ఉద్యోగులకు షాక్.. సీల్డ్ కవర్ ఓ మాయ!
దిశ, తెలంగాణ బ్యూరో : వేతన సవరణ కమిషన్ సీఎస్‌కు ఇచ్చిన సీల్డ్ కవర్లో ఏముందనేదే ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. దీనిపై విస్తృతమైన సెటైర్లు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి. పీఆర్సీ నివేదిక ఎప్పుడెప్పుడు విడుదలవుతుందా అని దాదాపు నాలుగున్నర లక్షల మంది ఉద్యోగులు ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. వేతనాలు పెరుగుతాయని సీఎం కేసీఆర్ ప్రకటించి 13 రోజులు గడిచిపోయాయి. ఇంతవరకు అతీగతీ లేదు. కనీసం దానిని ఎప్పుడు తెరుస్తారనేదాని మీద స్పష్టత కూడా లేదు. సీఎం […]
దిశ, తెలంగాణ బ్యూరో : వేతన సవరణ కమిషన్ సీఎస్‌కు ఇచ్చిన సీల్డ్ కవర్లో ఏముందనేదే ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. దీనిపై విస్తృతమైన సెటైర్లు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి. పీఆర్సీ నివేదిక ఎప్పుడెప్పుడు విడుదలవుతుందా అని దాదాపు నాలుగున్నర లక్షల మంది ఉద్యోగులు ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. వేతనాలు పెరుగుతాయని సీఎం కేసీఆర్ ప్రకటించి 13 రోజులు గడిచిపోయాయి. ఇంతవరకు అతీగతీ లేదు. కనీసం దానిని ఎప్పుడు తెరుస్తారనేదాని మీద స్పష్టత కూడా లేదు.
సీఎం కేసీఆర్ గత నెల 30న ఉద్యోగసంఘాలతో భేటీ అయి పలు అంశాల గురించి చర్చించారు. పీఆర్సీ నివేదిక త్వరగా ఇవ్వాలని అదే రోజు ఆదేవించారు. దాని అధ్యయనం కోసం సీఎస్ ఆధ్యక్షతన త్రీమెన్ కమిటీని వేస్తున్నట్టు ప్రకటించారు. జనవరి మొదటి వారంలో స్టడీ చేయాలని, రెండో వారంలో ఉద్యోగ సంఘాలతో సమావేశం కావాలని సూచించారు. మూడో వారంలో జోనల్ విధానం, పదోన్నతులు, ఖాళీల భర్తీపైనా కేబినెట్ భేటీ ఉంటుందని షెడ్యూల్ చేశారు. ఈ నేపథ్యంలోనే బిస్వాల్ కమిషన్ ఇంకా పీఆర్సీ నివేదికను సీల్డ్ కవలో ఉంచి సీఎస్ కు అందజేసింది. దానిని ఇంత వరకూ ఓపెన్ కూడా చేయలేదు. అసలు సీల్డ్ కవర్లో ఏముందనేది ఇప్పటికీ తేలని అంశమే. దీనిపై ఉద్యోగ సంఘాలలో పలు రకాల ప్రచారం సాగుతోంది.
అందులో ఏం లేదు?
సీల్డ్ కవర్‌ను ఉద్యోగులు నమ్మం లేదు. అవన్నీ ఉత్తి కాగితాలేనని, అందులో ఎలాంటి నివేదికలు లేవని అంటున్నారు. సీఎం అత్యవసరంగా నివేదిక ఇవ్వాలని సూచించారని, అందుకే ఫిట్మెంట్, బెనిఫిట్స్ తేల్చకుండానే నివేదిక ఇచ్చారనే ప్రచారం జరుగుతోంది. 31 నెలల పాటు అధ్యయనం చేసిన నివేదికను నాలుగైదు పేజీలలో ఇవ్వరని అంటున్నారు. కమిషన్ పదవీకాలం కూడా డిసెంబర్ 31తో ముగిసింది. నిజానికి ఇప్పుడే వేతన సవరణ నివేదికలు రెడీ చేస్తున్నారని, ఫిట్మెంట్, బెనిఫిట్స్ రూపొందిస్తున్నారని, అందుకే సీఎస్ కమిటీ భేటీ ఎటూ తేలడం లేదని ఉద్యోగవర్గాలు అనుమానిస్తున్నాయి. ఇప్పటికే ఉద్యోగ సంఘాలతో చర్చించి, సీఎం కేసీఆర్‌కు వివరించాల్సి ఉందని, అసంపూర్తి నివేదిక కారణంగానే ఆలస్యం అవుతోందనే ఆరోపణలున్నాయి. త్రీమెన్ కమిటీ ఒకేసారి భేటీ అయింది. పీఆర్సీపై చర్చించలేదు. ఆ తర్వాత కమిటీలోని ఉన్నతాధికారులు తమతమ పనులలో నిమగ్నమయ్యారు. పీఆర్సీ భేటీకి సమయం కేటాయించడం లేదు. అసలు సీఎస్ నుంచి సభ్యులకు సమాచారం కూడా అందడం లేదు. సీఎంకు ఇచ్చిన తర్వాతే సీల్డ్ కవర్‌ను ఓపెన్ చేస్తామని సీఎస్ చెబుతున్నారు. సీఎం కమిటీకి అప్పాయింట్మెంట్ ఇవ్వడం లేదని ఉద్యోగ సంఘాలు అంటున్నాయి.
