ఏ పంటలేద్దాం.. అదును మీదికొచ్చింది

దిశ, న్యూస్ బ్యూరో: వ్యవసాయ రంగంలో క్లిష్టమైన సందిగ్ధ పరిస్థితి నెలకొంది. గతంలో వర్షాలు, విత్తనాలు, ఎరువుల కోసం ఎదురుచూసిన రైతులు ఇప్పుడు ప్రభుత్వ ప్రకటన కోసం వేచి చూడాల్సి వస్తుంది. నియంత్రిత సాగు విధానం ఈ వానాకాలం నుంచే అమలులోకి వస్తున్నట్టు సీఎం కేసీఆర్ ప్రకటించారు. ప్రభుత్వం చెప్పిన పంటలు వేస్తేనే రైతుబంధు వర్తిస్తుందని షరతు విధించారు. ఇతర పంటలు వేస్తే రైతుబంధు ఇవ్వబోమని కరాఖండీగా చెప్పేశారు. కానీ, ఇంతవరకూ క్షేత్రస్థాయిలో మాత్రం అడుగు ముందుకు […]

Update: 2020-06-11 22:39 GMT

దిశ, న్యూస్ బ్యూరో: వ్యవసాయ రంగంలో క్లిష్టమైన సందిగ్ధ పరిస్థితి నెలకొంది. గతంలో వర్షాలు, విత్తనాలు, ఎరువుల కోసం ఎదురుచూసిన రైతులు ఇప్పుడు ప్రభుత్వ ప్రకటన కోసం వేచి చూడాల్సి వస్తుంది. నియంత్రిత సాగు విధానం ఈ వానాకాలం నుంచే అమలులోకి వస్తున్నట్టు సీఎం కేసీఆర్ ప్రకటించారు. ప్రభుత్వం చెప్పిన పంటలు వేస్తేనే రైతుబంధు వర్తిస్తుందని షరతు విధించారు. ఇతర పంటలు వేస్తే రైతుబంధు ఇవ్వబోమని కరాఖండీగా చెప్పేశారు. కానీ, ఇంతవరకూ క్షేత్రస్థాయిలో మాత్రం అడుగు ముందుకు పడలేదు. రైతుల వివరాలు, పట్టాదారు పాసుపుస్తకాల పరిశీలనల్లోనే వ్యవసాయ శాఖ అధికారులు నిమగ్నమయ్యారు. గ్రామాల వారీగా వేయాల్సిన పంటలపై రైతులకు చెప్పలేకపోతున్నారు. ఈసారి త్వరగానే రుతుపవనాలు రావడంతో వర్షాలు మొదలయ్యాయి. సాగు పనులు దాదాపు మొదలయ్యాయి. కానీ, వేయాల్సిన పంటలపైనే స్పష్టత లేకుండా పోయింది. మరోవైపు విత్తనాల కొనుగోళ్లు మొదలయ్యాయి. గ్రామాల్లో సహకార సంఘాల ద్వారా విత్తనాలు, ఎరువుల ధరలను ప్రకటించారు.

మొదలైన ఎవుసం పనులు..

రాష్ట్రంలో తొలకరి రాకతో ఎవుసం పనులు మొదలయ్యాయని వ్యవసాయ శాఖ పేర్కొంది. గురువారం నుంచి రైతులు పూజలు చేసి పత్తి విత్తనాలు వేయడం మొదలుపెట్టారని వెల్లడించింది. మూడ్రోజుల నుంచి వాతావరణం మారి వర్షాలు కురుస్తుండటంతో సాగు పనులు ఊపందుకున్నాయి. చాలా ప్రాంతాల్లో రైతులు నారు మడులు సైతం సిద్ధం చేసుకున్నారు. ఈసారి వర్షాలు ఆశాజనకంగా ఉంటాయని వాతావరణ కేంద్రం ప్రకటించింది. నియంత్రిత సాగులో భాగంగా క్లస్టర్లుగా గుర్తించి సాగుచేసే పంటల వివరాలను ప్రకటిస్తారని ప్రభుత్వం ప్రకటించింది. ఇప్పటివరకు జిల్లాల వారీగా సాగు చేసే పంటలు ప్రాథమికంగా ఖరారయ్యాయి. జిల్లాలవారీగా ఖరారు చేసిన పంటల సాగు వివరాలను గ్రామ స్థాయిలో ఇంకా స్పష్టం చేయలేదు. రాష్ట్రంలో ఈ వానాకాలం మొత్తం 1.25 కోట్ల ఎకరాల్లో పంటలు సాగు చేసేందుకు ప్రణాళిక రెడీ అయింది. దీనిలో 60 లక్షల ఎకరాల్లో పత్తి, 41 లక్షల ఎకరాల్లో వరి, 15 లక్షల ఎకరాల్లో కంది సాగు చేయాల్సి ఉన్నట్టు అధికారులు నివేదికల్లో పేర్కొన్నారు. అపరాలు, కూరగాయలు మొత్తం కలుపుకుని 1.25 కోట్ల ఎకరాల్లో సాగు చేస్తారని వెల్లడించారు. వరి సాగులో 60 శాతం దొడ్డు రకాలు, 40 శాతం సన్నరకాలు వేయాలని ప్రభుత్వం సూచిస్తోంది. ప్రభుత్వం చెప్పిన నిష్పత్తి ప్రకారం సన్న రకాలు 25 లక్షల ఎకరాల్లో ఉండగా ఇందులో తెలంగాణ సోనా (ఆర్ఎన్ఆర్-15048) సాగు చేయించాలని సీఎం కేసీఆర్ వ్యవసాయ శాఖకు సూచించారు.

