సమస్యల్లోకి నెట్టి.. సైలంటయ్యారు!
భవిష్యత్ ప్రణాళికలు లేని మహా నగర శివారు ప్రాంతాలు.. పెరుగుతున్న కాలనీలకు అనుగుణంగా లేని మురుగునీటి పారుదల వ్యవస్థ.. చెరువులు, చెరువులకు మధ్య లేని కనెక్షన్లు.. వరద నీటిని తీసుకెళ్లకుండా కుచించుకుపోయిన నాలాలు.. వెరసి వానొస్తే నగర శివారు ప్రాంతాలు వణికిపోతున్నాయి.. రోడ్లన్నీ జలమయమవుతున్నాయి.. వాహనాలు ఎక్కడికక్కడ నిలిచిపోయి.. జనజీవనం స్తంభించిపోతోంది.. మరి ఎందుకిలా జరుగుతోంది..? ఈ నగరానికి ఏమైంది..? ఇంజినీర్లు, విద్యావంతులు లేరా మన నగరంలో..? విశ్వనగర ఖ్యాతిగాంచడం తప్ప వదర నుంచి విముక్తి లేదా..? […]
భవిష్యత్ ప్రణాళికలు లేని మహా నగర శివారు ప్రాంతాలు.. పెరుగుతున్న కాలనీలకు అనుగుణంగా లేని మురుగునీటి పారుదల వ్యవస్థ.. చెరువులు, చెరువులకు మధ్య లేని కనెక్షన్లు.. వరద నీటిని తీసుకెళ్లకుండా కుచించుకుపోయిన నాలాలు.. వెరసి వానొస్తే నగర శివారు ప్రాంతాలు వణికిపోతున్నాయి.. రోడ్లన్నీ జలమయమవుతున్నాయి.. వాహనాలు ఎక్కడికక్కడ నిలిచిపోయి.. జనజీవనం స్తంభించిపోతోంది.. మరి ఎందుకిలా జరుగుతోంది..? ఈ నగరానికి ఏమైంది..? ఇంజినీర్లు, విద్యావంతులు లేరా మన నగరంలో..? విశ్వనగర ఖ్యాతిగాంచడం తప్ప వదర నుంచి విముక్తి లేదా..? దశాబ్దాలు గడుస్తున్నా సమస్యకు పరిష్కారం దొరకడం లేదేంటంటే ‘పాపం పాలకులదే..’నని బోధపడుతోంది..
దిశ, తెలంగాణ బ్యూరో: నిజాం కాలంలో ఏర్పడిన నగరంలోని ప్రధాన ప్రాంతాలు వరద ముంపునకు గురికావడంలేదు. ఎంత భారీ వర్షాలు కురిసినా గంటల వ్యవధిలోనే నగరం నుంచి వరదలు కనుమరుగవుతున్నాయి. అందుక్కారణం ఆనాటి పాలకులు ప్రజలపై సేవా భావంతో భవిష్యత్ ను దృష్టిలో పెట్టుకుని నగరానికి రచించిన ప్రణాళికలేనని అని స్పష్టమవుతోంది.. ఆనాడు అంతగా ఇంజినీర్లు లేరు. ఆనాడే విశాలమైన రోడ్లు, వెడల్పైన నాలాలు, చెరువులకు లింకేజీ, క్రమమైన పద్ధతితో మురుగుపారుదల వ్యవస్థను నగరానికి రూపకల్పన చేసినట్టు వాటిని పరిశీలిస్తే తెలుస్తుంది. కానీ, అనంతరం వచ్చిన పాలకులు సేవాభావాన్ని విస్మరిస్తున్నారనేది శివారు ప్రాంతవాసుల అభిప్రాయం. ప్రజలను సమస్యల్లోకి నెట్టడం, రియల్టర్లకు మద్దతివ్వడం, బాధ్యతా రాహిత్యంతో పనిచేసే అధికారులను వెనుకేసుకురావడమేననే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.
ప్రణాళికా రహితమైన శివార్లు..
పాలకులు, రియల్టర్లు, అధికారులు కలిసి చేసిన పాపం నేడు హైదరాబాద్ శివారు ప్రజలకు శాపంగా మారింది. ఈ ముగ్గురిలో ఏ ఒక్కరు బాధ్యతాయుతంగా వ్యవహరించినా ఈ రోజు ప్రణాళికాబద్ధమైన విశ్వనగరం సాక్షాత్కరించేది. పాలకుల్లో సేవా దృక్పథం లోపించడం వల్లే శివారు ప్రాంతాల్లో ఇప్పటికీ మురుగునీటి పారుదలకు మాస్టర్ ప్లాన్ లేదు. కొత్త కాలనీల మురుగునీరు నేరుగా చెరువుల్లోకి, మూసీలోకి చేరుతుంది. ఆ చెరువులకు చెరువులకు మధ్య ఉన్న లింకేజీని తెంపేస్తూ లేఅవుట్లు, ఆ లేఅవుట్లలో అపార్టుమెంట్లు, భవనాలు, వాటి మధ్య 20 అడుగుల రోడ్లు ఏర్పడుతున్నాయి. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో మొత్తం 170 చెరువులున్నాయి. వాటికి గతంలో లింకులున్నాయి. ఏ రోడ్డు ఎటుపోతుందో తెలియని అయోమయం, మురుగు కాలువలు దేనికదే చెరువుల్లోకి, వర్షాలు వస్తే వరద నీరు వెళ్లేందుకు నాలాల ఏర్పాటు లేదు. ఫలితంగా వర్షపు నీరు చెరువుల్లోకి, వాటిచెంతనే ఉన్న కాలనీల్లోకి చేరి ముంచుతున్నాయి.
