ప్రభుత్వానికి, ఉద్యోగ సంఘాలకు ఉద్యోగులు షాక్!!

దిశ, తెలంగాణ బ్యూరో : మండలి ఎన్నికల్లో రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగవర్గాలే కీలకంగా మారాయి. పీఆర్సీ విషయంలో ప్రభుత్వం నిర్లక్ష్యం చేయడంతో ఉద్యోగ వర్గాల్లో వ్యతిరేకత వెల్లువెత్తిన విషయం తెలిసిందే. పీఆర్సీ అంశం ప్రభుత్వంతో ఉద్యోగులను దూరం చేసింది. ఈ నేపథ్యంలో జరుగుతున్న మండలి పోరులో వారి ఓట్లను తమవైపు తిప్పుకునేందుకు అధికార పార్టీ ఎత్తులు వేస్తోంది. దీనికోసం ఉద్యోగ సంఘాలను రంగంలోకి దింపుతున్నాయి. ఉద్యోగులను ఒప్పించడమెలా…? అధికార పార్టీకి మద్దతు అంటేనే కిందిస్థాయి ఉద్యోగ వర్గాలు […]

Update: 2021-02-26 14:00 GMT

దిశ, తెలంగాణ బ్యూరో : మండలి ఎన్నికల్లో రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగవర్గాలే కీలకంగా మారాయి. పీఆర్సీ విషయంలో ప్రభుత్వం నిర్లక్ష్యం చేయడంతో ఉద్యోగ వర్గాల్లో వ్యతిరేకత వెల్లువెత్తిన విషయం తెలిసిందే. పీఆర్సీ అంశం ప్రభుత్వంతో ఉద్యోగులను దూరం చేసింది. ఈ నేపథ్యంలో జరుగుతున్న మండలి పోరులో వారి ఓట్లను తమవైపు తిప్పుకునేందుకు అధికార పార్టీ ఎత్తులు వేస్తోంది. దీనికోసం ఉద్యోగ సంఘాలను రంగంలోకి దింపుతున్నాయి.

ఉద్యోగులను ఒప్పించడమెలా…?

అధికార పార్టీకి మద్దతు అంటేనే కిందిస్థాయి ఉద్యోగ వర్గాలు భగ్గుమంటున్నాయి. పీఆర్సీ అంశంలో చాలా మోసం చేశారని, ఏండ్ల నుంచి ఎప్పుడూ లేని విధంగా కేవలం 7.5 శాతం ఫిట్​మెంట్​ను సూచించడంలో ప్రభుత్వ పాత్ర ఉందంటూ విమర్శిస్తున్నారు. త్రిసభ్య కమిటీతో చర్చలు జరిపి, నెలాఖరులోగా కనీసం 30 శాతం ఫిట్​మెంట్​ ప్రకటిస్తారని ఆశపడినా నిరాశే మిగిలింది. ఈ సమయంలోనే మండలి ఎన్నికలకు నోటిఫికేషన్​ విడుదలైంది. దీంతో పీఆర్సీ పక్కకుపోయింది. ఎన్నికల కమిషన్​ అనుమతితో ఫిట్​మెంట్​ ప్రకటించే అవకాశాలున్నా ప్రభుత్వం పట్టించుకోలేదు. ఫలితంగా ఉద్యోగులతో దూరం పెరిగిపోయింది. బదిలీలు, పదోన్నతులు, ఫిట్​మెంట్​ వంటి అంశాల్లో కోపంగా ఉన్న ఉద్యోగులను ఇప్పుడు టీఆర్​ఎస్​కు ఓటేయమని ఎలా అడగాలో ఉద్యోగ సంఘాలకు అంతుచిక్కడం లేదు. కొంతమేర ధైర్యం చేసి టీఆర్​ఎస్​ అభ్యర్థికి ప్రచారం తరహాలో చేద్దామంటూ అడుగు ముందుకేసే ప్రయత్నాలు కొన్నిచోట్ల చేశారు. కానీ ఉద్యోగులు టీఆర్​ఎస్​ పేరుత్తుతేనే భగ్గుమన్నారు. టీఆర్​ఎస్​కు ఓటేసేది లేదని తేల్చి చెప్పారు. ఉద్యోగ సంఘాలు ఓటేయమంటే తిరుగుబాటు తప్పదంటూ హెచ్చరించారు. దీంతో ఉద్యోగ సంఘాలు ఈ విషయంలో వెనక్కి తగ్గుతున్నాయి.

