చక్రం తిప్పుతున్న ‘ఒకేఒక్కడు’.. నాలుగు కీలక పోస్టులకు సారొక్కరే..

దిశ, తెలంగాణ బ్యూరో : వైద్యారోగ్యశాఖలో ఇన్‌చార్జ్ డీఎంఈగా కొనసాగుతున్న డాక్టర్ రమేశ్​రెడ్డికి రాష్ట్ర ప్రభుత్వం ఏకంగా నాలుగు పోస్టులు అంటగట్టింది. ప్రస్తుత డీఎంఈ, టీవీవీపీ కమిషనర్ పోస్టులకు ఇన్‌చార్జిగా వ్యవహరిస్తున్న ఆయనకు ఇటీవల అడిషనల్​ డీఎంఈ ప్రమోషన్‌లలో భాగంగా గాంధీ ప్రిన్సిపాల్‌గానూ బాధ్యతలు అప్పగించింది. కీలకమైన ఈ మూడు పోస్టులకే అదనపు పనిభారం ఉండగా, తాజాగా డయాగ్నస్టిక్ ​సెంటర్ల ఇన్‌చార్జిగా మరో బాధ్యతను ఇవ్వడం ఆశ్చర్యానికి గురిచేస్తున్నది. ప్రస్తుతం ఆయన ఏకంగా నాలుగు కీలకమైన బాధ్యతలు […]

Update: 2021-12-20 20:32 GMT

దిశ, తెలంగాణ బ్యూరో : వైద్యారోగ్యశాఖలో ఇన్‌చార్జ్ డీఎంఈగా కొనసాగుతున్న డాక్టర్ రమేశ్​రెడ్డికి రాష్ట్ర ప్రభుత్వం ఏకంగా నాలుగు పోస్టులు అంటగట్టింది. ప్రస్తుత డీఎంఈ, టీవీవీపీ కమిషనర్ పోస్టులకు ఇన్‌చార్జిగా వ్యవహరిస్తున్న ఆయనకు ఇటీవల అడిషనల్​ డీఎంఈ ప్రమోషన్‌లలో భాగంగా గాంధీ ప్రిన్సిపాల్‌గానూ బాధ్యతలు అప్పగించింది. కీలకమైన ఈ మూడు పోస్టులకే అదనపు పనిభారం ఉండగా, తాజాగా డయాగ్నస్టిక్ ​సెంటర్ల ఇన్‌చార్జిగా మరో బాధ్యతను ఇవ్వడం ఆశ్చర్యానికి గురిచేస్తున్నది. ప్రస్తుతం ఆయన ఏకంగా నాలుగు కీలకమైన బాధ్యతలు నిర్వర్తించాల్సి ఉన్నది.

ఆయా పోస్టులకు అర్హత గల వ్యక్తులు ఉన్నా, సీనియారిటీ లేని రమేశ్​రెడ్డికి ఇన్ని పోస్టులు ఇవ్వడం వెనుక ఆంతర్యమేంటి అని వైద్యారోగ్యశాఖలో చర్చ నడుస్తున్నది. మరోవైపు ఇప్పటికే ఉన్న మూడు పోస్టులతో పని ఒత్తిడి ఉన్నదని, దీంతో మానసికంగా తాను ఇబ్బంది పడుతున్నట్టు ఆయన ఆరోగ్యశాఖలోని కొందరి అధికారుల వద్ద ఆవేదన వ్యక్తం చేసినట్టు తెలిసింది. అయినా, ఇవేమీ పట్టించుకోకుండా ప్రభుత్వం మరో బాధ్యతను అప్పగించడంతో ఆయన షాక్‌లో ఉన్నట్టు డీఎంఈ కార్యాలయ వర్గాల భోగట్టా. మరోవైపు ఆయనే కావాలని అన్ని పోస్టులు తీసుకుంటున్నట్టు మరి కొందరు విస్తృతంగా చర్చించుకుంటున్నారు.

టీవీవీపీ వ్యవస్థ అస్తవ్యస్తం..

