతం కనీసం 40 శాతమైనా దాటుతుందా అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. బస్తీలు ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో ఓటు వేసేందుకు జనం ముందుకొస్తున్నా.. జూబ్లీ హిల్స్, బంజారాహిల్స్​ వంటి కొన్ని ప్రాంతాల్లో మాత్రం ఓటు వేయడానికి బయటకు రావడం లేదు. ఉదయం 7 గంటలకు పోలింగ్ మొదలైనప్పటికీ.. చాలా పోలింగ్ కేంద్రాలు ఖాళీగా దర్శనమిచ్చాయి. ఉదయం 9 గంటల వరకు 3.10 శాతం మాత్రమే పోలింగ్ నమోదైంది. ఉదయం 11 గంటల వరకు 8.90 శాతం కాగా… మధ్యాహ్నం వరకు 18 శాతానికి చేరింది. 2009లో 42.04 శాతంగా నమోదైన ఓటింగ్.. 2016లో 45.29 శాతమైంది.

గ్రేటర్​లో ఇంత ఘోరమా…?
రాష్ట్రంలో ఏ ఎన్నికలైనా ప్రశాంతంగా నిర్వహించగా… కేవలం గ్రేటర్​లో మాత్రం ఉదయమే చాలా చోట్ల ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. దీంతో బందోబస్తు, పోలింగ్​ ప్రక్రియకు ఎలాంటి చర్యలు తీసుకున్నారనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. చాలా మేరకు పోలింగ్​ కేంద్రాల్లో సమస్యలు ఉత్ఫన్నమయ్యాయి. చాలా చోట్ల అధికార పార్టీ నేతలు పోలింగ్​ కేంద్రాల దగ్గరే నోట్లు పంచారు. అయితే అధికారులు కూడా అధికార పార్టీకి మద్దతుగానే వ్యవహరించారు. గతంలొ లేని విధంగా ఈ గ్రేటర్​ ఎన్నికల్లో చాలా చోట్ల ఆందోళనలు చేశారు.

కూకట్‌పల్లి డివిజన్‌ దీనబంధు కాలనీలో జగద్గిరిగుట్ట సీఐ వీరంగం సృష్టించారు. బూటు కాళ్లతో పోలింగ్ బూత్‌ టేబుళ్లను సీఐ తన్నడం వివాదాస్పదంగా మారింది. బీజేపీ కార్యకర్తలను దూషించడంతో పోలీసులు టీఆర్‌ఎస్‌‌కు తొత్తులుగా వ్యవహరిస్తున్నారని బీజేపీ ఆందోళనకు దిగింది.

జీడిమెట్ల డివిజన్‌లో టీఆర్‌ఎస్‌, బీజేపీల మధ్య ఘర్షణ, తోపులాట జరిగింది. పోలింగ్ స్టేషన్ బయట టేబుల్ ఏర్పాటు విషయంలో గొడవ తలెత్తింది. దీంతో బీజేపీ నాయకులు పోలీసులను ఆశ్రయించారు.

హస్తినాపురం డివిజన్‌లోని తన నివాసంలో.. టీఆర్‌ఎస్‌ అభ్యర్థి రమావత్ పద్మానాయక్ డబ్బులు పంచుతుండగా కాంగ్రెస్ నేతలు అడ్డుకున్నారు. దీంతో పోలీసులు లాఠీచార్జ్ చేశారు.

మాదాపూర్‌లో టీఆర్ఎస్ కార్యకర్తలు డబ్బులు పంచుతుండగా బీజేపీ అభ్యర్థి రాధాకృష్ణ యాదవ్ రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. మంత్రి పువ్వాడ అజయ్ అనుచరులు డబ్బులు పంచుతుండగా బీజేపీ నాయకులు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకుని పోలీసులకు అప్పగించారు.

ఉప్పల్ జిల్లా పరిషత్ స్కూల్ పాఠశాలలో కాంగ్రెస్ అభ్యర్ధి దొంగ ఓట్లు వెయిస్తున్నారని టీఆర్​ఎస్​, బీజేపీ కార్యకర్తలు ఆందోళనకు దిగారు. అప్పటి వరకు వేడుక చూస్తున్న అధికారులు ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు.