రియల్టర్లకు సపోర్టు వల్లే..
నీటి వనరులను చెరబట్టింది రియల్టర్లు. రియల్టర్లు చేసే లేఅవుట్లను, నిర్మాణాలను నివారించాల్సిన అధికార యంత్రాంగం కాస్త అవినీతికి పెద్దపీట వేస్తుంది. వీరిని గాడిలో పెట్టాల్సిన పాలకులు వారికే సపోర్టుగా ఉండటంతో చెరువుల్లోకి, నాలాలా వెంటే కొత్త కొత్త కాలనీలు వెలుస్తున్నాయి. ఎఫ్ టీఎల్, బఫర్ జోన్ లలో వెలిసే నిర్మాణాలపై చర్యలు లేకుండా పోతున్నాయి. చెరువులు కుచించుకుపోవడం, లింకులు తెగిపోవడం, నాలాల వెంటే కాలనీలు రావడంతో చిన్నపాటి వానకే చెరువుల ఎగువ, దిగువ ప్రాంతాలన్నీ జలమయమవుతున్నాయి. అక్కడి జన జీవనం అస్తవ్యస్తంగా మారుతోంది. ప్రతీ సారి ఈ తరహా సమస్య తలెత్తుతున్నా పాలకులు పట్టించుకోకపోవడంతో ఇక షరామామూలే అవుతోందని ఈ ప్రాంత వాసులు ఆగ్రహాన్ని వ్యక్తంచేస్తున్నారు.
వరద పోయే దారి లేకనే..
ఎల్బీ నగర్ పరిధిలోని కాలనీల ముంపునకు కారణం బడంగ్ పేట్ చెరువు నీళ్లు అల్మాస్ గూడకు, అల్మాస్ గూడ నుంచి మీర్ పేట్ చెరువుకు, అక్కడి నుంచి జిల్లెలగూడ చెరువుకు, ఇక్కడి నీళ్లు సరూర్ నగర్ చెరువుకు చేరి పీఅండ్టీ కాలనీ మీదుగా మూసీలోకి చేరాలి. కానీ ఈ చెరువుల మధ్య లింక్ తెగిపోయింది. ఫలితంగా సరూర్ నగర్ కిందున్న పీఅండ్ టీకాలనీ, గడ్డి అన్నారం, కోదండరాంనగర్ కాలనీల్లోకి వాన నీరుచేరి ముంపునకు గురవుతున్నాయి. జిల్లెలగూడ లో మిథుల్లానగర్, మీర్పేట్ లో ఎస్ఎల్ఎన్ఎస్ నగర్, బడంగ్ పేట్ లో శివనారాయణపురం మునిగిపోతున్నాయి. కూకట్ పల్లి పరిధిలో సున్నం చెరువు నుంచి మైసమ్మ చెరువుకు అక్కడి నుంచి కాముని చెరువు ద్వారా హుస్సేన్ సాగర్ అక్కడి నుంచి మూసీ నదిలోకి వరద కాలువ లింకై ఉన్నది. అయితే, ఆ చెరువుల్లోకి కొత్త కాలనీలు రావడం, వాటి వరద నీటి కాలువలు కుచించుకుపోవడంతో భరత్ నగర్, ధరణికాలనీ, రాజీవ్ నగర్ లు ముంపునకు గురవుతున్నాయి. కత్బుల్లాపూర్ పరిధిలో ఫాక్స్ సాగర్ చెరువు నీరు హస్మత్ పేట్ చెరువు మీదుగా హుస్సేన్ సాగర్ లోకి తద్వారా మూసీలోకి చేరాలి.
