వ్యాక్సిన్ సర్టిఫికెట్ల పేరుతో దోపిడీ.. పట్టించుకునేవారెవరు..?
దిశ, తెలంగాణ బ్యూరో : కార్పొరేటు, ప్రైవేటు ఆసుపత్రులు అవకాశం ఉన్న ప్రతీ సందర్భాన్ని అక్రమార్జనకు వాడుకుంటున్నాయి. కాదేదీ దోపిడీకనర్హం అనే తీరుగా వ్యవహరిస్తున్నాయి. నిన్నమొన్నటిదాకా కరోనా చికిత్స పేరుతో పేషెంట్ల నుంచి లక్షలు దండుకున్న ఆసుపత్రులు ఇప్పుడు వ్యాక్సిన్ సర్టిఫికెట్ల జారీ కోసం కొత్త దందా మొదలుపెట్టాయి. దీర్ఘకాల వ్యాధులతో బాధపడుతున్నవారికి సర్టిఫికెట్లు ఇవ్వడానికి వేల రూపాయలు గుంజుతున్నాయి. వ్యాక్సిన్ తీసుకోవాలని కోరుకునేవారంతా విధిగా దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్నట్లు ధ్రువీకరణ సమర్పించాల్సి ఉన్నందున వాటి కోసం […]
దిశ, తెలంగాణ బ్యూరో : కార్పొరేటు, ప్రైవేటు ఆసుపత్రులు అవకాశం ఉన్న ప్రతీ సందర్భాన్ని అక్రమార్జనకు వాడుకుంటున్నాయి. కాదేదీ దోపిడీకనర్హం అనే తీరుగా వ్యవహరిస్తున్నాయి. నిన్నమొన్నటిదాకా కరోనా చికిత్స పేరుతో పేషెంట్ల నుంచి లక్షలు దండుకున్న ఆసుపత్రులు ఇప్పుడు వ్యాక్సిన్ సర్టిఫికెట్ల జారీ కోసం కొత్త దందా మొదలుపెట్టాయి. దీర్ఘకాల వ్యాధులతో బాధపడుతున్నవారికి సర్టిఫికెట్లు ఇవ్వడానికి వేల రూపాయలు గుంజుతున్నాయి.
వ్యాక్సిన్ తీసుకోవాలని కోరుకునేవారంతా విధిగా దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్నట్లు ధ్రువీకరణ సమర్పించాల్సి ఉన్నందున వాటి కోసం ప్రైవేటు ఆసుపత్రులకు చాలా మంది క్యూ కడుతున్నారు. దీనిని ఆసరాగా తీసుకుని ప్రైవేటు, కార్పొరేటు ఆసుపత్రులు, ప్రైవేటు క్లినిక్‌లు, డాక్టర్లు కూడా సర్టిపికెట్లు జారీ చేయడం మొదలుపెట్టారు. దీర్ఘకాలిక వ్యాధులు లేకపోయినా ధ్రువీకరించే కొత్త డ్రామా మొదలైంది. ఆసుపత్రి, డాక్టర్ స్థాయిని బట్టి రూ. 500 మొదలు రూ. 1500 వరకు వసూలు చేస్తున్నారు. వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చిన మొదటి రోజునే వ్యవహారానికి తెర లేచింది. వ్యాక్సిన్ ధర రూ. 250 అయినా సర్టిఫికెట్ కోసం మాత్రం వేలల్లో సమర్పించుకోవాల్సి వస్తోంది.
అప్రమత్తమైన అధికారులు
ఇదే విషయాన్నివైద్యారోగ్య శాఖ అధికారులకు చాలా మంది ఫిర్యాదు చేశారు. పదుల సంఖ్యలో ఫిర్యాదులు రావడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. కరోనా తీవ్రంగా ఉన్న సమయంలో లక్షలాది రూపాయలను వసూలు చేసిన ఆసుపత్రులు ఇప్పుడు సర్టిఫికెట్ల పేరిట వెయ్యి రూపాయలకు కూడా కక్కుర్తి పడుతుండడంపై సీరియస్ అయ్యారు. వ్యాక్సిన్ తీసుకోవాలనుకుంటే ప్రైవేటు ఆసుపత్రులను ఆశ్రయించాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు.
ప్రభుత్వాసుపత్రులకు వెళితే వ్యాధులను ధ్రువీకరించి, అక్కడికక్కడే ఉచితంగా టీకాలు వేయించుకోవచ్చని వివరించారు. ఇప్పటికే అందిన ఫిర్యాదులపై విచారణ జరుపుతామని, నిజమని తేలితే కఠిన చర్యలు తీసుకుంటామని ఒక అధికారి తెలిపారు. ప్రభుత్వాసుపత్రులలో వ్యాక్సిన్ ఉచితం కాబట్టి అక్కడే పేరు నమోదు చేసుకోవడంతో పాటు దీర్ఘకాలిక వ్యాధులు ఉంటే ఆ వివరాలను కూడా నమోదు చేసుకుంటారని అన్నారు. ప్రైవేటు వైద్యులకు లంచాలు ఇచ్చుకుని తప్పుడు మార్గంలో వెళ్లాల్సిన అవసరం లేదని పేర్కొన్నారు.