కోటి రూపాయలు.. రెండు బస్తాల్లో దోచుకెళ్లారు

దిశ, క్రైమ్‌బ్యూరో: దొంగతనం చేయడం తొలిసారే.. అయినా కోటి రూపాయలకు పైగా కొల్లగొట్టారు. దోచిన డబ్బును ఏం చేయాలో తెలియక కొంత మాత్రమే పంచుకుని మిగతా సొమ్మును భద్రంగా దాచారు. ఇంతలోనే పోలీసులకు చిక్కడంతో కటకటాల పాలయ్యారు. గతంలో పనిచేసిన యాజమాని వేధింపులకు గురిచేసిన విషయాలను మనసులో పెట్టుకున్న యువకులు ఏకంగా కోటి రూపాయలకు పైగా అపహరించారు. గోల్కొండ పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటు చేసుకున్న ఈ ఘటనకు సంబంధించి సీపీ అంజనీకుమార్ సోమవారం వివరాలు వెల్లడించారు. టోలీచౌకి […]

Update: 2020-08-10 09:46 GMT

దిశ, క్రైమ్‌బ్యూరో: దొంగతనం చేయడం తొలిసారే.. అయినా కోటి రూపాయలకు పైగా కొల్లగొట్టారు. దోచిన డబ్బును ఏం చేయాలో తెలియక కొంత మాత్రమే పంచుకుని మిగతా సొమ్మును భద్రంగా దాచారు. ఇంతలోనే పోలీసులకు చిక్కడంతో కటకటాల పాలయ్యారు. గతంలో పనిచేసిన యాజమాని వేధింపులకు గురిచేసిన విషయాలను మనసులో పెట్టుకున్న యువకులు ఏకంగా కోటి రూపాయలకు పైగా అపహరించారు. గోల్కొండ పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటు చేసుకున్న ఈ ఘటనకు సంబంధించి సీపీ అంజనీకుమార్ సోమవారం వివరాలు వెల్లడించారు. టోలీచౌకి బాల్‌రెడ్డి‌నగర్‌కు చెందిన అసదుద్దీన్ అహ్మద్ రియల్ ఎస్టేట్ వ్యాపారి. ఇతనికి శామీర్‌పేటలో ఫాం హౌజ్ ఉంది. ఇతని వద్ద గతంలో టౌలీచౌకికి చెందిన మహ్మద్ అఫ్సర్ డ్రైవర్ గా, మిర్జా అశ్వక్ బేగ్ వర్కర్‌గా ఫాం హౌజ్‌లో పనిచేశారు. రియల్ ఎస్టేట్ లావాదేవీల ద్వారా వచ్చే సొమ్మును అసదుద్దీన్ అహ్మద్ శామీర్ పేట్ ఫాం హౌజ్ లో ఉంచేవాడు. రియల్ ఎస్టేట్ వ్యాపారం కావడతో తరుచూ కోట్ల రూపాయలు వస్తుండగా ఫాంహౌజ్‌లో భద్రపర్చేవాడు. అయితే, ఈ లావాదేవీలను డ్రైవర్ అఫ్సర్, మరో వర్కర్ అశ్వక్ బేగ్ లు నిరంతరం గమనించేవారు. పనిలో భాగంగా డ్రైవర్‌ను, వర్కర్‌ను యాజమాని అసదుద్దీన్ అహ్మద్ తరుచూ తిడుతూ.. పలు రకాల వేధింపులకు గురిచేసేవాడు. ఈ క్రమంలోనే పనులు సక్రమంగా చేయడం లేదనే సాకుతో వారిని పనిలోంచి తొలగించారు.

ఈ విషయాన్ని మనసులో పెట్టుకున్న మాజీ డ్రైవర్ అఫ్సర్, వర్కర్ అశ్వక్‌లు టోలిచౌకి ప్రాంతానికే చెందిన మరో ముగ్గురు స్నేహితుల సహకారంతో జూలై 22న రాత్రి శామీర్‌పేటలో ఫాంహౌస్ తాళం పగులగొట్టారు. ఇద్దరు మాత్రమే లోపలికి వెళ్లగా మరో ముగ్గురు బయట కాపలా ఉన్నారు. డబ్బు ఉండే చోటుపై అవగాహన ఉండడంతో ఉడెన్ అల్మారా నుంచి కోటి రూపాయలకు పైగా సొమ్మును బియ్యం బస్తాలో వేసుకుని బైక్‌లపై తీసుకెళ్లారు. ఈ సమయంలో ఎంత డబ్బు తీసుకెళ్లేరో కూడా వారికి తెలియదు. బైక్, సెల్‌ఫోన్‌ను మాత్రమే కొనుగోలు చేసి కొంత మొత్తాన్ని ఐదురుగు పంచుకున్నారు. మిగతా డబ్బును కొత్తగా కొనుగోలు చేసిన రెండు బ్యాగుల్లో దాచి, లాక్ వేసి రెహమాన్ బేగ్ (ఏ3) నివాసంలో దాచారు.

ఆలస్యంగా పరిశీలించిన యాజమాని అసదుద్దీన్ అహ్మద్ జూలై 27న గోల్కొండ పోలీసులకు సుమారు రూ.2.50 కోట్లు దొంగతనానికి గురైనట్టు ఫిర్యాదు చేశాడు. దర్యాప్తులో ప్రారంభించిన పోలీసులు సీసీ టీవీ ఫుటేజ్, ఫోన్ కాల్ రికార్డుల ఆధారంగా సోమవారం నిందితులను అరెస్టు చేశారు. రెండు బ్యాగుల్లో ఉంచిన రూ.1.29 కోట్ల డబ్బును స్వాధీనం చేసుకున్నారు. కేసు దర్యాప్తును త్వరితగతిన పూర్తి చేసిన గోల్కొండ ఇన్ స్పెక్టర్ చంద్రశేఖర్ రెడ్డి, ఎస్ఐ టి.రాజు, కానిస్టేబుల్ ఆర్జీ శివమారుతి‌లను సీపీ అంజనీకుమార్, డీసీపీ ఏఆర్ శ్రీనివాస్‌లు అభినందించారు.

Tags:    

Similar News