‘ఫ్రెండీ పోలీసింగ్’ ఉత్తదేనా..?

దిశ, క్రైమ్‌బ్యూరో: రాష్ట్ర ఆవిర్భావం అనంతరం ఫ్రెండ్లీ పోలీసింగ్ నినాదం మారుమోగుతోంది. ‘వెల్ కమ్ టు పీపుల్స్ ఫ్రెండ్లీ పోలీస్.. భద్రత మాదే. బాధ్యత మాదే’ అంటూ అందరి పోలీసుల మొబైల్ ఫోన్లలో అదే రింగ్ టోన్. ఇదంతా ఆచరణలో నిజమైతే బాగుండు అనుకునేటోళ్లే అధికం. రాష్ట్రంలో ఫ్రెండ్లీ పోలీస్ విధానం అమల్లోకి వచ్చి ఏడేళ్లు గడుస్తున్నా ఇంకా చాలామంది పోలీసుల్లో మాత్రం మార్పు కనిపించడం లేదని తెలుస్తోంది. బాధితులకు సత్వరమే న్యాయం జరగాలనే ఉద్దేశంతో నిర్ణయించిన […]

Update: 2020-09-09 03:46 GMT

దిశ, క్రైమ్‌బ్యూరో: రాష్ట్ర ఆవిర్భావం అనంతరం ఫ్రెండ్లీ పోలీసింగ్ నినాదం మారుమోగుతోంది. ‘వెల్ కమ్ టు పీపుల్స్ ఫ్రెండ్లీ పోలీస్.. భద్రత మాదే. బాధ్యత మాదే’ అంటూ అందరి పోలీసుల మొబైల్ ఫోన్లలో అదే రింగ్ టోన్. ఇదంతా ఆచరణలో నిజమైతే బాగుండు అనుకునేటోళ్లే అధికం. రాష్ట్రంలో ఫ్రెండ్లీ పోలీస్ విధానం అమల్లోకి వచ్చి ఏడేళ్లు గడుస్తున్నా ఇంకా చాలామంది పోలీసుల్లో మాత్రం మార్పు కనిపించడం లేదని తెలుస్తోంది. బాధితులకు సత్వరమే న్యాయం జరగాలనే ఉద్దేశంతో నిర్ణయించిన జీరో ఎఫ్ఐఆర్ అక్కడక్కడ మాత్రమే నమోదు అవుతున్నాయి. జీరో ఎఫ్ఐఆర్ నమోదుకు పోలీసు అధికారులు పెద్దగా ఆసక్తి చూపడం లేదనే విమర్శలు ఉన్నాయి. అందుకు సంబంధించిన సంఘటనలు సైతం తరుచుగా వెలుగు చూస్తున్నాయి.

ఆశించిన మార్పు రాలే..

పోలీస్ శాఖను పీపుల్స్ ఫ్రెండ్లీ వ్యవస్థగా రూపొందిస్తామని చెప్పినా గతంలో కంటే పెద్దగా భిన్నమైన వాతావరణం ఏమాత్రం కన్పించడం లేదనే విమర్శలు ఉన్నాయి. పోలీసులకు కొత్త వాహనాలు మంజూరు చేయడం, పోలీస్ స్టేషన్లను కార్పొరేట్ పద్ధతిలో ఆధునీకరించడం మాత్రమే చేశారు. అంతే కానీ, ప్రభుత్వం చెప్పినట్టుగా ఫ్రెండ్లీ పోలీసింగ్ వైపుగా చెప్పుకోదగ్గ పెద్ద మార్పులేమీ జరగలేదంటూ ప్రజలు భావిస్తున్నారు.

పోలీస్ స్టేషన్ కు వెళ్లి ఫిర్యాదు చేసే వారి పట్ల వ్యవహారించాల్సిన తీరులోనూ ఏమాత్రం మార్పులు చోటు చేసుకోకపోవడం విస్మయం కలిగిస్తోంది. ఇటీవల కాలంలో భూ వివాదాల్లో జోక్యం చేసుకోవడమే అత్యధికం అవుతున్నట్టుగా కన్పిస్తోంది. బంజారాహిల్స్ ఎస్ఐ ఓ భూవివాదంలో తలదూర్చి చివరకు కటకటాలు లెక్కించాల్సి వచ్చింది. చాలాచోట్ల రియల్ వ్యాపారులకు, రాజకీయ నాయకులకు వత్తాసు పలుకుతూ బాధితులపై వేధింపులు, బెదిరింపులకు పాల్పడుతున్నారు. ఈ తరహా విషయాలపై నిరంతరం పత్రికల్లో వార్తలుగా ప్రచురితమవుతూనే ఉన్నాయి.

న్యాయం జరుగుతుందనే నమ్మకం వచ్చేదెప్పుడో..?

దిశ ఘటన అనంతరం జీరో ఎఫ్ఐఆర్ పై తీవ్రమైన చర్చ కొనసాగింది. ఈ సమయంలో కొన్ని సందర్భాల్లోనే జీరో ఎఫ్ఐఆర్ నమోదైన మాట నిజమే. ఆ తర్వాత పోలీసులు పెద్దగా పట్టించుకోవడం లేదనే విమర్శలు వస్తున్నాయి. తాజాగా దిల్ సుఖ్ నగర్ ఆర్టీసీ డిపో ఉద్యోగి చిట్టీల పేరుతో తోటి ఉద్యోగుల నుంచి దాదాపు రూ.6 కోట్లకు పైగా వసూలు చేసుకుని ఉడాయించిన ఘటనలో బాధితులు ఫిర్యాదు చేసేందుకు రెండు పోలీస్ స్టేషన్లకు తిరగాల్సి వచ్చింది. అయినా కూడా ఉచిత సలహాలతోనే పోలీసులు సరిపుచ్చారు కానీ, కేసు మాత్రం నమోదు చేయలేదు.

ఓ మహిళా బాధితురాలి ఫిర్యాదుపై కేసు నమోదు చేయడానికి పోలీసులు మూడురోజుల సమయం తీసుకున్నారు. దీంతో పోలీస్ స్టేషన్లలో బాధితులకు న్యాయం జరుగుతుందనే విశ్వాసానికి రాలేకపోతున్నారు. తిరుమలగిరి పోలీస్ స్టేషన్ చెందిన పోలీసులు తనను వేధిస్తున్నారంటూ ఓ బాధితుడు ఏకంగా డీజీపీకే ఫిర్యాదు చేశారు. పోలీస్ స్టేషన్ కు వెళ్ళి రావడం భారంగా, భయంగా కాకుండా, ప్రజలు ఎప్పుడైతే హుందాతనంగా భావిస్తారో అప్పుడు మాత్రమే ప్రజలకు పోలీసుల పట్ల విశ్వాసం కలుగుతోందని పలువురు భావిస్తున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం ఆ వైపు చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.

Read Also…

‘VRO’ రద్దు.. టెన్షన్‌లో రైతులు?

Full View

Tags:    

Similar News