కేసీఆర్ ఆశయానికి ఉన్నతాధికారుల తూట్లు
తెలంగాణ రెవెన్యూ చట్టాన్ని మార్చడానికి ప్రయత్నాలు చేస్తున్నామని సీఎం కేసీఆర్ కొంతకాలం క్రితం ప్రకటించారు. అది ప్రజలకు, ప్రభుత్వానికి మధ్య వారధిగా ఉంటూ సమాజ శ్రేయస్సును కాంక్షించే విధంగా ఉంటుందని వెల్లడించారు. ఈ ప్రతిపాదన మాత్రం ముందుకు కదలడం లేదు. దీంతో అటు ఉద్యోగులలోనూ, ఇటు జనంలోనూ రకరకాల ప్రచారాలు షికారు చేస్తున్నాయి. ఉన్నతాధికారులు కూడా స్పష్టత ఇవ్వలేకపోతున్నారు. ఈ క్రమంలో కొత్త చట్టం ఎలా ఉండాలి? అనే అంశం మీద మేధావుల అభిప్రాయాలను ‘దిశ’ సేకరించింది. […]
తెలంగాణ రెవెన్యూ చట్టాన్ని మార్చడానికి ప్రయత్నాలు చేస్తున్నామని సీఎం కేసీఆర్ కొంతకాలం క్రితం ప్రకటించారు. అది ప్రజలకు, ప్రభుత్వానికి మధ్య వారధిగా ఉంటూ సమాజ శ్రేయస్సును కాంక్షించే విధంగా ఉంటుందని వెల్లడించారు. ఈ ప్రతిపాదన మాత్రం ముందుకు కదలడం లేదు. దీంతో అటు ఉద్యోగులలోనూ, ఇటు జనంలోనూ రకరకాల ప్రచారాలు షికారు చేస్తున్నాయి. ఉన్నతాధికారులు కూడా స్పష్టత ఇవ్వలేకపోతున్నారు. ఈ క్రమంలో కొత్త చట్టం ఎలా ఉండాలి? అనే అంశం మీద మేధావుల అభిప్రాయాలను ‘దిశ’ సేకరించింది.
దిశ, న్యూస్ బ్యూరో: భూ పరిపాలనలో కొత్త చట్టం సమగ్రంగా ఉండాలి. లోపాలను సమూలంగా పరిష్కరించాలి. భూమిపై హక్కులకు, హద్దులకు భద్రతనివ్వాలి. భరోసానివ్వాలి. భూమిని రైతు-పట్టాదారు కోణంలోనే ఆలోచించొద్దు. భూమి ఉన్నవారు, లేనివారు అంటూ రెండు కోణాలలో చూడాలి. అందరికీ మేలు కలగాలి. అప్పుడే ఆశించిన ప్రయోజనాలు కలుగుతాయి. భూమితో పట్టాదారుడికే కాదు. అన్ని వర్గాలకూ లాభం చేకూరుతుంది. దాని ద్వారా సమాజానికి మేలే. ప్రభుత్వానికి లాభమే. పెరిగే రెవెన్యూ రాష్ట్రాన్ని సుభిక్షంగా ఉంచుతుంది. ఈ భావనతోనే సీఎం కేసీఆర్ కొత్త రెవెన్యూ చట్టాన్ని రూపొందించబోతున్నామని ప్రకటించారు. నెలలు గడిచినా అది ముందుకు సాగడం లేదు. ఇప్పటి వరకు సంప్రదింపులు కూడా మొదలు కాలేదు. మీడియా మాత్రం ఆర్భాటం చేస్తోంది. రెవెన్యూ ఉద్యోగులు తమ జాబ్ చార్ట్ కు మాత్రమే పరిమితమవుతున్నారు. మరోవైపు దీని మీద భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.
