రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్‌లోకి గండ్ర.. సర్వం సిద్ధం..
దిశ ప్రతినిధి, వరంగల్ : ఆలిండియా ఫార్వర్డ్ బ్లాక్ రాష్ట్ర నేత గండ్ర సత్యనారాయణ కాంగ్రెస్ పార్టీలో తీర్థం పుచ్చుకునేందుకు రంగం సిద్ధమైంది. గండ్ర సత్యనారాయణ పార్టీలో చేరుతున్న నేపథ్యంలో భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని అంగడి ప్రదేశంలో కాంగ్రెస్ పార్టీ బహిరంగ సభను ఏర్పాటు చేసింది. ఈ బహిరంగ సభలో తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డితో పాటు ఎమ్మెల్యేలు భట్టివిక్రమార్క, సీతక్క, దుద్దిళ్ల శ్రీధర్‌బాబు, ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి, కాంగ్రెస్ పార్టీ ప్రముఖ నాయకులంతా పాల్గొననున్నారు. […]
దిశ ప్రతినిధి, వరంగల్ : ఆలిండియా ఫార్వర్డ్ బ్లాక్ రాష్ట్ర నేత గండ్ర సత్యనారాయణ కాంగ్రెస్ పార్టీలో తీర్థం పుచ్చుకునేందుకు రంగం సిద్ధమైంది. గండ్ర సత్యనారాయణ పార్టీలో చేరుతున్న నేపథ్యంలో భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని అంగడి ప్రదేశంలో కాంగ్రెస్ పార్టీ బహిరంగ సభను ఏర్పాటు చేసింది. ఈ బహిరంగ సభలో తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డితో పాటు ఎమ్మెల్యేలు భట్టివిక్రమార్క, సీతక్క, దుద్దిళ్ల శ్రీధర్‌బాబు, ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి, కాంగ్రెస్ పార్టీ ప్రముఖ నాయకులంతా పాల్గొననున్నారు. కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు ఐతే ప్రకాశ్‌రెడ్డి అధ్యక్షతన జరిగే ఈ సభలో వేలాది మంది కాంగ్రెస్ శ్రేణులు, గండ్ర సత్యనారాయణ అభిమానులు పాల్గొననున్నారు. గురువారం సాయంత్రం 4:30గంటలకు భూపాలపల్లికి రేవంత్ చేరుకుంటారని కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు దాదాపు 50 వేల మంది ప్రజలు ఈ సభకు హాజరవుతారని అంచనా వేస్తున్నారు.
భారీగా చేరికలు..
గండ్ర సత్యనారాయణతో పాటు ఆయన సతీమణి గణపురం మండల జడ్పీటీసీ పద్మ, ఎంపీపీ రజిత, 15మంది సర్పంచులు, నలుగురు కౌన్సిలర్లు, వివిధ గ్రామాలకు చెందిన పలువురు వార్డు మెంబర్లు, మాజీ సర్పంచులు, ఎంపీటీసీలు రేవంత్‌రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ కండువా కప్పుకోనున్నారు. గత ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచిన గండ్ర వెంకట రమణారెడ్డి ఆ తర్వాత గులాబీ గూటికి చేరుకున్న విషయం తెలిసిందే. దీంతో నాటి నుంచి కాంగ్రెస్ పార్టీకి గట్టి నాయకత్వం లేకపోవడంతో నియోజకవర్గంలో దిశా నిర్దేశం లేకుండాపోయింది. తాజాగా గండ్ర సత్యనారాయణ పార్టీలోకి వస్తుండటంతో ఆయన అభిమానులు, కాంగ్రెస్ శ్రేణులు ఆనందం వ్యక్తం చేస్తున్నాయి.
రేవంత్ పర్యటన ఇలా సాగనుంది..
హైదరాబాద్ నుంచి వరంగల్ మీదుగా భూపాలపల్లి నియోజకవర్గానికి చేరుకోనున్న రేవంత్‌రెడ్డి ముందుగా మోరంచ గ్రామం వద్ద కాంగ్రెస్ పార్టీ జెండాను ఎగరవేస్తారు. అనంతరం చెల్పూరులో, కుందరూరు పల్లి గ్రామాల్లో జెండాను ఎగురవేస్తారు. భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని ప్రొఫెసర్ జయశంకర్, అంబేద్కర్, రాజీవ్‌గాంధీ విగ్రహాలకు పూలమాలలు వేస్తారు. నాలుగున్నర గంటల సమయంలో భూపాలపల్లి అంగడి స్థలంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పాల్గొంటారు.