మహారాష్ట్రలో ఐదంచెల అన్‌లాక్ ప్లాన్

ముంబై: కరోనా వైరస్ మొదటి, రెండో వేవ్‌లలో అత్యధిక కేసులు నమోదు చేసుకున్న మహారాష్ట్ర ప్రభుత్వం దేశంలో కొత్త తరహా అన్‌లాక్ ప్లాన్‌ను రూపొందించింది. లాక్‌డౌన్ ఆంక్షలే కాదు, అన్‌లాక్ వ్యూహంలోనూ తనదైన ముద్ర వేసుకున్నది. సెకండ్ వేవ్‌ను సమర్థంగా నియంత్రించగలిగిందన్న ప్రశంసలు అందుకున్న ఉద్ధవ్ ఠాక్రే సర్కారు శనివారం ఐదంచెల అన్‌లాక్ ప్లాన్ అనౌన్స్ చేసింది. రాష్ట్రవ్యాప్తంగా ఒకేరీతిలో ఆంక్షలు, సడలింపులు అమలు చేయకుండా, కరోనా పాజిటివిటీ రేటు, ఆక్సిజన్ బెడ్ల ఆక్యుపెన్సీ ప్రాతిపదికగా నిర్ణయాలు […]

Update: 2021-06-05 08:14 GMT

ముంబై: కరోనా వైరస్ మొదటి, రెండో వేవ్‌లలో అత్యధిక కేసులు నమోదు చేసుకున్న మహారాష్ట్ర ప్రభుత్వం దేశంలో కొత్త తరహా అన్‌లాక్ ప్లాన్‌ను రూపొందించింది. లాక్‌డౌన్ ఆంక్షలే కాదు, అన్‌లాక్ వ్యూహంలోనూ తనదైన ముద్ర వేసుకున్నది. సెకండ్ వేవ్‌ను సమర్థంగా నియంత్రించగలిగిందన్న ప్రశంసలు అందుకున్న ఉద్ధవ్ ఠాక్రే సర్కారు శనివారం ఐదంచెల అన్‌లాక్ ప్లాన్ అనౌన్స్ చేసింది. రాష్ట్రవ్యాప్తంగా ఒకేరీతిలో ఆంక్షలు, సడలింపులు అమలు చేయకుండా, కరోనా పాజిటివిటీ రేటు, ఆక్సిజన్ బెడ్ల ఆక్యుపెన్సీ ప్రాతిపదికగా నిర్ణయాలు తీసుకునేలా ప్లాన్ వేసింది. జిల్లాలకు చెందిన పాజిటివిటీ రేటు, ఆక్సిజన్ బెడ్ల ఆక్యుపెన్సీ వివరాలను పబ్లిక్ హెల్త్ డిపార్ట్‌మెంట్ ప్రతి బుధవారం ప్రకటిస్తుంది.

ఈ వివరాలను పోల్చుతూ సరిపడే అన్‌లాక్ లెవెల్ ప్లాన్‌ను ఆయా జిల్లాల యంత్రాంగం అమలు చేయాలి. ముంబై, ముంబై సబర్బ్‌లలో బీఎంసీ ఈ నిర్ణయాలను తీసుకుంటుంది. ఈ ప్రణాళిక సోమవారం నుంచి అమల్లోకి రాబోతున్నది. లెవెల్‌ 5లో మినహాయింపులు స్వల్పంగా ఉండగా, లెవెల్ 1లో అధిక సడలింపులున్నాయి.

లెవెల్ 1: పాజిటివిటీ రేటు 5శాతం లోపు, ఆక్సిజన్ బెడ్ల ఆక్యుపెన్సీ 25శాతముంటే ఈ లెవెల్‌ను అమలు చేయాలి. ప్రస్తుతం ఈ లెవెల్‌లో అహ్మద్‌నగర్, ఔరంగాబాద్, చంద్రూపర్, దూలే, గోండియా, జల్గావ్, జాల్నా, లాతూర్, నాగ్‌పూర్, నాందేడ్, ఒస్మానాబాద్, యవత్మాల్‌లోకి వస్తున్నాయి. ఈ అంచెలో షాపులు, మాల్స్ లాక్‌డౌన్‌కు ముందటి సమయాల్లో తెరుచుకున్నట్టుగానే ఓపెన్ చేసుకోవచ్చు. రెస్టారెంట్లు, లోకల్ ట్రైన్లు, పార్కులు ఓపెన్ అవుతాయి. ప్రభుత్వ, ప్రైవేటు కార్యాలయాలు, క్రీడలు, షూటింగ్, పెళ్లిళ్లు, అంతిమ క్రియలు, సంఘాల సమావేశాలు, ఎన్నికలు, నిర్మాణపనులు, వ్యవసాయం, ఈ కామర్స్, జిమ్స్, సెలూన్స్, స్పా, బస్సులు, కార్గో, తయారీ పనులు లాంటివాటిపై ఆంక్షలుండవు.

