నెగెటివ్ ఉంటేనే జైళ్లల్లోకి ఎంట్రీ

దిశ, క్రైమ్ బ్యూరో: జైళ్లల్లో కోవిడ్ నిబంధనల అమలులో భాగంగా రిమాండ్ ఖైదీలకు ప్రత్యేక బారక్‌లు ఏర్పాటు చేస్తున్నారు. వివిధ నేరాలకు పాల్పడిన వారిని పోలీసుల అరెస్టు అనంతరం కరోనా నెగిటివ్ నిర్థారణ పరీక్షల పత్రం ఉంటేనే రిమాండ్‌కు కోర్టు అనుమతిస్తోంది. ఈ నేపథ్యంలో తప్పనిసరి పరిస్థితుల్లో పోలీసులు రిమాండ్ చేసే ఖైదీలకు సాధారణంగా నిర్వహించే వైద్య పరీక్షలతో పాటు కోవిడ్ టెస్టులను కూడా తప్పనిసరిగా చేయిస్తున్నారు. ఖైదీలకు కరోనా పాజిటివ్ ఉన్నట్లయితే.. కోర్టు వరకూ కూడా […]

Update: 2021-04-17 06:22 GMT

దిశ, క్రైమ్ బ్యూరో: జైళ్లల్లో కోవిడ్ నిబంధనల అమలులో భాగంగా రిమాండ్ ఖైదీలకు ప్రత్యేక బారక్‌లు ఏర్పాటు చేస్తున్నారు. వివిధ నేరాలకు పాల్పడిన వారిని పోలీసుల అరెస్టు అనంతరం కరోనా నెగిటివ్ నిర్థారణ పరీక్షల పత్రం ఉంటేనే రిమాండ్‌కు కోర్టు అనుమతిస్తోంది. ఈ నేపథ్యంలో తప్పనిసరి పరిస్థితుల్లో పోలీసులు రిమాండ్ చేసే ఖైదీలకు సాధారణంగా నిర్వహించే వైద్య పరీక్షలతో పాటు కోవిడ్ టెస్టులను కూడా తప్పనిసరిగా చేయిస్తున్నారు. ఖైదీలకు కరోనా పాజిటివ్ ఉన్నట్లయితే.. కోర్టు వరకూ కూడా వెళ్లేందుకు అవకాశం లేకుండా పోతోంది. దీంతో పాజిటివ్ ఖైదీలు తప్పనిసరిగా 14 రోజుల క్వారంటైన్ తర్వాతనే పోలీసులు రిమాండ్ చేస్తున్నారు. అప్పటి వరకూ గాంధీ ఆస్పత్రి లేదా కింగ్ కోఠి ఆస్పత్రుల్లో క్వారంటైన్‌లో ఉంచుతున్నారు.

నెగిటివ్ ఉంటేనే ఎంట్రీ..

కోవిడ్ సెకండ్ వేవ్ నడుస్తున్న నేపథ్యంలో కోవిడ్ నిబంధనలను జైళ్ల శాఖ అమలు చేస్తోంది. ఈ ప్రక్రియలో భాగంగా కోర్టు ద్వారా జైళ్లకు తరలించే రిమాండ్ ఖైదీలకు కరోనా పాజిటివ్ ఉందా?.. లేదా? అనే విషయాన్ని జైలు ప్రధాన గేటు వద్దనే తనిఖీలు చేస్తున్నారు. రిమాండ్ ఖైదీకి కరోనా నెగిటివ్ ఉంటేనే జైళ్లలోకి అనుమతిస్తున్నారు. జైలు ప్రధాన గేటు వద్ద కోవిడ్ నిబంధనలను పాటిస్తున్నారు. ఇదిలా ఉండగా.. కోర్టు వద్దనే ఖైదీలకు సంబంధించిన కోవిడ్ టెస్టు నెగిటివ్ రిపోర్టు అడుగుతున్నారు. దీంతో రిమాండ్ చేసే ముందే పోలీసులు కోవిడ్ టెస్టులు చేయిస్తున్నారు. ఒకవేళ రిమాండ్ చేయాల్సిన ఖైదీలకు పాజిటివ్ వచ్చినట్లయితే.. గాంధీ లేదా కింగ్ కోఠి ఆస్పత్రుల్లో క్వారంటైన్ ఉంచుతున్నారు. వీరి క్వారంటైన్ పీరియడ్ 14 రోజులు పూర్తయ్యే వరకూ పోలీసులే వారి భద్రతా ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. క్వారంటైన్ అనంతరమే తిరిగి కోర్టుకు రిమాండ్ చేయగా.. అక్కడి నుంచి జైళ్లకు తరలించాల్సిన పరిస్థితులు నెలకొంటున్నాయి.

