మృత్యుపాశాలు.. కరెంట్ షాక్‌తో ప్రాణాలు కోల్పోతున్న రైతులు

దిశ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ వ్యాప్తంగా విద్యుదాఘాతంతో ప్రాణాలు కోల్పోతున్న వారి సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. వానాకాలం వచ్చిందంటే చాలు ఈ సంఖ్య మరింత ఎక్కువవుతోంది. ఈ ఏడాది జనవరి నంచి జూన్ వరకు సుమారు వంద మందికిపైగా కరెంట్ షాక్ తో మరణించినట్లు తెలుస్తోంది. బావుల వద్ద చిన్న చిన్న మరమ్మతులు చేపడుతూ విద్యుత్ తీగలకు తగిలి మహబూబాబాద్ జిల్లా తొర్రూరు డివిజన్ కు చెందిన ఇద్దరు రైతులు ఇటీవల ప్రాణాలు కోల్పోయారు. అలాగే ఇంటి […]

Update: 2021-07-11 20:01 GMT

దిశ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ వ్యాప్తంగా విద్యుదాఘాతంతో ప్రాణాలు కోల్పోతున్న వారి సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. వానాకాలం వచ్చిందంటే చాలు ఈ సంఖ్య మరింత ఎక్కువవుతోంది. ఈ ఏడాది జనవరి నంచి జూన్ వరకు సుమారు వంద మందికిపైగా కరెంట్ షాక్ తో మరణించినట్లు తెలుస్తోంది. బావుల వద్ద చిన్న చిన్న మరమ్మతులు చేపడుతూ విద్యుత్ తీగలకు తగిలి మహబూబాబాద్ జిల్లా తొర్రూరు డివిజన్ కు చెందిన ఇద్దరు రైతులు ఇటీవల ప్రాణాలు కోల్పోయారు. అలాగే ఇంటి వద్ద దుస్తులు ఆరేస్తూ మృత్యువాత పడిన ఘటనలు సైతం కోకోల్లలుగా ఉన్నాయి. 2014 నుంచి ఈ ఏడాది జూన్ వరకు చూసుకుంటే అత్యధికంగా 681 మరణాలు 2019-20 సంవత్సరంలో సంభవించాయి. గతేడాది మొత్తంగా 83 మరణాలు సంభవించగా.. ఈ ఏడాది జనవరి నుంచి జూన్ వరకు వంద మందికి పైగా కరెంట్ షాక్ తో ప్రాణాలు కోల్పోయారు.

రక్షణ చర్యలు కరువు

రాష్ట్ర ప్రభుత్వం, విద్యుత్ అధికారులు పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి పేరిట ప్రతి ఏటా మరమ్మతులు చేపడుతున్నారు. అయినా రక్షణ చర్యలు కరువయ్యాయి. పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి లాంటి కార్యక్రమాలు చేపట్టినా ప్రమాదాల నివారణ శూన్యం. ఈ పనుల్లో అధికారులు నిర్లక్ష్యం వహించడంతోనే ఇలాంటి ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయని పలువురు వాపోతున్నారు. పల్లె, పట్టణ ప్రగతిలో వంగిపోయి, విరిగిపోయిన విద్యుత్ స్తంభాల స్థానంలో కొత్తవి ఏర్పాటు చేయాల్సి ఉంది. కొత్త లైన్ల ద్వారా మెరుగైన చర్యలు చేపట్టాల్సిన శాఖ నిర్లక్ష్యం వహిస్తోందంటున్నారు సామాన్యులు. తూతూ మంత్రంగా పనులు చేపట్టడం వల్లనే ఇలాంటి ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయని చెబుతున్నారు.

ఏమరుపాటుగా ఉంటే అంతే..

స్వీయ రక్షణ చర్యలు పాటించాల్సిన రైతులు, ప్రజలు.. ఏమరుపాటుగా ఉండటంతో ప్రాణాలు కోల్పోతున్నారు. ఇంట్లో దుస్తులు ఆరబెట్టేందుకు ఇనుప తీగలు అస్సలే వినియోగించకూడదు. అవి వాడటం వల్ల వానాకాలంలో గోడలు తడిచిపోయి విద్యుత్ తీగలు తగిలితే కరెంట్ సరఫరా జరిగి షాక్ తగిలే ప్రమాదం ఎక్కువగా ఉంది. బలమైన గాలులతో కూడిన వానలు పడినప్పుడు మరింత అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇదిలా ఉండగా బావుల వద్ద కూడా ట్రాన్స్ ఫార్మర్లకు ఆనుకుని పశువులను కట్టేయడం ద్వారా ప్రమాదాలు జరిగే అవకాశాలున్నాయి. పశువులు మేతకు వెళ్లి విద్యుదాఘాతంతో మృత్యువాతపడిన ఘటనలు అనేకమున్నాయి. ఎన్పీడీసీఎల్ పరిధిలో ఈ ఏడాది జనవరి నుంచి జూన్ వరకు 230కి పైగా పశువులు మృత్యువాతపడినట్లు అధికారులు చెబుతున్నారు. కొన్ని జాగ్రత్తచర్యలు పాటించడం వల్ల ఈ ప్రమాదాలబారి నుంచి తప్పించుకోవచ్చని విద్యుత్ అధికారులు చెబుతున్నారు.