లెవెల్ 2: పాజటివిటీ రేటు 5శాతం లోపే ఉండి, ఆక్సిజన్ బెడ్ల ఆక్యుపెన్సీ 25శాతం నుంచి 40శాతానికి మధ్యనున్న ఏరియాల్లో ఈ ప్లాన్ అమలు చేయాలి. హింగోలి, నందర్బార్‌లూ ఈ ప్లాన్‌కు అనుకూలంగా ఉన్నాయి. ఈ ప్లాన్‌లో క్లోజ్‌డ్ ప్లేసుల్లోనూ సామూహిక వేడుకలపై ఆంక్షలుంటాయి. అన్ని షాపులకు అనుమతి ఉండదు. రెస్టారెంట్, మాల్స్, థియేటర్లలో 50శాతం ఆక్యుపెన్సీకే పర్మిషన్ ఉంటుంది. అంతిమ క్రియలకు హాజరయ్యే వారిపై ఆంక్షలుండవు. కానీ, పెళ్లిళ్లు, ఎన్నికలకు సంబంధించి ఆంక్షలుంటాయి.

లెవెల్ 3: పాజిటివిటీ రేటు 5 నుంచి 10శాతం ఉండి, ఆక్సిజన్ బెడ్ల ఆక్యుపెన్సీ 40శాతానికి మించిన జిల్లాల్లు ఈ కేటగిరీలో పడతాయి. ప్రస్తుతం ముంబై, అకోలా, అమరావతి, బీడ్, పాల్ఘడ్‌లు ఈ లెవెల్‌లో ఉన్నాయి. ఈ అంచె ప్రకారం, సాయంత్రం 5 తర్వాత ప్రయాణాలు, కదలికలు ఉండద్దు. షాపులు సాయంత్రం 4గంటల వరకే, మాల్స్, థియేటర్లు, సింగిల్ స్క్రీన్‌లు మూసే ఉంటాయి. రెస్టారెంట్ కూడా 50శాతం కెపాసిటీతో సాయంత్రం 4 గంటలకు మూసేయాలి. అత్యవసరార్థులకే లోకల్ ట్రైన్‌ సేవలు, సామాజిక వేడుకలకు 50శాతం మందికే అనుమతి. అంతిమ క్రియలకు 20 మంది, పెళ్లిళ్లకు 50 మందినే అనుమతించాలి. ప్రభుత్వ కార్యాలయాల్లో 50శాతం మంది సిబ్బందికే అనుమతి.

లెవెల్ 4: పాజిటివిటీ రేటు 10 నుంచి 20శాతం ఉండి, ఆక్సిజన్ బెడ్ల ఆక్యుపెన్సీ 60శాతానికి మించితే ఈ అంచెలోని సడలింపులు అమలు చేయాలి. ప్రస్తుతం కొల్లాపూర్, సంతారా, సిందుదుర్గ్‌లు ఈ కేటగిరీలోకి వస్తు్న్నాయి. ఈ కేటగిరీ ప్రకారం, సాయంత్రం 5 గంటల తర్వాత ప్రయాణాలపై నిషేధంతోపాటు వీకెండ్‌లలోనూ ఈ ఆంక్షలుంటాయి. నిత్యావసర సరుకుల దుకాణాలే సాయంత్రం 4 గంటల వరకు తెరుచుకుని ఉంటాయి. మిగతావి మూసేయాలి. మాల్స్, థియేటర్లు, ఆడిటోరియంలు బంద్. రెస్టారెంట్లలో కేవలం టేక్ అవేలే ఉంటాయి. అత్యవసర సేవల విభాగాలకు చెందినవారికే లోకల్ ట్రైన్‌లోకి పర్మిషన్ ఉంటుంది. మినహాయింపులు ఇచ్చిన ప్రభుత్వ, ప్రైవేటు కార్యాలయాలు 25శాతం సిబ్బందితోనే సేవలందించాలి. ప్రభుత్వ రవాణాలోనూ 50శాతం కెపాసిటీకే పర్మిషన్ ఉంటుంది.

లెవెల్ 5: ఈ లెవెల్ పరిస్థితులు ఇప్పటి వరకు లేవు. అయినప్పటికీ థియరిటికల్‌గా లేదా భవిష్యత్‌ అవసరాలకు అనుగుణంగా ఈ లెవెల్ రూపొందించినట్టు తెలుస్తున్నది. పాజిటివిటీ రేటు 20శాతానికి మించి ఆక్సిజన్ బెడ్ల ఆక్యుపెన్సీ 75శాతాన్ని మించితే ఈ లెవెల్ నిబంధనలు అమలు చేయాలి. ప్రజలు బయట అడుగుపెట్టడానికి అనుమతి లేదు(అత్యవసరమైతే తప్పా). ఎస్సెన్షియల్ షాపులు సాయంత్రం 4 గంటల వరకు అనుమతి ఉంటుంది. షాపులు, థియేటర్లు, పార్కులు, మాల్స్, జిమ్స్, సెలూన్లు బంద్. రెస్టారెంట్‌లలో డెలివరీకి పర్మిషన్ ఉంటుంది. ప్రభుత్వ, ప్రైవేటు కార్యాలయాల్లో సిబ్బంది 15శాతానికి మించొద్దు. పెళ్లిళ్లలకు కుటుంబ సభ్యులే ఉండాలి. దహన సంస్కారాలకు 20 మందికి అనుమతి ఉంటుంది.

Tags:    

Similar News