సైబర్ క్రిమినల్స్ న్యూ టార్గెట్

దిశ, వెబ్ డెస్క్: కరోనా విజృంభిస్తున్న ప్రస్తుత తరుణంలో హాస్పిటళ్లన్నీ కరోనా బాధితులతో నిండిపోతున్నాయి. కరోనా లక్షణాలు తక్కువగా ఉంటే ఇంట్లోనే సెల్ఫ్ ఐసొలేషన్‌లో ఉండాలని వైద్యులు సూచిస్తున్నారు. ఒకవేళ ఏదైనా ఎమర్జెన్సీ అవసరమైనా, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఎదురైనా వెంటనే ఆస్పత్రికి రావాలని వైద్యులు సూచిస్తున్నారు. అయితే, కొవిడ్ బారిన పడిన రోగుల్లో ఎక్కువ మంది శ్వాస సంబంధిత స‌మస్య‌ల‌తో మ‌ర‌ణిస్తున్నారు. దీంతో ఇన్ఫెక్ష‌న్ తీవ్ర‌మైన రోగుల‌కు వెంటిలేట‌ర్ ద్వారా కృత్రిమ శ్వాస అందిస్తున్నారు. అయితే […]

Update: 2020-07-29 04:03 GMT

దిశ, వెబ్ డెస్క్: కరోనా విజృంభిస్తున్న ప్రస్తుత తరుణంలో హాస్పిటళ్లన్నీ కరోనా బాధితులతో నిండిపోతున్నాయి. కరోనా లక్షణాలు తక్కువగా ఉంటే ఇంట్లోనే సెల్ఫ్ ఐసొలేషన్‌లో ఉండాలని వైద్యులు సూచిస్తున్నారు. ఒకవేళ ఏదైనా ఎమర్జెన్సీ అవసరమైనా, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఎదురైనా వెంటనే ఆస్పత్రికి రావాలని వైద్యులు సూచిస్తున్నారు. అయితే, కొవిడ్ బారిన పడిన రోగుల్లో ఎక్కువ మంది శ్వాస సంబంధిత స‌మస్య‌ల‌తో మ‌ర‌ణిస్తున్నారు. దీంతో ఇన్ఫెక్ష‌న్ తీవ్ర‌మైన రోగుల‌కు వెంటిలేట‌ర్ ద్వారా కృత్రిమ శ్వాస అందిస్తున్నారు. అయితే కృత్రిమ శ్వాస ఎవ‌రికి అవ‌స‌రం అవుతుందో గుర్తించ‌డంలో ‘ప‌ల్స్ ఆక్సీమీట‌ర్’ కీల‌కంగా ప‌నిచేస్తుంద‌ని వైద్యులు చెబుతున్నారు. దీంతో ఇంట్లో ఉండే కరోనా బాధితులు ‘పల్స్ ఆక్సిమీటర్లు’ ఎక్కువగా కొనడానికి ఆసక్తి చూపిస్తున్నారు. ఈ క్రమంలోనే సైబర్ క్రిమినల్స్ ‘ఆక్సీ మీటర్’ పేరుతో పలు యాప్‌లు క్రియేట్ చేస్తున్నారు.

పల్స్ ఆక్సీమీటర్ క్లిప్‌లా ఉంటుంది. ఈ ప‌రిక‌రాన్ని ఎక్కువ‌గా చూపుడు వేలికి అమ‌రుస్తుంటారు. మ‌న శ‌రీరంలోని వివిధ భాగాల‌కు ఆక్సిజ‌న్‌ను గుండె ఎలా స‌ర‌ఫ‌రా చేస్తుందో ఈ ఆక్సీమీట‌ర్‌తో తెలుసుకోవ‌చ్చు. కృత్రిమ శ్వాస ఏమైనా అవ‌స‌రం అవుతుందా? వెంటిలేట‌ర్ ఎలా ప‌నిచేస్తుంది? వంటి విషయాలను ఈ పల్స్ ఆక్సీమీటర్‌తో తెలుసుకోవచ్చు. ఇంట్లో క్వారంటైన్‌లో ఉన్న క‌రోనా వైర‌స్‌ రోగుల ద‌గ్గ‌ర‌ ఈ ప‌రిక‌రం ఉంటే స‌రిపోతుంద‌ని యేల్ వ‌ర్సిటీకి చెందిన ఊపిరితిత్తుల నిపుణురాలు డెనీస్ ల‌చ్‌మాన్‌‌సింగ్ కూడా ఓ సందర్భంలో తెలిపారు. “అంద‌రూ ఆక్సీమీట‌ర్‌ను కొనుక్కోవాల్సిన ప‌నిలేదు. కానీ, కొవిడ్ సోకిన త‌ర్వాత ఇంట్లో క్వారంటైన్‌లో ఉంటే.. వారికి ఆస్పత్రి వైద్యం ఎప్పుడు అవ‌స‌రం అవుతుందో ఆక్సీమీట‌ర్ సాయంతో తెలుసుకోవ‌చ్చు” అని ఆమె అన్నారు. దాంతో కరోనా అనుమానంతో ఉన్నవాళ్లతో పాటు కరోనా బాధితులు, ఇతరులు వీటిని కొనుగోలు చేయాలని భావిస్తున్నారు.

