సాయంత్రం తగ్గిన కరోనా.. ఉదయాన్నే కళ్లు తెరవని రోగి
దిశ, నర్సంపేట : కరోనా లక్షణాలతో తన వద్దకు వచ్చిన రోగికి చికిత్స అందించిన వైద్యుడు నయమైందన్నాడు. కానీ ఉదయం లేచి చూసే సరికి అతడు విగతజీవిగా మారాడు. అనుమతి లేకుండా కరోనా చికిత్స చేయడమే కాకుండా ఓ కుటుంబానికి పెద్ద దిక్కును దూరం చేసిన ఘటన నర్సంపేట పట్టణంలోని పాకాల సెంటర్ ఎల్‌ఎన్ ఆస్పత్రిలో సోమవారం ఆలస్యంగా వెలుగుచూసింది. చికిత్సకు ముందే ఫీజు మొత్తం కట్టించుకున్నట్టు సమాచారం. దీంతో బాధిత కుటుంబ సభ్యులు, బంధువులు నర్సంపేటలోని […]
దిశ, నర్సంపేట : కరోనా లక్షణాలతో తన వద్దకు వచ్చిన రోగికి చికిత్స అందించిన వైద్యుడు నయమైందన్నాడు. కానీ ఉదయం లేచి చూసే సరికి అతడు విగతజీవిగా మారాడు. అనుమతి లేకుండా కరోనా చికిత్స చేయడమే కాకుండా ఓ కుటుంబానికి పెద్ద దిక్కును దూరం చేసిన ఘటన నర్సంపేట పట్టణంలోని పాకాల సెంటర్ ఎల్‌ఎన్ ఆస్పత్రిలో సోమవారం ఆలస్యంగా వెలుగుచూసింది. చికిత్సకు ముందే ఫీజు మొత్తం కట్టించుకున్నట్టు సమాచారం. దీంతో బాధిత కుటుంబ సభ్యులు, బంధువులు నర్సంపేటలోని ఎల్ ఎన్ ఆస్పత్రి ఎదుట ఆందోళనకు దిగారు.
వివరాల్లోకివెళితే.. చెన్నారావుపేట మండలానికి చెందిన ముద్దునూర్ అశోక్ (40) అనే వ్యక్తి ఎలక్ట్రిషియన్ పని చేసేవాడు. ఈ నెల 4న శ్వాస సంబంధిత సమస్యతో ఎల్‌ఎన్ ఆస్పత్రిలో చేరాడు. అతన్ని పరీక్షించిన డాక్టర్ మార్త రాజు వెంటనే అడ్మిట్ కావాలని, నాలుగు రోజుల్లో కరోనా తగ్గిపోయేలా చికిత్స అందిస్తానని నమ్మబలికాడు. నాలుగు రోజుల పాటు రోజుకు రూ.30 వేల బిల్లు, మెడిసిన్ ఖర్చులు దీనికి అదనంగా కట్టించుకున్నాడు. ఆదివారం సాయంత్రం దాదాపుగా తగ్గిపోయిందని శ్వాస సమస్య లేదని కుటుంబీకులను నమ్మించాడు. సోమవారం ఉదయం అశోక్ పరిస్థితి అకస్మాత్తుగా విషమిస్తోందని ఆస్పత్రి సిబ్బందే ఓ అంబులెన్స్‌లో వరంగల్‌లోని రోహిణి ఆస్పత్రికి తరలించారు. వెళ్లిన కొద్ది సేపటికే పరిస్థితి విషమించి అశోక్ మృతి చెందాడు.
ఆస్పత్రి ఎదుట ఆందోళన..
నర్సంపేట పట్టణంలోని పాకాల సెంటర్‌లో గల ఎల్‌ఎన్ ఆస్పత్రి ఎదుట బాధిత కుటుంబ సభ్యులు, మృతుడి బంధువులు ఆందోళన చేపట్టారు. డాక్టర్ నిర్లక్ష్యం కారణంగానే అశోక్ మృతి చెందాడని ఆరోపిస్తూ ఆస్పత్రి సిబ్బందితో వాగ్వివాదానికి దిగారు.
రెండ్రోజుల ముందే నోటీసులు..
కరోనా చికిత్స చేయడానికి అనుమతి తప్పనిసరి. నర్సంపేట పట్టణంలో అనుమతి లేకుండానే కరోనా చికిత్స చేస్తున్నారన్న సమాచారంతో రెండు రోజుల కిందటే ఆస్పత్రిని జిల్లా వైద్య అధికారులు పరిశీలించారు. కరోనా చికిత్స చేస్తే కఠిన చర్యలు చేపడతామని హెచ్చరించినట్లు సమాచారం. డబ్బుల కోసం అనుమతి లేకున్నా చికిత్స చేస్తూ ప్రజల ప్రాణాలు తీస్తున్న ఆస్పత్రిపై కఠిన చర్యలు తీసుకోవాలని బాధిత కుటుంబం డిమాండ్ చేస్తున్నారు.