అప్పుడే సీఎంను కలిసి ఉంటే
వాస్తవంగా సీఎం కేసీఆర్‌ను కలిసేందుకు పీఆర్ కమిషన్ కొద్ది నెలల కిందట నుంచే ప్రయత్నాలు చేస్తోందని ఉద్యోగవర్గాలు చెబుతున్నాయి. సీఎంను కలిసి వినతులు, అధ్యయనంపై వివరించిన తర్వాతే నివేదిక సిద్ధం చేసేందుకు ప్లాన్ చేసుకుందని అంటున్నాయి. సీఎం అప్పాయింట్మెంట్ లేకపోవడంతో నివేదికను ఎలా సిద్దం చేయాలనే సందిగ్థంలో పడిందని వివరిస్తున్నాయి. ఎంత మేరకు ఫిట్మెంట్ ఇవ్వాలి, ఏయే అంశాలను పరిశీలించాలనే విషయాలన్నీ సీఎంను కలిసిన తర్వాతే నివేదికలో పొందుపర్చాలని భావించారని, దీని గురించి కమిషన్ నుంచి కూడా ఉద్యోగ సంఘాలకు సమాచారం కూడా అందిందనే ప్రచారం జరుగుతోంది. సీఎం ఉన్నఫళంగా అధ్యయనం రిపోర్టు ఇవ్వాలంటూ ఆదేశించడంతో వెంటనే ఓ సీల్డ్‌కవర్‌ను సీఎస్‌కు అందించారని అంటున్నారు.
ఇంకా ఎప్పుడు మరి?
పీఆర్సీ నివేదిక గురించి ఈ నెల మూడో వారం వరకు వేచి చూడాల్సిందేనని ఉద్యోగ సంఘాలు అభిప్రాయపడుతున్నాయి. సోమవారం ప్రగతిభవన్ నుంచి పిలుపు వస్తుందనే ఆశతో ఎదురుచూసిన ఉద్యోగులకు ఎలాంటి సమాచారం రాలేదు. నేడు కలెక్టర్లతో కాన్ఫరెన్స్ తర్వాత పిలుస్తారని భావించారు. కలెక్టర్ల కాన్ఫరెన్స్ చాలా సమయం తీసుకుంటుందని, వీలుకాదంటూ ప్రగతిభవన్ వర్గాలు స్పష్టం చేశాయి. ఆ తర్వాత పండుగ వాతావరణం నెలకొంటుంది. సెలవుల అనంతరం మూడో వారంలో పీఆర్సీ నివేదిక అంశం తేలే అవకాశం ఉందని ఆశిస్తున్నారు. సీఎస్ కమిటీ సీఎంకు నివేదిక అందించిన తర్వాత, ఉద్యోగ సంఘాలతో భేటీ అవుతుందని, ఆ తర్వాత సీఎం నుంచి ప్రకటన ఉండే అవకాశం ఉందంటున్నారు. సీఎం ప్రకటించిన షెడ్యూల్ ఈ నెలలో పూర్తి అయ్యే అవకాశం లేదని ఉద్యోగులు అనుమానిస్తున్నారు. ఈ నెలాఖరుకే వేతనాల పెరుగుదల, పీఆర్సీ అంశం, బదిలీలు, పదోన్నతులన్నీ పూర్తి చేస్తామని ప్రకటించినా, ఇప్పుడు కష్టమేనని అంటున్నారు.