ప్ర‌స్తుతం మార్కెట్‌లో చాలార‌కాల ప‌ల్స్ ఆక్సీమీట‌ర్లు అందుబాటులో ఉన్నాయి. వ‌న్‌-పారా, టూ-పారా, మల్టీ పారా ఇలా చాలా ర‌కాలుంటాయి. చాలా కంపెనీలు ఆక్సీ మీటర్లను ఉత్పత్తి చేస్తున్నాయి. కంపెనీని బట్టి రూ.1,000 – 1,500 వరకు ఈ పరికరాలు దొరకుతున్నాయి. అయితే, వీటి అవసరమున్నా అంత ఖర్చు పెట్టి కొనలేని వాళ్లు చాలా మంది ఉంటారు. ఈ అవకాశాన్నే సైబర్ నేరగాళ్లు క్యాష్ చేసుకోవాలనుకున్నారు. ఆక్సీ మీటర్ పేరుతో యాప్‌లను తెరమీదకు తీసుకు వచ్చారు. డబ్బులు అవసరం లేకుండానే యాప్ ద్వారా శరీరంలో ఆక్సిజన్‌ స్థాయి తెలుసుకోవచ్చంటూ జనాలను సైబర్ నేరగాళ్లు ట్రాప్ చేస్తున్నారు. దాంతో ఆశపడి ఆ యాప్ డౌన్‌లోడ్ చేస్తే యూజర్ ప్రైవసీ డేటా మొత్తం సైబర్ నేరగాళ్లకు చిక్కుతుందని, సైబర్ లా అండ్ సెక్యూరిటీ ట్రైనర్ అనంత్ ప్రభు హెచ్చరిస్తున్నారు.

‘సేఫ్ ఆక్సిమీటర్ యాప్స్ కూడా ఉన్నాయి. కానీ, ఫేక్ ఆక్సిమీటర్ యాప్‌లు పెరిగిపోతున్నాయి. ఇది సైబర్ క్రిమినల్స్ మరో ఎత్తుగడ. ఈ వాలెట్‌కు ఉపయోగించే ఫింగర్ ప్రింట్‌ను దొంగలించేందుకు వాళ్లు ప్రయత్నిస్తున్నారు. దాని ద్వారా బ్యాంకు అకౌంట్లు, ఫోన్ లాక్స్ తీయొచ్చు. అంతేకాదు పర్సనల్ ఫొటోలు, ఇతర డేటా మొత్తం వారి చేతిలో పడుతుంది. ఇన్ స్టాల్ చేసేటప్పుడు స్టోరేజ్, గ్యాలరీ పర్మిషన్ల కోసం.. అడుగుతుంది. యాప్‌ డౌన్‌లోడ్‌ చేసే సమయంలో కెమెరా ముందు చూపుడు వేలు ఉంచాలని సైబర్‌ నేరగాళ్లు సూచిస్తారు. అలా ఫింగర్ ప్రింట్ స్కాన్‌ చేసి మోసాలకు పాల్పడతారు’ అని సైబర్‌ నిపుణుడు ప్రభు వెల్లడించారు. ఒక యాప్ ఇన్ స్టాల్ చేసే ముందు డెవలపర్ పేరు, రేటింగ్స్, బగ్స్, రివ్యూస్, టోటల్ డౌన్ లోడ్స్ , వీటన్నింటినీ పరిగణనలోకి తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.

Tags:    

Similar News