గేదెలను దొంగిలించి విక్రయిస్తున్న ముఠా అరెస్ట్
దిశ, కోదాడ: సూర్యాపేట జిల్లా కోదాడ, చిలుకూరు, మేళ్లచెరువు ,హుజూర్ నగర్ ప్రాంతాలలో గేదెల దొంగతనానికి పాల్పడుతున్న 15 మంది సభ్యుల ముఠాను శనివారం కోదాడ రూరల్ పోలీసులు అరెస్ట్ చేసి వారి వద్ద నుండి ఒక బొలెరో వాహనం, 1 టాటా ఏస్ వాహనంతో పాటు రూ.14 లక్షల నగదు స్వాధీనం చేసుకున్నారు. ఈ సంఘటనకు సంబంధించి వివరాలను శనివారం సాయంత్రం కోదాడ రూరల్ సీఐ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో కోదాడ డీఎస్పీ రఘు […]
దిశ, కోదాడ: సూర్యాపేట జిల్లా కోదాడ, చిలుకూరు, మేళ్లచెరువు ,హుజూర్ నగర్ ప్రాంతాలలో గేదెల దొంగతనానికి పాల్పడుతున్న 15 మంది సభ్యుల ముఠాను శనివారం కోదాడ రూరల్ పోలీసులు అరెస్ట్ చేసి వారి వద్ద నుండి ఒక బొలెరో వాహనం, 1 టాటా ఏస్ వాహనంతో పాటు రూ.14 లక్షల నగదు స్వాధీనం చేసుకున్నారు. ఈ సంఘటనకు సంబంధించి వివరాలను శనివారం సాయంత్రం కోదాడ రూరల్ సీఐ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో కోదాడ డీఎస్పీ రఘు వెల్లడించారు. అనంతగిరి మండలం తమ్మరబండపాలెం శివారు అశోక నగర్ కు చెందిన పట్టణంలోని సంతలో పశువుల వ్యాపారం నిర్వహించే మహమ్మద్ మతాబు సాహెబ్ గత లాక్ డౌన్ వరకు పశువులను కొని వాటిని వివిధ ప్రాంతాల్లో ఉన్న కబేళాలకు ఎగుమతి చేసేవాడు.
లాక్ డౌన్ సమయంలో పశువుల సంతలు కూడా నడవకపోవడంతో అతని ఆదాయం తగ్గింది. ఆదాయంతో పాటు జల్సాలకు లేకపోవడంతో తనకు తెలిసిన వాహన డ్రైవర్లు, మధ్య దళారీలుతో కలిసి పశువుల దొంగతనాలకు పాల్పడేందుకు నిర్ణయించుకున్నారు. దీనితో మూడు గ్యాంగ్‌లుగా ఏర్పడి కోదాడ, చిలుకూరు, మెళ్లచేర్వు, హుజూర్ నగర్ మండలాలోని పలు గ్రామాల్లో 100కి పైగా గేదెలను దొంగతనం చేశారు. గ్రామాలలో సంచరిస్తూ రాత్రి వేళల్లో రోడ్లపై తిరిగే వాటిని గుర్తించి ఎవరూ లేని సమయంలో వాటిని టాటా ఏస్ వాహనం ద్వారా తరలించేవారు.
ఇలా తరలించిన వాటిని జహీరాబాద్ లోని అల్లాన కంపెనీకి పంపేవారు. మహతాబ్ సాబ్ గతంలో వ్యాపారం నిర్వహించే సమయంలో ఆ కంపెనీతో లావాదేవీల కోసం కోడ్ ఉండడంతో.. ఇలా పంపించిన వాటికి కంపెనీ వారు డబ్బులు బ్యాంక్ అకౌంట్ లో వేసిన తరువాత ముఠా సభ్యులు పంచుకునే వారు. ఇటీవల తరచూ గేదెల దొంగతనాలు జరుగుతుండటం, పలు కేసులు నమోదు కావడంతో ఈ దిశగా కోదాడ రూరల్ పోలీసులు దృష్టి సారించారు. ఈ క్రమంలో శనివారం ఉదయం కోదాడ మండల పరిధిలోని తొగర్రాయి సబ్ స్టేషన్ వద్ద పోలీసులు వాహనాల తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఆ సమయంలో రెండు వాహనాలలో అటుగా వస్తున్న ఈ గ్యాంగ్ ను ఆపి వాహన తనిఖీ చేపట్టి వారిని ప్రశ్నించారు. వారు పొంతనలేని సమాధానం చెప్పడంతో వారిని అదుపులోకి తీసుకొని విచారించారు.
దీంతో తాము గేదెలను దొంగలించి ఇలా విక్రయిస్తున్నట్లు అంగీకరించారు. వారిని అరెస్ట్ చేసి వారి వద్ద నుండి రూ.14 లక్షల నగదు, రెండు వాహనాలు స్వాధీనం చేసుకున్నారు. మొత్తం 16 మంది సభ్యులున్న ఈ ముఠాలో ఒకరు పరారీలో ఉండగా.. 15 మందిని అరెస్టు చేసినట్లు డీఎస్పీ వెల్లడించారు. ఈ కేసు విషయంలో చాకచక్యంగా వ్యవహరించి ముఠా అరెస్ట్ చేసిన రూరల్ సిఐ శివరాం రెడ్డి, ఎస్ ఐ సైదులు గౌడ్ , పోలీస్ సిబ్బందిని డిఎస్పి అభినందించారు.