జైళ్లల్లో ప్రత్యేక బారక్‌లు..

కోవిడ్ కారణంగా ప్రజలు ఏడాది కాలంగా అనేక జాగ్రత్తలు పాటిస్తున్న నేపథ్యంలో కోర్టు ద్వారా పలు రకాల శిక్షలు అనుభవిస్తున్న ఖైదీల పరిస్థితి ప్రశ్నార్థకంగా మారింది. ఖైదీలను పెరోల్‌పై ఇళ్లకు పంపిస్తారా.. అనే చర్చకు కూడా గతేడాది కరోనా సమయంలో చర్చకు వచ్చింది. ఖైదీలను ఇళ్లకు పంపడం కంటే జైళ్లల్లోనే కోవిడ్ నిబంధనలను అమలు చేసేలా చర్యలు తీసుకోవడమే ఉత్తమంగా అధికారులు భావించారు. ఈ పరిస్థితుల్లో ఈ ఏడాది కూడా కరోనా భయబ్రాంతులకు గురి చేస్తుండటంతో జైళ్లల్లో ఖైదీలు, అధికారులు, సిబ్బంది తప్పనిసరిగా మాస్క్‌లు ధరించడం, భౌతిక దూరం పాటించడం, జైలు ఆవరణను శానిటైజ్ చేసుకోవడంతో పాటు వ్యక్తిగత పరిశుభ్రత, శానిటైజ్ అందుబాటులో ఉంచడం లాంటి ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు. ఈ క్రమంలో బయట నుంచి వచ్చే రిమాండ్ ఖైదీలు, శిక్ష పడ్డ ఖైదీలకు జైలు లోపలికి వచ్చే సమయంలో కచ్చితంగా కోవిడ్ నెగిటివ్ రిపోర్టు ఉంటేనే జైలు లోపలికి అనుమతిస్తున్నారు. లేదంటే, జైలు అధికారులు వెనక్కు తిరిగి పంపిస్తున్నారు. నెగిటివ్ రిపోర్టు ఉన్నప్పటికీ, జైలు లోపలికి కొత్తగా వెళ్లిన ఖైదీలను 14 రోజుల పాటు ప్రత్యేక బారక్‌లో ఐసోలేషన్ అయ్యేలా ముందస్తు జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నారు. ఈ మేరకు మూడ్రోజుల పాటు వచ్చిన ఖైదీలను ఒక బ్యాచ్‌గా పరిగణిస్తున్నారు. ఇలా 14 రోజుల క్వారంటైన్ పూర్తయిన పిదపనే సాధారణ గదులను కేటాయిస్తున్నారు.

ఖైదీలతో మాస్క్‌ల తయారీ..

రాష్ట్ర వ్యాప్తంగా జైళ్లల్లో సుమారు 6 వేల మంది ఖైదీలు ఉండగా.. చర్లపల్లి, చంచల్ గూడ సెంట్రల్ జైళ్లల్లో ఒక్కో జైలులో సుమారు 11 వందలకు పైగా ఖైదీలు ఉన్నారు. ప్రస్తుతం జైళ్లల్లో ఉండే ఖైదీలకు మాస్క్‌లు తప్పనిసరి కావడంతో జైళ్లల్లో ఖైదీలకు ఇచ్చే కుట్టు శిక్షణలో భాగంగా చంచల్ గూడ జైలులో ఎనిమిది మంది ఖైదీలతో మాస్క్‌లు తయారు చేయిస్తున్నట్టు జైలు అధికారులు తెలిపారు. జైలులో ఖైదీలు తప్పనిసరిగా మాస్క్‌లు ధరించేలా, ఖైదీల మధ్య భౌతిక దూరం ఉండేలా చర్యలు తీసుకుంటున్నారు. గదుల్లోనూ పలు జాగ్రత్తలు పాటిస్తున్నారు. అందుకు అధికారులు, సిబ్బంది జైలు గదులను, ఆవరణలోనూ నిరంతరం పర్యవేక్షణ చేస్తున్నారు. ఖైదీలకు నిరంతరం శానిటైజర్ అందుబాటులో ఉండేలా, ఖైదీల గదులు, ఆవరణలో స్ప్రే చల్లిస్తున్నారు. గేటు లోపలకు ఎంటర్ కాగానే హ్యాండ్ వాష్ చేసుకోవడానికి వీలుగా ఏర్పాట్లు చేసినట్టు అధికారులు చెబుతున్నారు.

Tags:    

Similar News