నకిలీ ఏజెన్సీలతో జర భద్రం..
గల్ఫ్, ఇతర ప్రాంతాలకు ఉపాధి నిమిత్తం వెళ్లాలనుకునేవారు నకిలీ ఏజెంట్లు, ఏజెన్సీలతో జాగ్రత్త వహించాలని విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ (ఎంఈఏ) హెచ్చరించింది. రెండు తెలుగు రాష్ట్రాల్లో 29 నకిలీ ఏజెన్సీలు ఈ తరహా కార్యకలాపాలు కొనసాగిస్తున్నాయని తెలిపింది. అంతేకాక మహారాష్ట్ర, పంజాబ్ రాష్ట్రాలు ఒక్కోటి 86 నకిలీ ఏజెన్సీలతో ఈ జాబితాలో అగ్రస్థానంలో ఉండగా.. ఢిల్లీలో 85 ఉన్నట్టు గుర్తించారు. ఎంఈఏ వద్ద నమోదై, […]
గల్ఫ్, ఇతర ప్రాంతాలకు ఉపాధి నిమిత్తం వెళ్లాలనుకునేవారు నకిలీ ఏజెంట్లు, ఏజెన్సీలతో జాగ్రత్త వహించాలని విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ (ఎంఈఏ) హెచ్చరించింది. రెండు తెలుగు రాష్ట్రాల్లో 29 నకిలీ ఏజెన్సీలు ఈ తరహా కార్యకలాపాలు కొనసాగిస్తున్నాయని తెలిపింది. అంతేకాక మహారాష్ట్ర, పంజాబ్ రాష్ట్రాలు ఒక్కోటి 86 నకిలీ ఏజెన్సీలతో ఈ జాబితాలో అగ్రస్థానంలో ఉండగా.. ఢిల్లీలో 85 ఉన్నట్టు గుర్తించారు.
ఎంఈఏ వద్ద నమోదై, లైసెన్స్ కలిగిన వందల నియామక ఏజెన్సీలు, గత మూడేండ్లుగా ఉపాధి నిమిత్తం ఒక్కరిని కూడా విదేశాలకు పంపించలేదని ఎంఈఏ నిర్ధారించింది. అమాయక ప్రజలను గల్ఫ్ దేశాలకు పంపిస్తామని నమ్మించి ఇటువంటి మోసాలకు పాల్పడుతున్నారనే విషయం ఎంఈఏ గణాంకాలతో స్పష్టమవుతోందని ఎమిగ్రేంట్స్ వెల్ఫేర్ ఫోరమ్ అధ్యక్షుడు ఎం భీమ్ రెడ్డి టీఓఐతో తెలిపారు. ఈ విషయాలన్నీ ఆర్టీఐ ద్వారా ఎంఈఏ నుంచి పొందినట్టు వెల్లడించారు.
గల్ఫ్‌లో దిగాక వర్క్ పర్మిట్ ఇస్తామనే హామీతో వర్కర్లను విజిట్ వీసాపై గల్ఫ్ దేశాలకు పంపిస్తారు. కొన్నిసార్లు అక్కడికి వెళ్లినవారికి పని దొరికినా జీతాలు రావు. వర్క పర్మిట్ కూడా లభించదు. దీంతో అక్రమంగా ఉండాల్సిన పరిస్థితి నెలకొంటుంది. ఇలా ట్రావెల్ ఏజెంట్లు ఒక్కొక్కరి దగ్గరి నుంచి రూ.1.5 లక్షల నుంచి రూ.4 లక్షల వరకు వసూలు చేసి గల్ఫ్ దేశాలకు పంపిస్తుంటారు. తీరా అక్కడికెళ్లాక అతి తక్కువ జీతాలతో కష్టమైన పనులు చేయలేక మానేస్తుంటారు.
2017లో 320 మంది, మరుసటి ఏడాది 402 మంది, 2019లోనూ 414 మంది ఏజెంట్లు ఒక్కరికి కూడా విదేశాల్లో పని కల్పించలేదు. ఈ ఏజెన్సీలన్నీ ఎంఈఏ ఈమైగ్రేట్ విధానంలో నమోదై, విదేశాల్లో పని కల్పించేందుకు ఎంఈఏ నిబంధనలు పాటించాల్సి ఉంటుంది. కానీ అక్రమ ఏజెంట్లు తప్పుడు సమాచారాన్నిస్తూ..తమ సొంత పద్ధతుల్లో ఇలాంటి చర్యలకు పాల్పడుతున్నారు.
15 రోజుల కిందట ఇదే తరహా హామీతో తెలంగాణ నుంచి దుబాయ్‌కు వెళ్లిన ఏడుగురు యువకుల్లో.. ఒక యువకుడు ‘ఏ పనీ లేకుండా ఇక్కడ చిక్కుకుపోయాం’ అంటూ దుబాయ్ నుంచి టీవోఐకి తెలిపాడు. తలా రూ. 1.5 లక్షల నుంచి రూ. 3 లక్షల వరకు ఏజెంట్‌కు ముట్టజెప్పామని, ప్రస్తుతం సదరు ఏజెంట్ తమ ఫోన్లు తీయడం లేదని వాపోయాడు.
వారంతా ప్రస్తుతం భారత్‌కు తిరిగిరాడం కూడా కష్టతరం అవుతుంది. గల్ఫ్ దేశాల్లో దిగగానే అక్కడి లోకల్ ఏజెంట్ లేదా కంపెనీ యజమాని వారి పాస్‌పోర్టులను స్వాధీనం చేసుకుని తమ ఆధీనంలో ఉంచుకుంటారు. మహిళలకు బ్యూటీపార్లలో పని కల్పిస్తామని పంపించి, అక్కడికెళ్లాక బలవంతంగా ఇండ్లల్లో పనులు చేయస్తారు. ఇదే తరహాలో మోసపోయి మస్కట్‌లో చిక్కుకుపోయిన నిజామాబాద్‌కు చెందిన ఇద్దరు అక్కాచెల్లెళ్లను ఇటీవలే అక్కడి నుంచి కాపాడారు. కాగా వారికి నెలకు రూ.25 వేల జీతం ఇప్పిస్తామని నమ్మించి ట్రావెల్ ఏజెన్సీ ద్వారా ఒమన్‌కు పంపించారని అంజద్ ఉల్లా ఖాన్ అనే ఎంబీటీ నాయకుడు, సామాజిక ఉద్యమకారుడు వెల్లడించాడు.