ఆఫీసర్లే ‘వసూల్’ రాజాలు.. సంచలనంగా మారిన ‘హరితహారం’ నిధుల స్వాహా
దిశ ప్రతినిధి, వరంగల్ : అటవీశాఖలో ఆటవిక దోపిడీ జరుగుతోంది. అటవీ పరిరక్షణ, విస్తరణకు వినియోగించాల్సిన నిధులను అధికారులు అందినకాడికి దోచేస్తున్నారు. క్షేత్రస్థాయి అధికారుల ఖాతాల్లోకి చేరాల్సిన పూర్తి నగదు మొత్తంలో మా వాటా అంటూ ఉన్నతాధికారులు కోత పెడుతున్నారు. ఉన్నతాధికారులకు అందజేయాల్సి ఉంటుందని పేర్కొంటూ సెక్షన్ ఆఫీసర్ల స్థాయిలో వ్యయం చేయాల్సిన నిధులను రేంజ్ ఆఫీసర్లు మింగుతున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 42 డివిజన్లు, 600 రేంజ్‌ల్లోనూ యథేచ్ఛగా ఈ దందా సాగుతున్నట్లుగా తెలుస్తోంది. గూడూరు […]
దిశ ప్రతినిధి, వరంగల్ : అటవీశాఖలో ఆటవిక దోపిడీ జరుగుతోంది. అటవీ పరిరక్షణ, విస్తరణకు వినియోగించాల్సిన నిధులను అధికారులు అందినకాడికి దోచేస్తున్నారు. క్షేత్రస్థాయి అధికారుల ఖాతాల్లోకి చేరాల్సిన పూర్తి నగదు మొత్తంలో మా వాటా అంటూ ఉన్నతాధికారులు కోత పెడుతున్నారు. ఉన్నతాధికారులకు అందజేయాల్సి ఉంటుందని పేర్కొంటూ సెక్షన్ ఆఫీసర్ల స్థాయిలో వ్యయం చేయాల్సిన నిధులను రేంజ్ ఆఫీసర్లు మింగుతున్నారు.
రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 42 డివిజన్లు, 600 రేంజ్‌ల్లోనూ యథేచ్ఛగా ఈ దందా సాగుతున్నట్లుగా తెలుస్తోంది. గూడూరు రేంజ్‌లో నిధుల మాయకు సంబంధించిన కీలక ఆధారాలు ‘దిశ’ చేతికి చిక్కాయి. ఇప్పుడు తీగ లాగితే డొంక కదులుతోంది. రాష్ట్ర వ్యాప్తంగా దోపిడీ ఉందని అత్యంత విశ్వసనీయ వర్గాల ద్వారా తెలుస్తోంది. ఒక్కో రేంజ్ పరిధిలో లక్షల రూపాయాలు ఉన్నతాధికారుల జేబుల్లోకి వెళ్తున్నట్లుగా సమాచారం అందుతోంది. అటవీశాఖకు విడుదలైన నిధుల్లో దాదాపు అన్ని స్థాయిల్లో పర్సంటేజీల విధానం కొనసాగుతున్నట్లు తెలుస్తోంది.
ప్రభుత్వం హరితహారం లక్ష్యాల కోసం విడుదల చేసిన నిధులు మధ్యలోనే మాయమవుతున్నాయన్న ఆరోపణలున్నాయి. ఉన్నతాధికారులు ఇలా ఉన్న నిధులను మధ్యలోనే మాయం చేస్తుండటంతో చేపట్టాల్సిన పనులను ఎలా పూర్తిచేయాలంటూ క్షేత్రస్థాయి సెక్షన్ అధికారులు వాపోతున్నారు.
గూడూరు రేంజ్‌లో అవినీతి పర్వం..
మహబూబాబాద్ జిల్లా గూడూరు రేంజ్ పరిధిలో జరిగిన నిధుల దోపిడీ అటవీశాఖలో జరుగుతున్న అక్రమాలకు నిలువుటద్దంగా నిలుస్తోంది. గూడూరు రేంజ్ పరిధిలో అటవీ సంరక్షణకు, విస్తరణకు రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల రూ.45లక్షలను మంజూరు చేసింది. అయితే ఈ మొత్తంతో గూడూరు రేంజ్ పరిధిలోని మచ్చర్ల, గుంజేడు, కార్లాయి, గూడూరు, అప్పరాశ్‌పల్లి, మర్రిమిట్ట, కొంగర్లగిద్ద, భూపతిపేట సెక్షన్ల పరిధిలో పోడు భూముల్లో హరితహారం మొక్కలు నాటడం, జీవాలకు నీటి వసతి కల్పన, జంతువులను గుర్తించే పరికరాల ఏర్పాటు, నీటిగుంతల తవ్వకం, నర్సరీల నిర్వహణ వంటి కార్యక్రమాలు చేపట్టాల్సి ఉంది.
అయితే పనులను రేంజ్ ఆఫీసర్ అమృత పర్యవేక్షణలో సెక్షన్ ఆఫీసర్లు నిర్వహించాల్సి ఉంటుంది. ప్రభుత్వం నిర్దేశించిన ప్రకారం వివిధ పనుల కోసం మంజూరైన నిధులను సెక్షన్ ఆఫీసర్ల ఖాతాలకు బదిలీ చేయాలి. అయితే మంజూరైన నిధుల్లో 15శాతం మొత్తాన్ని కట్ చేసుకుని మిగతా మొత్తాన్ని సెక్షన్ అధికారుల ఖాతాల్లో జమ చేసినట్లు ‘దిశ’కు లభ్యమైన ఆధారంలో ప్రస్పుటమవుతోంది. మొత్తం నిధుల్లో ఎఫ్‌ఆర్వో తన పర్సంటేజీగా తీసుకున్న మొత్తం అక్షరాల రూ.5లక్షల 86వేల 708 రూపాయలు కావడం గమనార్హం.
కోట్ల నిధులు దుర్వినియోగం..
కాంపన్సేటరీ ఎఫారెస్టేషన్ ఫండ్ మేనేజ్‌మెంట్ అండ్ ప్లానింగ్ అథారిటీ (కంపా) కింద కేంద్ర ప్రభుత్వం నుంచి ఏటా రాష్ట్ర ప్రభుత్వానికి వందల కోట్ల రూపాయలు మంజూరవుతున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం అటవీ ప్రాంతాల్లో హరితహారం కార్యక్రమం అమలుకు వీటిని మళ్లిస్తోంది. రాష్ట్ర ప్రభుత్వం ఉన్నత లక్ష్యంతో ఈ కార్యక్రమం చేపట్టినా అడవుల్లో చేపట్టిన పనుల పరిశీలన, జరుగుతున్న పనులపై పర్యవేక్షణ లేకపోవడంతో ఉన్నతాధికారులు ఆడిందే ఆట.. దోచుకున్నోళ్లకు దోచుకున్నంత అన్న చందంగా ఈ పథకం మారిందన్న విమర్శలు ఆ శాఖలో పనిచేసే సిబ్బందే వెల్లడిస్తుండటం గమనార్హం. అసలు కొన్ని పనులు ప్రారంభించకుండా బిల్లులు కాజేసిన వైనముందంటూ గుట్టు విప్పుతున్నారు.