రైతులకు వ్యవ‘సాయం’ చేసే వారేరి..?
దిశ, తెలంగాణ బ్యూరో: వాతావరణంలో భారీ మార్పులు, విపత్కర పరిస్థితులు ఏర్పడినప్పుడు పంటలను ఏ విధంగా కాపాడుకోవాలనే అంశాలను రైతులకు సూచించడంలో ప్రభుత్వం విఫలమవుతోంది. రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి 5వేల క్లస్టర్లకు ఒక ఏఈఓను, 2,601 రైతువేదికలు, గ్రామాల నుంచి రాష్ట్ర స్థాయి వరకు రైతుసమన్వయ సభ్యులను నియమించినా సరైన సమయంలో రైతులను ఆదుకోవడానికి ఎలాంటి చర్యలు చేపట్టడం లేదు. దీంతో అవగాహన కొరవడిన అన్నదాతలు లక్షల ఎకరాల్లో పంట నష్టపోతున్నారు. అధిక వర్షాపాతంలో అందని సూచనలు […]
దిశ, తెలంగాణ బ్యూరో: వాతావరణంలో భారీ మార్పులు, విపత్కర పరిస్థితులు ఏర్పడినప్పుడు పంటలను ఏ విధంగా కాపాడుకోవాలనే అంశాలను రైతులకు సూచించడంలో ప్రభుత్వం విఫలమవుతోంది. రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి 5వేల క్లస్టర్లకు ఒక ఏఈఓను, 2,601 రైతువేదికలు, గ్రామాల నుంచి రాష్ట్ర స్థాయి వరకు రైతుసమన్వయ సభ్యులను నియమించినా సరైన సమయంలో రైతులను ఆదుకోవడానికి ఎలాంటి చర్యలు చేపట్టడం లేదు. దీంతో అవగాహన కొరవడిన అన్నదాతలు లక్షల ఎకరాల్లో పంట నష్టపోతున్నారు.
అధిక వర్షాపాతంలో అందని సూచనలు
ఈ ఏడాది సాధారణ వర్షాపాతం నమోదవుతుందని వాతావరణ శాఖ అధికారులు వేసిన అంచనాలు పూర్తిగా తలకిందులయ్యాయి. ఊహించని రీతిలో కురుస్తున్న భారీ వర్షాలు పంటలను తీవ్రంగా దెబ్బతీస్తున్నాయి. జూన్ 1 నుంచి ఇప్పటి వరకు సాధారణ వర్షాపాతం 333.6మిమీ ఉండగా 64శాతం అధికంగా 546.3మిమీ వర్షాపాతం నమోదైంది. ఇలాంటి విపత్కర పరిస్ధితుల్లో రైతులకు అవగాహనలు కల్పించాల్సిన వ్యవసాయ శాఖ అధికారులు ఆ దిశగా ఎలాంటి చర్యలు చేపట్టడంలేదు. పంటపొలాల్లో భారీగా నీరు చేరుకున్నప్పుడు పంటను బతికించేందుకు ఎలాంటి కార్యక్రమాలు చేపట్టాలి, ఎలాంటి మందులను వినియోగించాలనే అంశాలను ఎక్కడా కూడా ప్రకటించలేదు.
కేవలం వ్యవసాయ యూనివర్సిటీ అధ్యాపకులు మాత్రమే పంటలను ఏ విధంగా కాపాడుకోవాలనే ప్రకటనను విడుదల చేశారు. ఈ అంశాలను క్షేత్ర స్దాయిలో రైతులకు అందించడంలో కూడా వ్యవసాయ శాఖ అధికారులు విఫలమయ్యారు. రాష్ట్ర వ్యాప్తంగా కోటి 40లక్షల ఎకరాల్లో ఈ ఏడాది సాగు పనులు మొదలయ్యాయి. వీటిలో అత్యధికంగా పత్తి 80లక్షల ఎకరాలు, వరి 40లక్షల ఎకరాల్లో సాగు చేపట్టనున్నారని ప్రభుత్వం అంచనాలు వేసింది. ప్రస్తుతం కురుస్తున్న భారీ వర్షాలకు పత్తి, వరి పంటలు లక్షల ఎకరాల్లో దెబ్బతింటున్నా.. ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. పంటల సాగుకు ప్రోత్సహిస్తున్న ప్రభుత్వం ప్రమాదం వచ్చినప్పుడు గాలికి వదిలేస్తుందన్న విమర్శలు రైతుల నుంచి వస్తోంది.
