వీసీ పదవికి ఒక్క ముస్లిం దొరకలేదా..?
దిశ, తెలంగాణ బ్యూరో : సీఎం కేసీఆర్ మతపరమైన ఎజెండాను అనుసరిస్తున్నారని, ఆ విషయం తెలంగాణలోని విశ్వవిద్యాలయాలకు ప్రభుత్వం వీసీలను నియమించిన జాబితాను పరిశీలిస్తే తెలుస్తోందని మాజీ మంత్రి మహ్మద్ అలీ షబ్బీర్ ఆదివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. వీసీగా నియమించేందుకు విద్యావంతుడైన ఒక్క ముస్లిం కూడా సీఎంకేసీఆర్ ప్రభుత్వానికి కనబడలేదా అని ప్రశ్నించారు. టీఎస్ పీఎస్సీ చైర్మన్, సభ్యుల నియామకాల్లోనూ ముస్లింలకు ప్రాధాన్యత కల్పించడాన్ని సీఎం కేసీఆర్ విస్మరించారని ఆగ్రహం వ్యక్తంచేశారు. విద్య, ఉద్యోగాల్లో ముస్లింలకు […]
దిశ, తెలంగాణ బ్యూరో : సీఎం కేసీఆర్ మతపరమైన ఎజెండాను అనుసరిస్తున్నారని, ఆ విషయం తెలంగాణలోని విశ్వవిద్యాలయాలకు ప్రభుత్వం వీసీలను నియమించిన జాబితాను పరిశీలిస్తే తెలుస్తోందని మాజీ మంత్రి మహ్మద్ అలీ షబ్బీర్ ఆదివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. వీసీగా నియమించేందుకు విద్యావంతుడైన ఒక్క ముస్లిం కూడా సీఎంకేసీఆర్ ప్రభుత్వానికి కనబడలేదా అని ప్రశ్నించారు. టీఎస్ పీఎస్సీ చైర్మన్, సభ్యుల నియామకాల్లోనూ ముస్లింలకు ప్రాధాన్యత కల్పించడాన్ని సీఎం కేసీఆర్ విస్మరించారని ఆగ్రహం వ్యక్తంచేశారు. విద్య, ఉద్యోగాల్లో ముస్లింలకు 12 శాతం రిజర్వేషన్లు ఇస్తామన్న హామీతో జనాన్ని నమ్మించి 2014లో అధికారంలోకి వచ్చారని, తర్వాత కూడా అలాంటి బోగస్ హామీలే ఇచ్చి రెండోసారి కూడా అధికారాన్ని వశం చేసుకున్నారని ఆరోపించారు.
తెలంగాణ ప్రభుత్వం ముస్లింలకు ఎక్కడా ఒక్క శాతం కూడా ప్రాతినిధ్యం కల్పించలేదని దుయ్యబట్టారు. టీఆర్‌ఎస్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి దాదాపు 80 శాతం మైనార్టీలకు చెందిన ఉన్నత విద్యాసంస్థలను మూతపడేలా చేశారని అన్నారు. హజ్ కమిటీ, మైనారిటీస్ ఫైనాన్స్ కమిషన్, ఉర్దూ అకాడమీ వంటి అనేక సంస్థలను తలలేనివిగా చేశారని కాంగ్రెస్ నేత షబ్బీర్ పేర్కొన్నారు. ఈ వాస్తవాలను టీఆర్‌ఎస్‌తో సంబంధమున్నముస్లిం నాయకులు ఆత్మపరిశీలన చేసుకోవాలని సూచించారు. సచివాలయంలో కూల్చివేసిన మసీదులను పునర్నిర్మిస్తామని హామీ ఇచ్చి 20 నెలలైనా హామీని నెరవేర్చేందుకు ప్రయత్నించలేదన్నారు. లాకౌడౌన్‌లోనూ పోలీసులు స్వాధీనం చేసుకున్న వేలాది వాహనాల్లో ఎక్కువ భాగం మైనారిటీలకు చెందినవే ఉన్నాయని షబ్బీర్ ఆరోపించారు. విద్యుత్ సిబ్బందిని పోలీసులు కొట్టడంపై మంత్రులు మహమూద్ అలీ, కేటీఆర్, జగదీష్ రెడ్డి నిస్సహాయత స్పష్టంగా కనిపించిందని ఆయన పేర్కొన్నారు. వారి ఆధీనంలో పనిచేసే అధికారులకు ఆదేశాలు జారీ చేయకుండా డీజీపీని అభ్యర్థించే దుస్థితికి వారు చేరుకోవడం సిగ్గుచేటని వ్యాఖ్యలు చేశారు. లాక్ డౌన్ పేరుతో బాధితుల నుంచి అన్యాయంగా స్వాధీనం చేసుకున్న వాహనాలన్నింటినీ తిరిగి అప్పగించాలని షబ్బీర్ డిమాండ్ చేశారు.