ఎక్కడ… ఏ ఏ పంటలు..?

ఇప్పటికే వర్షాలు మొదలుకావడంతో రైతులు సాగు పనుల్లో నిమగ్నమయ్యారు. ప్రధానంగా దొడ్డురకం, సన్నాలు సాగు చేసే రైతుల్లో అనిశ్చతి నెలకొంది. దాదాపు ఎకరం, రెండెకరాలు ఉన్న రైతులు ఎక్కువగా ఉన్నారు. అయితే, వీరు ఎంత మేరకు దొడ్డు రకం, సన్నరకం వేయాలనే లెక్కలు తేలడం లేదు. వ్యవసాయ శాఖ కూడా గ్రామస్థాయిలో రైతులకు సూచించడం లేదు. గతంలో మాదిరిగానే వరిసాగు చేసుకుంటే నియంత్రిత సాగు విధానం సాకుతో రైతుబంధు ఇస్తారా… లేదా అనేది సందేహంగా మారింది. కొంతమంది రైతులు వ్యవసాయాశాఖ అధికారులను అడుగుతున్నారు. వారి నుంచి స్పష్టమైన సమాధానం రావడం లేదు. నియంత్రిత సాగు విధానంలో పంటలు వేద్దామనుకున్నా ఇప్పుడు ఏ పంటలు వేయాలనే ప్రశ్న నెలకొంది.

తెలంగాణ సోన (ఆర్ఎన్ఆర్) ధర రూ. 775

ప్రభుత్వం ఎక్కువ ప్రచారం చేస్తున్న తెలంగాణ సోన విత్తనాలను రాష్ట్రంలోని అన్ని సహకార సంఘాల నుంచి అందుబాటులోకి తీసుకొచ్చింది. తెలంగాణ సోన (ఆర్ఎన్ఆర్ 25 కిలోల బస్తాకు రూ. 775 ధరను నిర్ధారించారు. అదే విధంగా బీపీటీ 25 కిలోలకు రూ. 775 ఉండగా 1010 రకం 30 కిలోల బస్తాకు రూ. 840, జై శ్రీరాం (కావేరి చింటూ ఒక్క పొస) 10 కిలోలకు రూ. 950, బీపీటీ (కావేరీ ప్రైజ్ ఒక్క పొస) 10 కిలోల బస్తాకు రూ. 950 చొప్పున ధరలతో సహకార సంఘాల్లో విక్రయిస్తున్నారు. కావేరి సీడ్స్ పత్తి విత్తనాలు అందుబాటులో పెట్టారు. కావేరి సీడ్స్‌కు సంబంధించి ఏటీఎం బీజీ-2 రూ. 700, జాదు బీజీ-2 రూ. 700, మనీమేకర్ బీజీ-2 రూ. 700, హైబ్రీడ్ 111 బీజీ-2 రూ. 700తో విక్రయిస్తున్నారు. కందులు 4 కిలోల విత్తనాలకు రూ. 340, పెసర్లు 4 కిలోలకు రూ. 430 చొప్పున అమ్ముతున్నారు. అదేవిధంగా నాగార్జున, ఇఫ్కో, క్రిబ్‌కో యూరియా బస్తా రూ. 270 ఉండగా, 20:20:0:13 ధర రూ. 970, డీఏపీ ధర రూ. 1180తో విక్రయిస్తున్నారు.

Tags:    

Similar News