కానీ ఫాక్స్ సాగర్, హస్మత్ పేట్ ల మధ్య లింక్ తెగడంతో కుత్బుల్లాపూర్ లో బాలాజీ లేఅవుట్, సుభాష్ నగర్, శ్రీనివాస్ నగర్ లలోకి నీరు చేరింది. ఫాక్స్ సాగర్ పూర్తిగా నిండి గండిపడే దశలో ఉన్నట్టు సమాచారం. అల్వాల్ చెరువు నుంచి మల్కాజిగిరి రామక్రిష్ణాపురం చెరువులోకి, అక్కడి నుంచి సఫిల్ గూడ చెరువు, అక్కడి నుంచి బండచెరువు, ఇక్కడి నుంచి నాచారంలోని రెండు చెరువుల మీదుగా ఉప్పల్ చెరువును చేరుకుని మూసీనదిలోకి వరద కాలువ చేరాలి. ఈ లింక్ తెగిపోయింది. బండ చెరువు ఎగువ, దిగువ ఉన్న ప్రాంతాలు ఎన్ ఎండిసి కాలనీ, షిరిడీనగర్ లు ప్రతి ఏటా నీటమునుగుతాయి. పడవలు కూడా వేస్తారు. ఈ సమస్య దశాబ్దం క్రితం 2006లో కూడా ఇంతకన్నా అధ్వాన్న పరిస్థితి ఏర్పడింది. కానీ, ప్రభుత్వాలు శాశ్వత ప్రాతిపదికన చర్యలు తీసుకోవడంలేదు. రాజేంద్రనగర్ పరిధిలో బుల్ బుల్ కుంట, ఎర్రకుంట, పల్లె చెరువు, అప్పచెరువు, శివరాంపల్లి చెరువులకు లింకేజీ ఉండేది. కానీ, నేడు అదిలేకపోవడంతో పరిసర ప్రాంతాల్లోని కాలనీలు మునిగిపోవడంతో పాటు 8 మంది ప్రాణాలు కోల్పోయినట్టు సమాచారం. దీనికి కారణం పాలక వర్గాలేనని ఇక్కడి జనం దుమ్మెత్తి పోస్తోంది.
ప్రణాళికా బద్ధంగా నాటి వ్యవస్థ..
1908 తర్వాత నగరం ప్రణాళికాబద్ధంగా తీర్చిదిద్దినట్టు అప్పటి వరదనీటి కాలువ(నాలా)లు, మురుగునీటి పారుదల వ్యవస్థ, చెరువుల లింక్ లు తెలియజేస్తుంది. 1908 లో నగరాన్ని ముంచెత్తిన మూసీ వరదలు పునరావృతం కాకుండా పక్కా ప్రణాళికతో నగరానికి రూపకల్పన చేశారు. మూసీ నది ఎగువ ప్రాంతంలో ఉస్మాన్ సాగర్, హిమాయత్ సగార్ రెండు రిజర్వాయర్లను నిర్మించారు. హైదరాబాద్ లో హుస్సేన్ సాగర్ ను నిర్మించి చుట్టూరా ఉన్న రంగదాముని, కాముని, ఫాక్స్ సాగర్ ల నుంచి వరద నీరు ప్రధాన వరద కాలువలను హుస్సేన్ సాగర్ లోకి చేరి అక్కడి నుంచి మూసీనదిలోకి చేరేలా లింకేజీని ఏర్పాటు చేశారు. చార్మినార్, మోజంజాహి మార్కెట్, అబిడ్స్, కోఠి, చాదర్ ఘాట్, మలక్ పేట్, నాంపల్లి ప్రాంతాల్లో విశాలమైన రోడ్లు, ప్రణాళికాబద్దమైన వరద నీటి కాలువలు నేరుగా మూసీలోకి లింక్ చేశారు. అదే విధంగా ఎంత భారీ వర్షం కురిసినా గంటల వ్యవధిలో నీరు కాలనీల నుంచి నేరుగా మూసీ చేరుకునేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేయడం వల్ల చార్మినార్, మొఘల్ పుర, ఖిల్వాత్, శాలిబండ, ఫతే దర్వాజ, పురానా హవేలి, నూర్ ఖాన్ బజార్, హుస్సేని ఆలం, దూత్ బౌలి, ఇంజన్ బౌలి, కోట్ల ఆలీజా, పత్తర్ గట్టి, పంజే షా, పాంచ్ మొహల్లా, చంచల్ గూడ, కాజీపుర, కార్వాన్, జియాగూడ, అఫ్జల్ గంజ్, ఫీల్ ఖానా, జుమ్మేరాత్ బజార్, గోల్కొండ లాంటి ప్రాంతాల్లో వర్షం, వరద నీరు నిలువ లేదు. ఈ ప్రాంతాల్లో జనాభా అధికంగానే ఉంటుంది.
1908లో మూసీకి వచ్చిన వరదను దృష్టిలో పెట్టుకుని అప్పటి ఆరో నిజాం నవాబు (మిర్ మహబూబ్ ఆలీ) కర్నాటకలోని మోక్షగుండం విశ్వేశ్వరయ్య తో మాట్లాడి వరద నీరు వెళ్లిపోడానికి ప్లాన్ ను తయారుచేయాల్సిందిగా కోరారు. 1911లో ఆరవ నవాబు చనిపోవడంతో ఏడవ నవాబు మిర్ ఉస్మాన్ ఆలీ ఖాన్ సిటీ ఇంప్రూవ్‌మెంట్ బోర్డు పేరుతో ఒక వ్యవస్థను ఏర్పాటు చేశారు. నగరంలోకి మూసీ నీరు రాకముందే ఎగువ ప్రాంతంలో దూరంగా నీటిని నిల్వచేసే రిజర్వాయర్లను కట్టడమే ఉత్తమమైన మార్గమని విశ్వేశ్వరయ్య సూచించడంతో అలాంటివి ఏర్పాటయ్యాయి. అప్పటి నుంచి ఇప్పటివరకు నగరానికి వరదలు రాలేదు. విశ్వేశ్వరయ్య ప్లాన్ సక్సెస్ అని రుజువైంది.