ఈ మార్పులు సరిపోవు
వీఆర్వోల తొలగింపు, లేదా విధుల్లో మార్పులు, తహశీల్దార్ల అధికారాల్లో కోత, ఆర్డీఓలు, అదనపు కలెక్టర్లకు మ్యుటేషన్ల బాధ్యతల అప్పగింత తదితర మార్పలు మార్పులతోనో సరిపోదు. రెవెన్యూ చట్టంతో సమాజహితగా, రాష్ట్రాభివృద్ధి దిశగా అడుగులు పడాలి. ఈజ్ ఆఫ్ డూయింగ్ కు అడుగులు పడాలి. భూ రికార్డుల సమగ్రత, వాస్తవ దృక్పథంతో పెట్టుబడులు వస్తాయి. పరిశ్రమలకు పునాది రాళ్లు పడతాయి. ఉపాధి అవకాశాలు మెరుగుపడతాయి. జీవన ప్రమాణాల మెరుగు పడతాయి. చాలా మంది ఐఏఎస్ అధికారులు సైతం రెవెన్యూ చట్టాలను అధ్యయనం చేయడం లేదు. దేశం మెచ్చే చట్టాన్ని రూపొందించాలన్న సీఎం కేసీఆర్ ఆశయానికి ఉన్నతాధికారులే తూట్లు పొడుస్తున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. చట్టంలో సమగ్రత లోపిస్తే అసలుకే మోసం వస్తుందని గ్రహించడం లేదు. మెరుగైన పాలనకు రెవెన్యూ చట్టాలే కీలకమని లీగల్ ఎంపర్ మెంట్ అండ్ అసిస్టెన్స్ ఫర్ ఫార్మర్స్ అధ్యక్షుడు, ల్యాండ్- అగ్రికల్చరల్ లా ప్రాక్టీషనర్స్ భాగస్వామి, నల్సార్ యూనివర్సిటీలో సెంటర్ ఫర్ ట్రైబల్ అండ్ ల్యాండ్ రైట్స్ ప్రొఫెసర్ ఎం.సునీల్ కుమార్ స్పష్టం చేస్తున్నారు.
సంపద సృష్టించని ఆస్తులు
ఆస్తులు ఉన్నాయి. సంపదను సృష్టించేందుకు మాత్రం ఉపయోగపడడం లేదు. ఇన్ స్టిట్యూట్ ఫర్ లిబర్టీ అండ్ డెమోక్రసీ డైరెక్టర్ ప్రకారం ప్రపంచంలో రెండు బిలియన్ల ప్రజలకు ఆస్తి, సాగు భూములపై హక్కులు ఉన్నాయి. హక్కులే లేని వారు 5.3 బిలియన్లు ఉన్నారు. వారందరికీ చిక్కులే ఉన్నాయి. వారి ఆస్తులన్నీ డెడ్ క్యాపిటల్గా మారుతున్నాయి. చాలా దేశాలు పేదరికంలో ఉండిపోవడానికి ఈ డెడ్ క్యాపిటలే కారణం. పేదలకు భూములు, గృహాలు, వ్యాపారాలకు టైటిల్స్ ఇవ్వడం వల్ల ఎంతో మేలు కలుగుతుంది. ప్రజలు వారి ఆస్తులను గ్లోబల్ మార్కెట్ కి తీసుకొస్తే ఆదాయం సమకూరుతుంది. ప్రాపర్టీ రైట్స్ పొందడం ద్వారా ఎంటర్ ప్రెన్యూర్లుగా ఎదగొచ్చునని డి సోటో వివరించారు. డెడ్ క్యాపిటల్ ఉపయోగంలోకి తీసుకురావాలంటే పక్కాగా హక్కు పత్రాలివ్వాలి. రుణాలు పొందడం సులభమవుతుంది.
