ఒంటరి వృద్ధులకు ఆసరాగా.. ‘రిలీఫ్’ రైడర్స్

దిశ, ఫీచర్స్ : ‘ఒక వ్యక్తికి సంబంధించినంత వరకు అత్యంత అందమైన ఆస్తి అంటే తలపండిన జ్ఞానం కాదు.. ప్రేమతో నిండిన హృదయం, వినడానికి సిద్ధంగా ఉన్న చెవి, సాయానికి చేయందించే మనసు’. కొవిడ్ విపత్కర సమయంలో ఎన్నో చేతులు సాయం కోసం ఎదురుచూస్తుంటే.. మరెన్నో చేతులు అండగా నిలుస్తున్నాయి. ‘మానవసేవే మాధవసేవ’ అనే మాటకు నిలువెత్తు నిదర్శనంగా, మూర్తీవించిన మానవత్వానికి ప్రతీకలుగా కరోనా బాధితులకు, పేదలకు తమకు తోచిన తోడ్పాటునందిస్తున్నారు. ఈ క్రమంలోనే ‘రిలీఫ్ రైడర్స్’ […]

Update: 2021-05-07 11:32 GMT

దిశ, ఫీచర్స్ : ‘ఒక వ్యక్తికి సంబంధించినంత వరకు అత్యంత అందమైన ఆస్తి అంటే తలపండిన జ్ఞానం కాదు.. ప్రేమతో నిండిన హృదయం, వినడానికి సిద్ధంగా ఉన్న చెవి, సాయానికి చేయందించే మనసు’. కొవిడ్ విపత్కర సమయంలో ఎన్నో చేతులు సాయం కోసం ఎదురుచూస్తుంటే.. మరెన్నో చేతులు అండగా నిలుస్తున్నాయి. ‘మానవసేవే మాధవసేవ’ అనే మాటకు నిలువెత్తు నిదర్శనంగా, మూర్తీవించిన మానవత్వానికి ప్రతీకలుగా కరోనా బాధితులకు, పేదలకు తమకు తోచిన తోడ్పాటునందిస్తున్నారు. ఈ క్రమంలోనే ‘రిలీఫ్ రైడర్స్’ అనే సైక్లిస్ట్ గ్రూప్స్.. హైదరాబాద్ సహా పలు నగరాల్లో వృద్ధులకు ఔషధాలు అందిస్తూనే ఆక్సిజన్ సిలిండర్లు, బ్లడ్ ప్లాస్మా యూనిట్లు, ఎమర్జెన్సీ మెడిసిన్స్, ఐసీయూ పడకలను ఏర్పాటు చేస్తూ ముందుకు సాగుతున్నారు.

పర్యావరణ హితమైన సైకిల్ వాడకాన్ని నగరాల్లో ప్రోత్సహించే ఉద్దేశంతో ఆమ్‌స్టర్‌డమ్ బేస్డ్ సామాజిక సంస్థ ‘బీవైసీఎస్’ ఆధ్వర్యంలో ఇప్పటికే చాలా దేశాల్లో సైక్లిస్ట్ గ్రూప్స్ ఏర్పాటయ్యాయి. ‘రిలీఫ్ రైడర్స్’‌గా పేరొందిన ఈ గ్రూప్స్.. ఇండియాలోని బెంగళూరు, గురుగ్రామ్, చెన్నై, ముంబై, హైదరాబాద్ నగరాల్లోనూ ఉండగా, ప్రతి గ్రూపునకు ఒక ‘మేయర్’‌ ఉంటారు. కాగా హైదరాబాద్‌‌లోని ‘రిలీఫ్ రైడర్స్’కు నగరంలోని ఓ ఐటీ సంస్థలో ప్రోగ్రాం మేనేజర్‌గా పనిచేస్తున్న సంతాన సెల్వన్ మేయర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నాడు. ఈ గ్రూప్ ఇటీవలే ప్రారంభం కాగా, వందల మంది సైక్లిస్ట్‌లు ఇందులో భాగమయ్యారు. కాగా, కరోనా వ్యాప్తి తీవ్రతరమవుతున్న నేపథ్యంలో గతవారం తన ఫోన్ నంబర్‌‌ను ఆన్‌లైన్‌లో షేర్ చేసిన సెల్వన్.. కొవిడ్ సమయంలో మందులు, ఫుడ్, ఇతర అవసరాల కోసం హెల్ప్ చేస్తానంటూ మెసేజ్ పెట్టాడు. ఈ మేరకు తనతో పాటు తమ ‘రిలీఫ్ రైడర్స్’ అందరూ ప్రస్తుతం హైదరాబాద్ అంతటా సీనియర్ సిటిజన్లకు తగిన సాయం అందిస్తున్నారు. ఈ మేరకు సెల్వన్‌కు హైదరాబాద్ సైక్లిస్టులు, హ్యాపీ హైదరాబాద్ వంటి గ్రూపుల నుంచి మద్దతు లభించింది