పెద్దసారును మెప్పించడమెలా..?

ఓ వైపు ఉద్యోగులు ఇలా వ్యతిరేకంగా విరుచుకుపడుతుంటే… గులాబీ బాస్​ మాత్రం ఉద్యోగ సంఘాలపై గురుతరమైన బాధ్యతలు పెట్టారు. మండలి ఎన్నికల్లో పార్టీ అభ్యర్థుల గెలుపులో ఉద్యోగులే కీలకపాత్ర పోషించాలంటూ సంఘాల నేతలకు సూచించారు. ఇటీవల పలువురు నేతలతో ఫోన్లో మాట్లాడటమే కాకుండా మంత్రి శ్రీనివాస్​గౌడ్​ ఇంటి దగ్గర ఉద్యోగ సంఘాల నేతలతో సీఎం మాట్లాడినట్లు తెలుస్తోంది. ఇంకా పలు ఉద్యోగ సంఘాలు, ఉపాధ్యాయ సంఘాల నేతలతో కూడా సీఎం ​ పర్సనల్​గా మాట్లాడినట్లు ఉద్యోగులు చెబుతున్నారు. స్వయంగా సీఎం చెప్పడంతో ధైర్యం చేసిన కొంతమంది ఉద్యోగ సంఘాల నేతలు జిల్లాలకు తరిలారు. ఉమ్మడి నల్గొండ, ఖమ్మం, వరంగల్​, మహబూబ్​నగర్​ జిల్లాల్లో పలుమార్లు ఏదో కారణాలతో ఉద్యోగ సంఘాల నేతలు సమావేశాలు ఏర్పాటు చేస్తున్నారు. కానీ ఉద్యోగుల నుంచి ఫిట్​మెంట్​ విషయంలో చాలా కోపం వస్తుండటం, టీఆర్​ఎస్​ను తీవ్రస్థాయిలో వ్యతిరేకిస్తుండటంతో సంఘాల నేతలు తల పట్టుకుంటున్నారు. విషయంలో సీఎం​కు ఎలా వివరించాలో తెలియక ఇబ్బంది పడుతున్నారు.

ఉపాధ్యాయ సంఘాల్లో మరీ ఘోరం

ఉపాధ్యాయులు మరింత మండిపడుతున్నారు. మండలిలో సత్తా చూపిస్తామంటూ బహిరంగంగానే చెబుతున్నారు. టీఆర్​ఎస్ తరఫున టెలీ కాలర్స్​ ఫోన్లు చేస్తే చాలు ఎదురుప్రశ్నలతో చెమటలు పట్టిస్తున్నారు. కాగా, కొన్ని ఉపాధ్యాయ సంఘాలు మాత్రం టీఆర్​ఎస్​కు అనుకూలంగా చెప్పేందుకు ప్రయత్నాలు చేయగా నేరుగానే వ్యతిరేకించారు. టీఆర్​ఎస్​కు మద్దతు కోసం చెప్పాలని భావించిన తొలిసారే ఎదురు ప్రశ్నలు రావడంతో ఆ ప్రయత్నాలు మానుకున్నారు. కానీ ప్రగతిభవన్​ నుంచి, పార్టీ పెద్దల నుంచి ఇంకా సంఘాల నేతలకు ఫోన్ల తాకిడి పెరుగుతూనే ఉంది. సమాధానం చెప్పలేక ఉపాధ్యాయ సంఘాల నేతల నుంచి తప్పించుకునేందుకు అష్టకష్టాలు పడుతున్నారు.

Tags:    

Similar News