హక్కులకు భద్రత
భూమి హక్కులకు భద్రత ఉండాలి. హద్దులకు కూడా భద్రత ఉండాలి. భూ పరిపాలన వ్యవస్థలో ఇదే కీలకాంశం. కమతం బౌండరీలు తెలిసిపోవాలి. చాలా గ్రామాల్లో పట్టాదారు పుస్తకాల్లోని భూములకు, క్షేత్ర స్థాయి భూములకు మధ్య చాలా వ్యత్యాసం ఉంది. ప్రతి గ్రామంలోనూ వందలాది కేసులు కనిపిస్తాయి. అందుకే, ప్రతి కమతానికి ఓ యూనిక్ ఐడీ విధానం రావాలి. ఆ ఐడీతో గూగుల్ సెర్చ్ చేస్తే చాలు.. హద్దులతో సహా తెలిసిపోవాలి. హక్కుదారులెవరో కనబడాలి. తెలియని నగరాల్లోనూ ఇంటి నంబరుతోనో, కాలనీ పేరుతోనో సులువుగా అడ్రసు తెలుసుకోగ లు గుతున్నాం. క్యాబ్ జర్నీలో తెలియని ప్రాంతాలకు ఏ ఒక్కరినీ అడక్కుండానే చేరుకోగలం. అదే విధానం భూ కమతాల్లోనూ చోటు చేసుకోవాలి. మెరుగైన పాలనకు ఇదో ఆదర్శప్రాయం కావాలి. భూములను సర్వే చేయడం పెద్ద కష్టమేం కాదు. రూ.రెండు వేల కోట్లు వెచ్చిస్తే సరిపోతుంది.
చట్టాలన్నీ క్రోఢీకరించాలి
రికార్డులు, చట్టాలను నవీకరించాలి. సరళతరం చేయాలి. క్రోఢీకరించాలి. దేశంలో ఐదు వేలకు పైగానే చట్టాలు ఉన్నాయి. ఇక జీఓలు, సర్క్యులర్లు వేలల్లోనే ఉన్నాయి. ప్రతి రాష్ట్రంలోనూ ప్రత్యేకంగా మరో 100కు పైగానే ఉన్నాయి. తెలంగాణ ప్రాంతం నిజాం ఏలుబడిలో ఉన్నందున అనేక ప్రత్యేక రెవెన్యూ వ్యవస్ధలు లేకపోలేదు. రకరకాల అసైన్మెంట్లు కనిపిస్తాయి. వీటన్నింటినీ సరళీకరణ చేయాలి. దీని కోసం తెలంగాణలోనూ రెండేండ్ల క్రితమే కమిటీ వేశారు. అడుగు ముందుకేయలేదు. వివాదం ఏర్పడితే కనీసం ఆర్నెళ్లలో పరిష్కరించే వ్యవస్థ రావాలి. సివిల్ కోర్టులో వివాదం తేలడానికి ఏండ్లు పడుతుంది. జిల్లాకో ట్రిబ్యునల్ ను ఏర్పాటు చేస్తామని సీఎం కేసీఆర్ ప్రకటించారు. బిహార్ ట్రిబ్యునల్ వంటివి అమలు చేస్తే కేంద్రం 80 శాతం వరకు నిధులను కేటాయిస్తామని ప్రకటించింది.
భూ వివాదాలతో ఎంతో నష్టం
లిటిగేషన్లతో జీడీపీలో 1.5 నుంచి 2 శాతం పడిపోతోందని ప్రభుత్వాలే చెప్పాయి. ప్రభుత్వ గణాంకాల ప్రకారం 65 శాతం భూమి కేంద్రంగానే నేరాలు జరుగుతున్నాయి. 12 శాతం హత్యలు భూ హక్కుల కోసమే జరుగుతున్నాయి. సివిల్ కోర్టుల్లో 66 శాతం కేసులు భూమి, వాటి హద్దులు, హక్కుల కోసమే నడుస్తున్నాయి. భూమి హక్కులకు, డాక్యుమెంట్లకు గ్యారంటీ ఇస్తే ప్రతి రైతు వివిధ సంక్షేమ పథకాల కింద, ఇతర మార్గాల ద్వారా రూ.50 వేలు పొందడం ఖాయం. ఏ బ్యాంకు నుంచైనా రుణం పొందొచ్చు. స్వయం ఉపాధి అవకాశం ఏర్పడుతుంది. వ్యవసాయ భూమి కూడా ఉపాధి మార్గానికి, పెట్టుబడి పొందడానికి అనేక మార్గాలు ఏర్పడుతాయి.
రీ సర్వే అమలుకు జాప్యమెందుకు?
