రేవంత్‌పైనే భారం.. మిగతా వారు లైట్!

దిశ, తెలంగాణ బ్యూరో : గ్రేటర్ ఎన్నికలను అన్నిపార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. కానీ ఓటమికి అలవాడు పడిన కాంగ్రెస్ పార్టీ తేలిగ్గానే తీసుకుంది. నేతలు కనీసం ప్రచారంలో కూడా కనిపించలేదు. నేతలంతా బీజేపీ గూటికి క్యూ కట్టారు. ఈ నేపథ్యంలో ప్రచార బాధ్యతలను రేవంత్‌రెడ్డి ఒక్కడే భుజాలపై వేసుకున్నట్టు మారింది. నాలుగు రోజుల నుంచి టీపీసీసీ చీఫ్ ఉదయం, సాయంత్రం ఒకటీ, రెండు డివిజన్లలో ప్రచారం నిర్వహించారు. అంతే మినహా మిగిలిన రాష్ట్ర నేతలు ప్రచారంలో అసలే […]

Update: 2020-11-29 05:01 GMT

దిశ, తెలంగాణ బ్యూరో : గ్రేటర్ ఎన్నికలను అన్నిపార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. కానీ ఓటమికి అలవాడు పడిన కాంగ్రెస్ పార్టీ తేలిగ్గానే తీసుకుంది. నేతలు కనీసం ప్రచారంలో కూడా కనిపించలేదు. నేతలంతా బీజేపీ గూటికి క్యూ కట్టారు. ఈ నేపథ్యంలో ప్రచార బాధ్యతలను రేవంత్‌రెడ్డి ఒక్కడే భుజాలపై వేసుకున్నట్టు మారింది. నాలుగు రోజుల నుంచి టీపీసీసీ చీఫ్ ఉదయం, సాయంత్రం ఒకటీ, రెండు డివిజన్లలో ప్రచారం నిర్వహించారు. అంతే మినహా మిగిలిన రాష్ట్ర నేతలు ప్రచారంలో అసలే కనిపంచలేదు. జిల్లా నుంచి వచ్చిన నేతల్లో ములుగు ఎమ్మెల్యే సీతక్క, పెద్దపల్లి మాజీఎమ్మెల్యే విజయరమణారావు మాత్రమే ప్రచారంలో అడపాదడపా కనిపించారు. అంతేకానీ రాష్ట్ర నేతలు, మాజీ మంత్రులు మాత్రం ఒక్కచోట కూడా ప్రచారం నిర్వహించలేదు. దీంతో పార్టీలో గుసగుసలు మొదలయ్యాయి.

గెలిస్తే మనకేంటి..?

కాంగ్రెస్ పార్టీ పంథా మారడం లేదు. ఒకరు ముందుకు పరుగెతుత్తుంటే… నలుగురు కాళ్లల్లో కట్టెలు పెట్టినట్లు వ్యవహరిస్తారు. ఇది ముందు నుంచీ వస్తున్నకాంగ్రెస్ ఆచారమే. ఈసారి కూడా అదే పాటించారు. దీనిపై పార్టీలో పలు రకాల ప్రచారం సాగుతోంది. వాస్తవంగా టీపీసీసీ చీఫ్ మారుస్తారనే ఊహగానాల నేపథ్యంలో పార్టీ నేతలు ఒకరికే క్రెడిట్ రాకుండా ప్రచారానికే దూరమయ్యారు. గ్రేటర్‌లో పార్టీ తరుపున అభ్యర్థులు గెలిస్తే వారికి వచ్చే రాజకీయ ప్రయోజనాలు ఏమీ ఉండవనే ప్రధాన కారణంతో ఒకరి వెంట ఒకరు ఇండ్లకే పరిమితమయ్యారు. కొంతమంది గ్రేటర్‌ అభ్యర్థులు తాము గెలిచే అవకాశాలున్నాయని, ప్రచారానికి రావాలంటూ రాష్ట్ర నేతలకు మొర పెట్టుకున్నారు. కానీ వారి ముఖమే చూడలేదు. ప్రస్తుతం చచ్చుబడిపోయిన కాంగ్రెస్ పార్టీకి అంతా కలిసి పని చేస్తే కొత్త ఊపు వస్తుందని భావిస్తున్నా… కలసి వచ్చే నేతలు లేకపోవడంతో మరింత ఢీలా పడిపోయింది.

ఇతర పార్టీలను చూసైనా..?