మియాపూర్ సమీపంలో న్యూ హఫీజ్‎పేట్ వద్ద ఆదిత్యనగర్‎లో ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. పోలింగ్ బూత్ వద్ద టీఆర్ఎస్ పార్టీ నాయకులు ఓట్లరకు డబ్బులు పంచుతుండగా మాదాపూర్ డివిజన్ బీజేపీ అభ్యర్థి రాధాకృష్ణ యాదవ్ రెడ్ హ్యండెడ్‎గా పట్టుకున్నారు. దీంతో ఇరువర్గాల మధ్య ఘర్షణ వాతావరణం నెలకొంది. సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటనస్థలానికి చేరుకున్నారు. పోలీసులు కూడా టీఆర్ఎస్ నాయకులకే మద్దతు తెలుపుతున్నారంటూ బీజేపీ కార్యకర్తలు ఆందోళన చేశారు.

ఎన్‌బీటీనగర్ ప్రభుత్వ పాఠశాల పోలింగ్ బూత్ వద్ద కూడా ఉద్రిక్తత చోటు చేసుకుంది. కాషాయం రంగు మాస్కులు పెట్టుకొని పోలింగ్ బూత్ వద్దకు వస్తున్నారని టీఆర్ఎస్ … చేతికి గులాబీ రంగు కంకణాలు కట్టుకుని వచ్చారంటూ బీజేపీ వర్గీయులు పరస్పరం వాగ్వాదానికి దిగారు. బంజారాహిల్స్ డివిజన్ టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి గద్వాల విజయలక్ష్మి గులాబీ కండువాలతో పోలీస్ స్టేషన్‌లోకి ప్రవేశించారు. ఇదేమిటి అంటూ బీజేపీ కార్యకర్తల ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీస్ స్టేషన్ సమీపంలోని పోలింగ్ స్టేషన్లు 43, 44, 45, 46, 47, 48, 49, వద్ద ఉద్రిక్తత నెలకొంది.

పటాన్‌చెరు డివిజన్‌లోని చైతన్య స్కూల్‌ దగ్గర టీఆర్‌ఎస్‌, బీజేపీ నేతలు, కార్యకర్తలు ఘర్షణకు దిగారు. తమ కార్యకర్తలపై టీఆర్‌ఎస్‌ కార్యకర్త విష్ణు దాడి చేశాడని బీజేపీ అభ్యర్థి ఆశీష్‌గౌడ్‌ ఆరోపించారు.

భారతీనగర్‌ డివిజన్‌ ఎల్‌ఐజీ కాలనీ బూత్‌ వద్ద ఉద్రిక్తత చోటుచేసుకుంది. టీఆర్‌ఎస్‌ అభ్యర్థి సింధు ఫొటోతో కూడిన ఓటరు స్లిప్‌ల పంపిణీ చేస్తుండటంతో బీజేపీ అభ్యర్థి గోదావరి అంజిరెడ్డి అభ్యంతరం తెలిపారు. అధికారులు టీఆర్‌ఎస్‌కు అనుకూలంగా వ్యవహరిస్తున్నారని అంజిరెడ్డి ఆరోపించారు.

ఓల్డ్‌మలక్‌పేట్ డివిజన్‌లో సీపీఐ అభ్యర్ధి గుర్తు తారుమారైంది. దీనిపై సీపీఐ నాయకులు ఆందోళనకు దిగారు. సీపీఐ గుర్తు కంకి కొడవలికి బదులు, సుత్తి కొడవలి నక్షత్రం ఎన్నికల అధికారులు ముద్రించారు. ఈ ఘోర తప్పిదాన్ని సీపీఐ నాయకులు తూర్పార బట్టారు.

మన్సూరాబాద్ డివిజన్ సహారా ఎస్టేట్‌లో.. పరిగి నుంచి వచ్చిన టీఆర్ఎస్ కార్యకర్తలు ఓటర్లను ప్రలోభాలకు గురిచేస్తున్నారని బీజేపీ నాయకులు ఆందోళనకు దిగారు.

పఠాన్‌చేరు 113 డివిజన్ చైతన్య నగర్‌లో బీజేపీ, టీఆర్ఎస్ కార్యకర్తల మధ్య ఘర్షణ జరిగింది. స్థానిక ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి తనయుడు గూడెం విష్ణువర్ధన్ రెడ్డి.. బీజేపీ కార్యకర్తలపై చేయి చేసుకున్నారని ఆ పార్టీ నేతలు ఆందోళనకు దిగారు. దీంతో ఇరు వర్గీయుల మధ్య ఘర్షణ వాతావరణం నెలకొంది.