తెలంగాణలో 70 ఏండ్ల క్రితం సర్వే చేశారు. భూ సమగ్ర సర్వే చేసేందుకు కేంద్రం రూ.530 కోట్లు మంజూరు చేసింది. అందులో మొదటి దశ కింద రూ.83 కోట్లు విడుదల చేశారు. రెండో దశ కింద నిధులు విడుదల కాలేదు. దానికి కారణాలేమిటో అంతు చిక్కడం లేదు. రికార్డుల సర్వే చేసి చేతులు దులిపేసుకున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. మొదటి దశ నిధులకు లెక్కలేవీ చెప్పకపోవడం వల్ల రెండో దశ నిధులేవీ కేంద్రం విదల్చలేదని సమాచారం. భూముల సర్వే చేసేందుకు ప్రభుత్వం ఏ కారణం చేతనో వెనుకడుగు వేస్తోంది. అందుకే రికార్డుల ప్రక్షాళనతోనే సరిపెడుతున్నారు.
రీ సర్వేతో అనేక లాభాలు
మొఘల్ కాలంలో ల్యాండ్ సర్వే జరిగింది. బ్రిటిష్ వారి హయాంలో చోటు చేసుకుంది. నిజాం కాలంలో సాగింది. ఆ తర్వాత ఏ పాలకుడు సర్వే చేసేందుకు ముందుకు రాలేదు. ఏపీలో కౌలుదారు చట్టాన్ని కొంచెం మార్పులతో అమలు చేస్తున్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీలుంటే ప్రయోజనం కలిగిస్తోంది. తెలంగాణలో ఇంకా ఎలాంటి చట్టాలను రూపొందించలేకపోయారు. భూ రీసర్వేతో హక్కులు పక్కాగా మారుతాయి. దాని ద్వారా ఎలాంటి వివాదాలు లేని భూములు లభిస్తాయి. పెద్ద ఎత్తున పెట్టుబడులు వస్తాయి. ఉపాధి అవకాశాలు లభిస్తాయి. రూ.వేల కోట్ల ఆదాయం సమకూరుతుంది.
కంప్యూటర్లలో ఏది పెడితే అదే
భూ రికార్డుల ప్రక్షాళన వివరాలను కంప్యూటర్లతో నిక్షిప్తం చేస్తున్నారు. కంప్యూటర్ లో మంచి రికార్డులు పెట్టకుండా ఎలా ఔట్ పుట్ వస్తుంది. అరక దున్నుకునే రైతుకు కాగితమే ముఖ్యం. తన పేరును కంప్యూటర్ లో చూపించినంత మాత్రాన సంతృప్తి ఏం ఉంటుంది? భూ సంస్కరణలు తీసుకురావాల్సిందే. హక్కుదారుల ప్రయోజనాలను కాపాడాలని దివంగత ఐఏఎస్ శంకరన్ అన్నారు.
ఎప్పుడైనా సర్వేకు వెళ్లాల్సిందే: ఎం.సునీల్ కుమార్, భూ చట్టాల నిపుణుడు, నల్సార్ యూనివర్సిటీ ప్రొఫెసర్ ఎన్నటికైనా భూ సర్వేకు వెళ్లాల్సిందే. భూ చట్టాలను అమలు చేసే ముందే ఈ ప్రక్రియను పూర్తి చేయాలి. హక్కుదారుడికి, హద్దులకు భద్రత కల్పించాలి. రెవెన్యూ చట్టం తీసుకొచ్చే ముందు పట్టాదారుడు, రైతు కోణంలో కాకుండా ప్రజల కోణంలోనూ ఆలోచించాలి. అప్పుడే న్యాయం జరుగుతుంది. భూమిని ఒక్కరి అంశంగా చూడొద్దు. సర్వే చేయడం వల్ల కమతానికి ఓ యూనిక్ కోడ్ ను ఇవ్వగలం. పేదవారి పక్కన నిలబడేందుకు పారా లీగల్ సహాయక వ్యవస్థ ఉండాలి. భూ రీసర్వేలోనూ ఉపయోగపడుతుంది. వేలాది మంది గ్రామీణ యువతకు ఉపాధి అవకాశాలు లభిస్తాయి. దీనికి కేంద్రం కూడా నిధులను సమకూరుస్తుంది. ఇలాంటి అనేకాంశాలపై అధ్యయనం చేయాలి.