ODI కెప్టెన్‌గా కోహ్లీని తప్పిస్తారా.. రోహిత్ కోసం బీసీసీఐలో లాబీయింగ్..?
దిశ, స్పోర్ట్స్: టీమ్ ఇండియా వన్డే కెప్టెన్సీ మారబోతున్నదా? విరాట్ కోహ్లీని కేవలం టెస్టులకు పరిమితం చేసి.. పరిమిత ఓవర్ల్ క్రికెట్ బాధ్యతల నుంచి తప్పించబోతున్నారా? రోహిత్ కోసం బీసీసీఐలో లాబీయింగ్ జరుగుతున్నదా? అంటే క్రికెట్ వర్గాల నుంచి అవుననే సమాధానమే వినిపిస్తున్నది. యూఏఈలో నిర్వహించిన టీ20 వరల్డ్ కప్ ప్రారంభానికి ముందే విరాట్ కోహ్లీ పొట్టి ఫార్మాట్ కెప్టెన్సీకి వీడ్కోలు పలుకుతున్నట్లు చెప్పాడు. అదే సమయంలో టెస్టు, వన్డే కెప్టెన్సీల గురించి అతడు ఏమీ మాట్లాడలేదు. […]
దిశ, స్పోర్ట్స్: టీమ్ ఇండియా వన్డే కెప్టెన్సీ మారబోతున్నదా? విరాట్ కోహ్లీని కేవలం టెస్టులకు పరిమితం చేసి.. పరిమిత ఓవర్ల్ క్రికెట్ బాధ్యతల నుంచి తప్పించబోతున్నారా? రోహిత్ కోసం బీసీసీఐలో లాబీయింగ్ జరుగుతున్నదా? అంటే క్రికెట్ వర్గాల నుంచి అవుననే సమాధానమే వినిపిస్తున్నది. యూఏఈలో నిర్వహించిన టీ20 వరల్డ్ కప్ ప్రారంభానికి ముందే విరాట్ కోహ్లీ పొట్టి ఫార్మాట్ కెప్టెన్సీకి వీడ్కోలు పలుకుతున్నట్లు చెప్పాడు. అదే సమయంలో టెస్టు, వన్డే కెప్టెన్సీల గురించి అతడు ఏమీ మాట్లాడలేదు. న్యూజీలాండ్‌తో జరిగిన సిరీస్ నుంచి టీ20 కెప్టెన్‌గా రోహిత్ శర్మను నియమించారు. అదే సమయంలో కోహ్లీకి మూడు టీ20లు, తొలి టెస్టు నుంచి విశ్రాంతి కల్పించారు. ఇక శుక్రవారం నుంచి ముంబైలో జరుగనున్న టెస్టు సిరీస్‌కు కోహ్లీ అందుబాటులోకి వచ్చాడు. అతడే సుదీర్ఘ ఫార్మాట్‌కు కెప్టెన్‌గా కొనసాగుతున్నాడు. ఎటొచ్చీ ఇప్పుడు వన్డే కెప్టెన్ ఎవరనే దానిపైనే అసలు సమస్య ప్రారంభమైంది. మరో రెండు మూడు రోజుల్లో జాతీయ సీనియర్ సెలెక్షన్ కమిటీ భేటీ కానున్నది. ఇందులో కోహ్లీ కెప్టెన్సీ గురించి కీలక చర్చ జరగబోతున్నట్లు తెలుస్తున్నది.
టెస్టులకే పరిమితం చేద్దాం..
ప్రపంచంలోని చాలా దేశాల క్రికెట్ బోర్డులు పరిమిత ఓవర్ల క్రికెట్, టెస్టు క్రికెట్‌కు వేర్వేరు సారధులను నియమించాయి. ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్, వెస్టిండీస్, దక్షిణాఫ్రికాలో ఇదే పద్ధతిని అనుసరిస్తున్నారు. మూడు ఫార్మాట్లకు ఒకే కెప్టెన్ ఉండటం వల్ల భారం పెరిగిపోతుందని భావించే అలా నిర్ణయం తీసుకున్నారు. ఇటీవల కాలం వరకు కోహ్లీ మూడు ఫార్మాట్లలో కెప్టెన్‌గా ఉన్నా ఎవరూ మాట్లాడలేదు. ఎప్పుడైతే టీ20 కెప్టెన్‌గా తప్పుకున్నట్లు ప్రకటించాడో అప్పటి నుంచి కోహ్లీని సుదీర్ఘ ఫార్మాట్‌కు మాత్రమే పరిమితం చేయాలనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. రోహిత్ శర్మను పరిమిత ఓవర్ల క్రికెట్ కెప్టెన్సీని అప్పగించి.. కోహ్లీని టెస్టుల్లో కొనసాగించేలా బీసీసీఐలో ముంబై వర్గాలు లాబీయింగ్ చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి.