వాస్తవానికి డీఎంఈ పరిధిలో బాధ్యతలు నిర్వర్తించడం పెద్ద టాస్క్. మెడికల్ కాలేజీలు, టీచింగ్ ఆస్పత్రులు, విద్యార్థులు, మెడికల్, నర్సింగ్ కౌన్సిల్ ఇలాంటివన్నీ నిత్యం ఎప్పటికప్పుడు డీఎంఈ మానిటరింగ్​చేస్తూ ఉండాలి. సమీక్షలు, సెమినార్లు పెట్టి వాటి అభివృద్ధికి కృషి చేయాల్సి ఉంటుంది. ఎక్కువ పోస్టులు ఒకే వ్యక్తి దగ్గర ఉండటంతో గతకొన్నేళ్లుగా సక్రమంగా పని జరగడం లేదని వైద్యశాఖలో చర్చించుకుంటున్నారు. దీంతోపాటు డాక్టర్ రమేశ్​రెడ్డి టీవీవీపీ తాత్కాలిక కమిషనర్‌గానూ వ్యవహరిస్తున్నారు. కానీ, రెండేళ్ల నుంచి ఆ విభాగంలో ఒక్క సమీక్ష కూడా జరుగలేదంటే పరిస్థితి ఎలా ఉందో అర్ధం చేసుకోవచ్చు. ఈ క్రమంలో రాష్ట్ర వ్యాప్తంగా టీవీవీపీ పరిధిలో ఉన్న సుమారు 112పైగా ఆస్పత్రులు అస్తవ్యస్తంగా మారిపోయాయి. కనీస మౌలిక సౌకర్యాలు లేక రోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. దీంతో జిల్లాల పేషెంట్లు హైదరాబాద్‌కు పరుగులు పెట్టాల్సి వస్తున్నది. తద్వారా పట్నంలోని ఆస్పత్రులపై ఒత్తిడి పెరిగి వైద్య సేవలు ఆలస్యమవుతున్నాయి. ఇప్పటికే ఆయా ఆస్పత్రుల క్షేత్రస్థాయి డాక్టర్లు పరిస్థితిని వివరించినా, డీఎంఈ వినే స్థాయిలో లేరని వారు వాపోయారు.

నాలుగేళ్లుగా..

డీఎంఈపై ఆ విభాగంలోని అధికారులు, ప్రొఫెసర్లు గుర్రుగా ఉన్నారు. సీనియారిటీ జాబితా ప్రకారం లిస్టులో 54వ స్థానంలో ఉన్న వ్యక్తికి డీఎంఈగా బాధ్యతలు అప్పగించడంపై ప్రొఫెసర్ల నుంచి తీవ్ర వ్యతిరేకత వస్తున్నది. నాలుగేళ్ల నుంచి ప్రభుత్వం ఆయనను అదే పోస్టులో కొనసాగించడం గమనార్హం. సీఎం కార్యాలయంలోని కొందరి అధికారులతో దగ్గరి సంబంధాలు ఉండటంతోనే రమేశ్​రెడ్డి ఏది చెప్పినా నడుస్తున్నదని వైద్యశాఖలో గత నాలుగేళ్లుగా ప్రచారం జరుగుతున్నది. మరోవైపు ప్రొఫెసర్ల రిటైర్మెంట్ వయస్సు 65 ఏళ్లకు పెంచాలని ఏడేళ్ల నుంచి డిమాండ్ ఉన్నా, తనకంటే సీనియర్లంతా రిటైర్‌ అయ్యేవరకు ఫైల్‌ను తొక్కి పెట్టారనే ఆరోపణలున్నాయి.

2019 జూన్‌లో రమేశ్​రెడ్డి రిటైరయ్యే సమయంలో వయస్సు పెంచుతూ ప్రభుత్వంతో ఉత్తర్వులు జారీ చేయించారనే వాదనా ఉన్నది. ఇటీవల ప్రమోషన్లు పొందిన 31 మందిలో ఆయన 13వ స్థానంలో ఉన్నారు. కానీ, సర్కార్ ఆయనకు అదనపు బాధ్యతలు ఇవ్వడం ఆశ్చర్యానికి గురిచేస్తున్నది. ప్రభుత్వం దృష్టితో తాను తప్ప మరే అధికారీ సమర్థుడు కాడని నిరూపించుకునేందుకే సీనియర్లందరికీ దూర ప్రాంతాల్లో పోస్టింగ్స్​ఇచ్చినట్లు పలువురు ప్రొఫెసర్లు మండిపడుతున్నారు.

 

Tags:    

Similar News