ప్రమాదాలకు కారణాలివే..

వానాకాలంలో భీకర గాలులకు విత్యుత్, సర్వీస్ వైర్లు తెగిపోయి ప్రమాదాలు ఎక్కువగా చోటుచేసుకుంటున్నాయి. విద్యుత్ అధికారులు పలు ప్రాంతాల్లో బావుల వద్ద స్తంభాలు వేయకపోవడంతో రైతులు తీగలు కిందికి రాకుండా ఉండేందుకు కర్రలను ఊతంగా పెడుతున్నారు. గాలివానకు కర్రలు వంగిపోవంతో తీగలు నేలను తాకుతున్నాయి. అది చూసుకోని రైతులు, మేతకు వచ్చే పశువులు ప్రమాదవశాత్తు ఆ తీగలకు తగిలి మృత్యువాతపడుతున్నారు. విద్యుత్‌లైన్ల కింద ఇండ్లు, పశువుల షెడ్ల నిర్మాణాలు చేపట్టకూడదు. దీనివల్ల వర్షానికి వైర్లు తెగి వాటి మీద పడటం ద్వారా కూడా కరెంట్ షాక్ తగిలే అవకాశాలున్నాయి. సాధారణంగా తీగలు తెగిపడిన సమయంలో పరిసరాల్లో ఫ్యూజు కట్‌ కావాలి. కానీ తరచూ అంతరాయాలు ఏర్పడుతున్నాయంటూ అధిక సామర్థ్యం గల ఫ్యూజులనే వినియోగించడంతో విద్యుత్‌ సరఫరా యథావిధిగా కొనసాగుతోంది. కాలం చెల్లిన విద్యుత్‌ స్తంభాల స్థానంలో కొత్తవి ఏర్పాటు చేయకపోవడం వల్ల కూడా వానాకాలంలో ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి. ఏటా వర్షాకాలానికి ముందే చర్యలు తీసుకోవాల్సిన విద్యుత్ శాఖ నిర్వహణ పనులను నిర్లక్ష్యంగా వదిలేయడం వల్ల మరిన్ని ఇబ్బందులు తలెత్తుతున్నాయి.

స్వీయరక్షణ పాటించాల్సిందే..

వానాకాలంలో స్వీయ రక్షణ చర్యలు అందరూ పాటించాల్సిందే. లేదంటే ప్రాణాలు కోల్పోయే శాతం మరింత ఎక్కువ. వర్షాకాలంలో వీచే గాలులకు విద్యుత్ వైర్లు తెగిపోయి పొలాల్లో వేలాడటం కారణంగా, స్టార్టర్ల వద్ద తడి చేతులతో ఫ్యూజులు పెట్టడం లాంటివి చేయడం వల్ల ప్రమాద అవకాశాలు పెరిగే శాతం చాలా ఎక్కువగా ఉంటుంది. అంతేకాకుండా వాన కారణంగా పొలం చిత్తడిగా మారడంతో పాటు విద్యుత్ తీగలు తెగిపడటం వల్ల పశువులు కూడా మృత్యువాత పడే అవకాశాలు చాలా ఎక్కువ. రైతులు అప్రమత్తంగా ఉండటమే కాకుండా ఈ వర్షాకాలంలో పశువులను ఇష్టారాజ్యంగా మేతకు వదిలేయకుండా ఉండటమే మేలు. దీనికి తోడు విద్యుత్ స్తంభాలకు పశువులను కట్టేయడం ఏమాత్రం శ్రేయస్కరం కాదు. బావుల వద్ద ఐఎస్‌ఐ మార్క్ ఉన్న మోటార్లు, స్టార్టర్లను వినియోగించితే మంచిది. వాటి ఎర్తింగ్‌ సరిగా ఉండేటట్టు చూసుకోవటం కూడా ముఖ్యమే. సేఫ్టీ కిట్ లేకుండా రైతులే సొంతంగా రిపేర్లు చేయకపోవడం ఉత్తమం.

సంవత్సరం మృతుల సంఖ్య

2014-15 210
2015-16 399
2016-17 489
2017-18 537
2018-19 591
2019-20 681
2020-21 83
2021 జనవరి నుంచి జూన్ వరకు 100 కు పైగా

Tags:    

Similar News