గ్రేటర్ ఎన్నికల్లో ఆయా పార్టీల తరుపున అగ్ర నేతలు రంగంలోకి దిగారు. అధికార పార్టీ మంత్రి మండలి మొత్తం పాగా వేసింది. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, జిల్లా పరిషత్, మండల పరిషత్ ఛైర్మన్లు, కార్పొరేషన్ల ఛైర్మన్లు… ఇలా కేడర్ మొత్తం నగరంలోనే మకాం వేసింది. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లోని నేతలందరినీ గ్రేటర్‌కు తరలించి ప్రచారం నిర్వహించింది. శనివారం సీఎం కేసీఆర్ బహిరంగ సభ నిర్వహించారు. అటు బీజేపీ గ్రేటర్ ఎన్నికలకు టాప్ ప్రియార్టీ ఇచ్చింది. దుబ్బాక ఉప ఎన్నికల విజయంతో నయా జోష్‌తో ఉరకలేశారు. బీజేపీ తరపున కేంద్రమంత్రులు, యూపీ సీఎం, మహారాష్ట్ర మాజీ సీఎంతో పాటు చాలా మంది నేతలతో ప్రచారం చేసింది. రాష్ట్ర నేతలంతా పాగా వేశారు. అదే విధంగా టీడీపీ, వామపక్షాలు, టీజేఎస్ వంటి పార్టీల తరుపున ప్రచారం నిర్వహించారు. కానీ కాంగ్రెస్ మాత్రం చాంతాడంత నేతలను రాష్ట్రంలో పెట్టుకుని ఒక్కరు కూడా ప్రచారంలో పాల్గొనలేదు.

రోజూ రేవంత్… అప్పుడప్పుడు ఉత్తమ్

కాంగ్రెస్ ప్రచారంలో రేవంత్ రెడ్డి ప్రధానంగా కనిపించారు. తాను ప్రాతినిధ్యం వహించే మల్కాజిగిరి పార్లమెంట్‌తో పాటుగా పలు ప్రాంతాల్లో ప్రచారం చేశారు. రేవంత్ క్రేజీతో చాలా చోట్ల అభ్యర్థులు కూడా పోటీ చేశారు. ఇక టీపీసీసీ ఉత్తమ్ చేసీ చేయనట్టుగానే ప్రచారంలో పాల్గొన్నారు. వీరితో పాటుగా ఎమ్మెల్యే సీతక్క, మాజీ ఎమ్మెల్యే విజయరమణారావు ప్రచారంలో కనిపించారు. ఒకటీ, రెండు డివిజన్లలో వీ హనుమంతరావు వెళ్లినా వెంటనే తిరిగి వచ్చారు. సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి పఠాన్‌చెరు నియోజకవర్గంలో ఒక్క రోజు ప్రచారం చేసి మాయమయ్యారు.
ఇక కాంగ్రెస్ సీనియర్ నేతలు, మాజీ మంత్రులు అసలు సమయంలో కనిపించలేదు. కొంతమంది ఉన్నా లేనట్టుగానే ఉన్నారు. అయితే గాంధీభవన్‌లో మీడియా సమావేశం నిర్వహించి ఉన్నామంటూ ముఖం చూపించారు. సీఎల్పీ నేత భట్టీ విక్రమార్క, ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, ఎమ్మెల్యేలు శ్రీధర్‌బాబు, రాజగోపాల్ రెడ్డి, పొదెం వీరయ్య, ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి, పీసీసీ మాజీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య, మర్రి శశిధర్‌రెడ్డి, మాజీ ఎంపీ అజహరుద్దీన్, అసలు కనిపించలేదు. మాజీ మంత్రులు, సీనియర్ నేతలు ప్రచారం వైపు కనిపించలేదు. టీపీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు పొన్నం ప్రభాకర్, ఏఐసీసీ కార్యదర్శులు మధుయాష్కి, షబ్బీర్ అలీ, సంపత్ కుమార్, వంశీతో పాటుగా నేతలు కొండా విశ్వేశ్వర్‌రెడ్డి, అంజన్ కుమార్ యాదవ్, దాసోజు శ్రవణ్ కుమార్, అద్దంకి దయాకర్, శ్రీనివాస్ కృష్ణన్, మైనార్టీ నేతల జాఫర్, అమీర్, జావేద్, మాజీ మంత్రులు నాగం, చిన్నారెడ్డి, జానారెడ్డి, గీతారెడ్డి, నిరంజన్, కుసుమ కుమార్, విష్ణువర్ధన్ రెడ్డ వంటి నేతలు ప్రచారానికి దూరంగా వ్యవహరించారు. కొంతమంది మీడియా సమావేశాలకు మాత్రమే పరిమితమయ్యారు.

ఠాగూర్… మళ్లీ రాలేదు

బీజేపీ అగ్రశ్రేణి నేతలు, ఇతర రాష్ట్రాల సీఎంలు కూడా వచ్చి ప్రచారం చేస్తే… కాంగ్రెస్ నుంచి ఒక్కరు కూడా కానరాలేదు.దీంతో పోటీ చేసిన అభ్యర్థుల్లో నిరాసక్తత నెలకొంది. అటు కాంగ్రెస్ పార్టీ వ్యవహారాల ఇంఛార్జ్ మాణిక్యం ఠాగూర్ కేవలం గాంధీభవన్‌కు ఒక్కరోజు పరిమితమయ్యారు. మేనిఫెస్టోను విడుదల చేసి మళ్లీ ఫైటెక్కారు. అంతేకానీ క్షేత్రస్థాయిలో ప్రచారం చేయలేదు. ఠాగూర్, ఇతర నేతలు ప్రచారం చేస్తే కొంతైనా కలిసి వస్తుందని భావించినా నిరాశే ఎదురైంది.

Tags:    

Similar News