కేసీఆర్, కేటీఆర్, మంత్రులకు ఈసీ నోటీసులు
దిశ, తెలంగాణ బ్యూరో: ఎన్నికల సంఘం నోటీసులు ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి. మండలి ఎన్నికల్లో ఉద్యోగ సంఘాలు టీఆర్‌ఎస్‌కు మద్దతు ప్రకటించి ప్రచారం సైతం చేశాయి. ప్రధానంగా ఈ నెల 10న ఉద్యోగ సంఘాల నేతలు సీఎం కేసీఆర్‌తో సమావేశమైన అంశంపై ఫిర్యాదులు వెళ్లాయి. కాంగ్రెస్, బీజేపీ నేతలు ఉద్యోగ సంఘాలు, సీఎం, మంత్రులపై ఈసీకి ఫిర్యాదు చేశారు. దీంతో కొంత ఆలస్యంగానైనా ఎన్నికల కమిషన్ ఉద్యోగ సంఘాలకు నోటీసులు జారీ చేశాయి. ఉద్యోగ సంఘాల నేతలతో […]
దిశ, తెలంగాణ బ్యూరో: ఎన్నికల సంఘం నోటీసులు ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి. మండలి ఎన్నికల్లో ఉద్యోగ సంఘాలు టీఆర్‌ఎస్‌కు మద్దతు ప్రకటించి ప్రచారం సైతం చేశాయి. ప్రధానంగా ఈ నెల 10న ఉద్యోగ సంఘాల నేతలు సీఎం కేసీఆర్‌తో సమావేశమైన అంశంపై ఫిర్యాదులు వెళ్లాయి. కాంగ్రెస్, బీజేపీ నేతలు ఉద్యోగ సంఘాలు, సీఎం, మంత్రులపై ఈసీకి ఫిర్యాదు చేశారు. దీంతో కొంత ఆలస్యంగానైనా ఎన్నికల కమిషన్ ఉద్యోగ సంఘాలకు నోటీసులు జారీ చేశాయి. ఉద్యోగ సంఘాల నేతలతో పాటుగా సీఎం కేసీఆర్, మంత్రులు కేటీఆర్, హరీశ్‌రావు, శ్రీనివాస్‌గౌడ్, మహమూద్ అలీ, గంగుల కమలాకర్, నిరంజన్‌రెడ్డి, జగదీశ్‌రెడ్డి, సబితా ఇంద్రారెడ్డి, దయాకర్‌రావు, సత్యవతి రాథోడ్, మల్లారెడ్డికి ఈసీ నుంచి నోటీసులు జారీ అయ్యాయి. 24 గంటల్లో సమాధానం చెప్పాలని నోటీసుల్లో పేర్కొనడంతో మంగళవారం ఉద్యోగ సంఘాల తరపున సమాధాన లేఖలు పంపించారు.
మేం ఓట్లు అడుగలేదు
ఉద్యోగ సంఘాలు ఈసీ లేఖలకు ఎక్కడా చిక్కకుండా సమాధానం ఇస్తున్నాయి. టీఎన్జీఓ అధ్యక్షుడు మామిళ్ల రాజేందర్, మాజీ అధ్యక్షుడు కారం రవీందర్‌రెడ్డి, టీజీఓ అధ్యక్ష, కార్యదర్శులు మమత, ఏనుగుల సత్యనారాయణ, సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు నరేందర్‌రావు, పీఆర్‌టీయూ అధ్యక్ష, కార్యదర్శులు శ్రీపాల్, కమలాకర్‌రావు నుంచి రిప్లై ఇస్తున్నారు. పీఆర్సీ అంశం డిసెంబర్ నుంచి కొనసాగుతుందని, ఇది ఇప్పుడు కొత్తగా తీసుకున్న నిర్ణయం కాదంటూ ఉద్యోగ నేతలు సమాధానం ఇస్తున్నారు. దీనిపై సీఎం కేసీఆర్‌ను గతంలోనూ కలిశామని, ఇప్పుడు ఆలస్యం అవుతుందనే కారణంగా మళ్లీ కలిశామని, పీఆర్సీపై చర్చించామని, దీంతో ఎన్నికల కోడ్ కారణంగా తర్వాత ప్రకటిస్తామని సీఎం హామీ ఇచ్చారని వివరించారు.