పథకాల అమలుకే పరిమితమైన ఏఈఓలు
గతంలో ఎన్నడూలేని విధంగా ప్రభుత్వం ఏఈఓల నియమాకం చేపట్టింది. ప్రతి 5వేల ఎకరాలను ఒక క్లస్టర్‌గా విభజించి ఒక్కో క్లస్టర్‌కు ఒక ఏఈఓ చొప్పున దాదాపుగా 2,600 మంది ఏఈఓలను నియమించింది. గ్రామ స్థాయిలో రైతులకు అందుబాటుల ఉంటున్న ఏఈఓలు కేవలం రైతుబంధు, రైతుబీమా పథకాలను అమల చేసేందుకు మాత్రమే పరిమితమవుతున్నారు. ఈ రెండు కార్యక్రమాలకు సంబంధించిన ఆదేశాలు మాత్రమే ప్రభుత్వం నుంచి వెలువడటంతో వాటినే ఆచరిస్తున్నారు.
పంటల్లో వినియోగించే నూతన మెలకువలు, మందులు, ఎరువుల వినియోగం, అధిక వర్షాలు వస్తే పంటలను ఏవిధంగా కాపాడుకోవాలనే అంశాలకు సంబంధించి అవగాహన కల్పించేందుకు ఉన్నతాధికారుల నుంచి ఎలాంటి ఆదేశాలు వెలువడకపోవడటం లేదు. దీంతో ఏఈఓలు పరిమితులకు లోబడి పనిచేయాల్సి వస్తోంది.
నిరుపయోగంగా రైతువేదికలు
ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేసిన రైతు వేదికలు ఫలితాలను ఇవ్వలేకపోతున్నాయి. నిర్మాణం చేపట్టి నెలలు గడుస్తున్నా ఎలాంటి కార్యక్రమాలు చేపట్టకపోవడంతో నిరుపయోగంగా మిగిలిపోతున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా రూ.572 కోట్లతో 2,601 రైతు వేదికలు నిర్మాణాలు చేపట్టారు. వీటిని వినియోగించేందుకు ఎలాంటి సదుపాయాలు కల్పించక పోవడం, రైతువేదికల నిర్వహణ బాధ్యతలు ఏఈఓలకు పూర్తిస్థాయిలో అప్పగించకపోవడంతో ఉత్సవ విగ్రహాల్లా మారాయి. దీంతో గ్రామాల్లో రైతులు సమావేశాలను ఏర్పాటు చేసుకోవాలంటే పంచాయితీ కార్యాలయాల్లో, రచ్చకట్టల దగ్గర, చెట్ల కింద నిర్వహించుకునే పరిస్థితులు ఇంకా కొనసాగుతున్నాయి.
అడ్రస్ లేని రైతుసమన్వయ సమితి సభ్యులు
రైతులను సంఘటితం చేసేందుకు, చైతన్య పరిచేందుకు అప్పటి వరకు ఉన్న రైతుసంఘాలకు ప్రత్యామ్నాయంగా టీఆర్ఎస్ ప్రభుత్వం రైతు సమన్వయ సమితులను ఏర్పాటు చేశారు. రైతుసమన్వయ సమితి రాష్ట్ర అధ్యక్షుడిగా ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డిని నియమించిన ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 1,61,000 మంది రైతులను సభ్యులుగా చేర్చించింది. గ్రామ స్థాయిలో 15 మంది, మండలస్థాయిలో 24 మంది, జిల్లా స్థాయిలో 24 మందిని, రాష్ట్ర స్థాయిలో 42 మందిని నియమించారు. వీరితో పాటు శాస్త్రవేత్తలను, వ్యవసాయాధికారులను, వ్యవసాయ నిపుణులను కూడా ముఖ్య సభ్యులుగా చేర్చారు. 592 మండలాలకు మండలాధ్యక్షులు, హైదరాబాద్ మినహా 32 జిల్లాలకు జిల్లాధ్యక్షులను కూడా నియమించారు.
రైతుల అభ్యున్నతి కోసం ఏర్పాటు చేసిన రైతుసమన్వయ సమితిలు ఆరంభ శూరత్వంగానే మిగిలిపోయాయి. రైతులు ఎదురవుతున్న సమస్యలను పరిష్కరించడంలో వాటిని ప్రభుత్వం దృష్టికి తీసుకుపోవడంలో పూర్తిగా విఫలమయ్యాయి. విత్తనాలు నాటే సమయం నుంచి పంటలకు మద్దతు ధర కల్పించే వరకు చురుకైన పాత్ర పోషించాల్సి ఉంటుంది. కీలక బాధ్యతలు ఉన్న రైతు సమన్వయ సమితి రైతులకు ఏ మాత్రం ఉపయోగపడటం లేదన్నది బహిరంగ రహస్యమే.