యాకుత్‌పురాలో దొంగ ఓట్లు వేసేందుకు మహిళలు ఆటోల్లో వచ్చారు. సమాచారం అందుకున్న ఎంబీటీ నాయకులు పోలీసులకు అప్పగించారు.

భారతినగర్ డివిజన్ ఎల్ఐజి కాలనీలోని సొసైటీ ఆఫీస్ పోలింగ్ బూత్ వద్ద ఉద్రిక్తత చోటుచేసుకుంది. టీఆర్ఎస్ అభ్యర్థి సింధు ఆదర్శ్ రెడ్డి ఫోటోతో కూడిన పోలింగ్ స్లిప్ ల పంపిణీపై బీజేపీ అభ్యర్థి గోదావరి అంజిరెడ్డి అభ్యంతరం తెలిపారు. పోలీసులు, ఎన్నికల సిబ్బంది టీఆర్ఎస్‌కు అనుకూలంగా వ్యవహరిస్తున్నారంటూ ఆందోళనకు దిగారు.

సికింద్రాబాద్‌లోని అడ్డగుట్ట డివిజన్‌లో ఓటేయకుండానే ఓటర్లు వెనుదిరిగారు. ఓటర్ స్లిప్‌లు అధికారులు పంపిణీ చేయలేదు. పోలింగ్​ కేంద్రం దొరక్క కొందరు ఓటు వేయలేదు.

బంజారాహిల్స్ డివిజన్‌లో బీజేపీ కార్యకర్తలు, పోలింగ్ ఏజెంట్లు కాషాయ మాస్కులతో వచ్చారు. అయితే వాళ్లకు దీటుగా టీఆర్ఎస్ కార్యకర్తలు, బూత్ ఏజెంట్లు గులాబీ రంగులో ఉన్న క్లాత్‌ను చేతులకు కట్టుకున్నారు. దీంతో గొడవలు జరిగాయి.

తార్నాక డివిజన్ బూత్ నెంబర్ 36, 37 లో ఏజెంట్లు సీఎం కేసీఆర్ ఫోటోతో కూడిన కరపత్రాలను టేబుల్‌పై పెట్టుకొని ప్రచారం చేస్తుండటంతో కాంగ్రెస్ నాయకులు అడ్డుకున్నారు. ఈ క్రమంలో ఇరు పార్టీల నాయకుల మధ్య గొడవ చోటుచేసుకుంది.

భారతీనగర్ డివిజన్‌లోని స్లమ్ ఏరియాలో ఓట్లు గల్లంతయ్యాయని స్థానికుల ఆందోళనకు దిగారు.

అల్వాల్​లో పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శించారు. అక్కడ బీజేపీ పోలింగ్​ ఎజెంట్లను అరెస్ట్​ చేశారు. అయితే టీఆర్​ఎస్​ నాయకులు రిగ్గింగ్​ చేసుకునేందుకు వీలు కలిగించేందుకే అరెస్ట్​ చేశారని ఆందోళన జరిగింది.

ఇక మలక్​పేటలో నిర్లక్ష్యాన్ని కప్పి పుచ్చుకునే ప్రయత్నం చేశారు. అభ్యర్థుల ఎన్నికల చిహ్నంలో లోపం తలెత్తడంతో 26వ డివిజన్ రిటర్నింగ్ అధికారిని రాష్ట్ర ఎన్నికల సంఘం తొలగించింది. అభ్యర్థికి కేటాయించిన గుర్తు విషయంలో సదరు అధికారి బాధ్యతాయుతంగా విధులు నిర్వర్తించని కారణంగా తొలగిస్తున్నట్లు ఎన్నికల సంఘం స్పష్టం చేసింది. ఆ స్థానంలో కొత్త అధికారిని నియమించనుంది. ఎలాగూ ఇప్పటివరకు జరిగిన పోలింగ్ ప్రక్రియను పూర్తిగా రద్దు చేసి డిసెంబరు 3వ తేదీన మళ్ళీ పోలింగ్ నిర్వహించనున్నట్లు స్పష్టం చేసింది. అప్పటికల్లా కొత్త బ్యాలట్ పేపర్‌ను ముద్రించి ఎలాంటి లోపాలు లేకుండా చూసుకోవాలని జీహెచ్ఎంసీ అధికారులను ఎన్నికల సంఘం ఆదేశించింది.

Tags:    

Similar News