తమంతట తాముగా ఈ విషయాన్ని ఎక్కడా లీక్ చేయలేదని, సీఎం కేసీఆర్‌ను కలిసిన తర్వాత వస్తున్న క్రమంలో మీడియా అడిగితేనే సమాధానమిచ్చామంటూ రిప్లై లేఖల్లో పేర్కొన్నారు. మండలి ఎన్నికల్లో ఉద్యోగులు, పట్టభద్రులను ఓట్లు అడగలేదని, ఫలానా పార్టీకి, అభ్యర్థికి ఓటేయమని ఎక్కడా చెప్పలేదంటూ సమాధానం ఇచ్చారు. ఓట్ల విషయమే రాలేదని, పీఆర్సీ అంశం మాత్రమే చెప్పామని, ఇది కొత్తది కాదంటూ ఉద్యోగ సంఘాలు ఈసీకి రిప్లై ఇచ్చాయి. ఓట్లు వేయమని అభ్యర్థించ లేదని, కోడ్‌ఉల్లంఘన చేయలేదంటూ లేఖల్లో పేర్కొన్నారు.
సీఎం సహా మంత్రులకు నోటీసులు
మరోవైపు ఎన్నికల కమిషన్ సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్‌తో సహా 12 మందికి షోకాజ్ నోటీసులు జారీ చేసింది. ఉద్యోగులను ప్రభావితం చేసే విధంగా మాట్లాడారని, ఓటర్లను ప్రలోభాలకు గురి చేసే అంశాలను వ్యాఖ్యానించారంటూ నోటీసుల్లో ప్రశ్నించింది. ఉద్యోగాల భర్తీ, కొత్త ఉద్యోగాల కల్పన వంటి అంశాలపై మంత్రులను ప్రశ్నించింది. ఇది కోడ్ ఉల్లంఘన కిందకే వస్తుందంటూ నోటీసుల్లో పేర్కొంది. మరోవైపు మంత్రి శ్రీనివాస్‌గౌడ్ వ్యాఖ్యలపై కూడా నోటీసులిచ్చింది. ఓటేయకుంటే నాశనమవుతారనే అంశాలను ప్రస్తావించింది. మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఉపాధ్యాయ సంఘాలతో సమావేశం, విద్యాసంస్థలతో మీటింగ్ వంటి కార్యక్రమాలపై నోటీసుల్లో పేర్కొంది.
మంత్రి కేటీఆర్‌ను ఉద్యోగాల భర్తీతో పాటు ఉపాధ్యాయ సంఘాలతో సమావేశాన్ని ఈసీ తప్పు బట్టింది. ఉద్యోగ నేతలతో సమావేశంపై సీఎం కేసీఆర్‌కు నోటీసులిచ్చింది. ఇలా మొత్తం 12 మంది మంత్రులకు నోటీసులిచ్చింది. దీనిపై 24 గంటల్లోనే సమాధానం చెప్పాలని పేర్కొంది. అయితే గతంలో స్థానిక సంస్థలు, అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా ఈసీ నోటీసులు వచ్చిన విషయం తెలిసిందే. కానీ మండలి ఎన్నికల సమయంలో సీఎం సహా మంత్రులు, ప్రభుత్వ ఉద్యోగ సంఘాల నేతలకు షోకాజ్ నోటీసులు జారీ కావడం కొంత మేరకు షాక్‌గానే భావిస్తున్నారు. కానీ సమాధానం కూడా ఎక్కడా చిక్కకుండానే ఇస్తున్నారు.