బోర్డులో ఈ విషయంపై రెండు వర్గాలుగా విడిపోయారని.. కోహ్లీకి ఒక వర్గం మద్దతు ఇస్తుండగా.. మరో వర్గం రోహిత్‌ను సపోర్ట్ చేస్తున్నట్లు తెలుస్తున్నది. 2023లో ఇండియాలోనే వన్డే వరల్డ్ కప్ జరుగనున్నది. ఇప్పటి నుంచి ఆ టోర్నీ వరకు భారత జట్టు 9 వన్డేలు ఆడాల్సి ఉన్నది. ఇందులో ఆరు వన్డేలు విదేశీల్లో జరుగనుండగా.. మూడు మాత్రం స్వదేశంలో జరగాల్సి ఉన్నది. రోహిత్‌ను వన్డే కెప్టెన్‌గా చేయాలనుకుంటే ఇప్పుడే చేయాలని క్రికెట్ వర్గాలు సూచిస్తున్నాయి. వన్డే వరల్డ్ కప్‌లోపు రోహిత్ జట్టును తయారు చేసుకుంటాడని.. అలాగే ప్రస్తుతం టీ20 కెప్టెన్‌గా కూడా ఉండటంతో అతడికి కలసి వస్తుందని అంటున్నారు. అదే సమయంలో కోహ్లీని పరిమిత ఓవర్ల క్రికెట్‌లో ఆటగాడిగా కొనసాగిస్తే అతడు పూర్తిగా బ్యాటింగ్‌పై ఫోకస్ చేయగలుగుతాడని భావిస్తున్నారు.
గంగూలీ, జై షాదే తుది నిర్ణయం..
దక్షిణాఫ్రికా పర్యటనకు వెళ్లే భారత జట్టును తొలి టెస్టు ముగియగానే ప్రకటించాల్సి ఉన్నది. భారత జట్టు ఆ పర్యటనలో మూడు టెస్టులతో పాటు మూడు వన్డేలు, నాలుగు టీ20 మ్యాచ్‌లు ఆడాల్సి ఉన్నది. ప్రస్తుతం దక్షిణాఫ్రికాలో ఒమిక్రాన్ వేరియంట్ తీవ్రత ఎక్కువగా ఉండటంతో భారత ప్రభుత్వం నుంచి గ్రీన్ సిగ్నల్ వస్తే కానీ పర్యటన యథాతథంగా జరుగదు. అందుకే సెలెక్షన్ కమిటీ సమావేశాన్ని వాయిదా వేశారు. అయితే దక్షిణాఫ్రికా పర్యటనకు వన్డే జట్టును ఎంపిక చేసే సమయంలోనే కోహ్లీ కెప్టెన్సీపై చేతన్ శర్మ నేతృత్వంలోని సెలెక్షన్ కమిటీ నిర్ణయం తీసుకోవాల్సి ఉన్నది. కోహ్లీని కొనసాగించడమా? రోహిత్‌కు అవకాశం ఇవ్వడమా అనేది తేల్చాల్సి ఉన్నది. అయితే కెప్టెన్సీ విషయంలో సెలక్షన్ కమిటీ నిర్ణయం కంటే ముందు బోర్డు పెద్దలు చర్చలు జరుపుతారని తెలుస్తున్నది. కోహ్లీ కెప్టెన్సీ విషయంలో బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ, కార్యదర్శి జై షాల మాటే తుది నిర్ణయం అని సమాచారం. మరి భారత మాజీ కెప్టెన్ గంగూలీ వన్డే కెప్టెన్‌గా ఎవరికి ఓటేస్తాడా అని అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.