ఎవరైనా సాయం కోరుతూ సెల్వన్‌కు కాల్ చేస్తే చాలు.. ముందుగా వారి వివరాలు తెలుసుకుని ‘రిలీఫ్ రైడర్స్’ వాట్సాప్ గ్రూప్‌లో పోస్ట్ చేస్తాడు. ఆ మెసేజ్‌లో పేర్కొన్న ప్రాంతం ఆధారంగా, అక్కడికి దగ్గరలోని వలంటీర్ తనకు ఐదు కిలోమీటర్ల పరిధి వరకు ఆ అభ్యర్థనను స్వీకరిస్తాడు. ప్రస్తుతం సెల్వన్ (9566170334) ఉదయం 6 నుంచి 9 గంటల మధ్య, మళ్లీ సాయంత్రం 6 -9 గంటల వరకు రిక్వెస్ట్ కాల్స్ తీసుకుంటున్నాడు. ఈ క్రమంలో తమ బృందానికి ప్రతీరోజు దాదాపు 70 కాల్స్ వస్తున్నాయని ఐటీ ఇంజనీర్, రిలీఫ్ రైడర్స్ కీ కోఆర్డినేటర్ రవి సంబరి వెల్లడించారు. హాస్పిటల్ పడకలు, ఆక్సిజన్ సిలిండర్లు, అత్యవసర మందులు, బ్లడ్ ప్లాస్మా, ఆహారం మొదలైన వాటి కోసం కాల్స్ వస్తున్నట్టు ఆయన తెలిపాడు.

బెంగళూరులో :

రిలీఫ్ రైడర్స్ బెంగళూరు‌కు సత్య శంకరన్ ‘సైకిల్ మేయర్’గా నాయకత్వం వహిస్తున్నాడు. కరోనా ఫస్ట్ వేవ్‌ టైమ్‌లో రిలీఫ్ రైడర్స్‌ను ఏర్పాటు చేసిన సత్య.. ఇటీవలే తన సేవలను పున:ప్రారంభించాడు. వీరి బృందం బెంగళూరులో ప్రతీరోజు ఉదయం 6 నుంచి 10 గంటల వరకు (అత్యవసర పరిస్థితుల్లో ఇతర సమయాల్లోనూ) పనిచేస్తుంది. ఈ క్రమంలో ఎల్డర్స్ హెల్ప్‌లైన్‌ (1090)‌తో కూడా రిలీఫ్ రైడర్స్ ఒప్పందం కుదుర్చుకుంది.

ఇక చెన్నైలో మే 3 నుంచి రిలీఫ్ రైడర్స్ సేవలు ప్రారంభం కాగా, ఇక్కడ సైకిల్ మేయర్‌గా ఫెలిక్స్ జాన్ కొనసాగుతున్నాడు. గతేడాది కంటే పరిస్థితి చాలా ఘోరంగా ఉందని చెబుతున్న జాన్.. బయట తిరగడం ప్రమాదకరమే అయినా మందులతో పాటు ఇతరత్రా ఎమర్జెన్సీ పనులున్నవారు కూడా పెరిగారని, అందుకే మేము స్వచ్ఛందంగా సేవ చేయాలని నిర్ణయించుకున్నామని తెలిపాడు. ఇక గురుగ్రామ్‌లో వినీత్ చోప్రా అనే వ్యక్తి తమ రిలీఫ్ రైడర్స్ వలంటీర్ల సాయంతో మందులు డెలివరీ చేస్తున్నాడు. తమకు రోజుకు 40 -50 కాల్స్ వస్తున్నాయని, చాలా మంది ఆక్సిజన్ సిలిండర్లు లేదా రెమ్‌డెసివిర్ కోసం అడుగుతున్నారని తెలిపాడు.

మేము సైక్లిస్టులమే కాదు, సాధారణ ఐటీ ఉద్యోగులం కూడా. ప్రస్తుతం ఆఫీస్‌ టైమ్‌కు ముందు, తర్వాత మందులు పంపిణీ చేస్తున్నాం. ప్రస్తుతం ఎక్కువ మంది వలంటీర్లు చేరడంతో.. మేము ఆహారం, ఇతర నిత్యావసరాలను కూడా ఇవ్వాలని ఆలోచిస్తున్నాం. మా సర్వీస్‌లో భాగంగా చాలా మంది వృద్ధులు ఒంటరిగా జీవించడాన్ని చూస్తున్నాం. వారికి సాయం చేసేందుకు ఎవరూ లేరు. మేము మందులు తీసుకెళ్లి ఇస్తున్నప్పుడు వాళ్లు భావోద్వేగానికి గురవుతున్నారు. మాకు ఈ సంతృప్తి చాలు.
– సెల్వన్, రిలీఫ్ రైడర్స్, హైదరాబాద్ మేయర్

రిలీఫ్ రైడర్స్ కాంటాక్ట్ డీటెయిల్స్ :

బెంగళూరు : 9886491982, 9731905685, 9591975791, 9535554071
చెన్నై : 8939233053, 9840059830, 9840728071
గురుగ్రామ్ : 8383940349, 9643002469
హైదరాబాద్ : 9566170334
ముంబై : 8591441671, 9820063141, 9619316254, 9820994495

Tags:    

Similar News