భార్యల తరఫున భర్తలొస్తే ఒప్పుకోం..
దిశ, తెలంగాణ బ్యూరో : ప్రజా ప్రతినిధులుగా ఎన్నికైన మహిళల స్థానంలో వారి భర్తలు లేదా కుటుంబ సభ్యులు అధికారిక సమావేశాలకు హాజరైతే సహించబోమని, నిబంధనలకు విరుద్ధంగా జరిగే ఇలాంటి చర్యలపై కఠినంగా వ్యవహరిస్తామని పంచాయతీరాజ్ కమిషనర్ హెచ్చరించారు. అలాంటి సమావేశాలను నిర్వహించే సమయంలో పంచాయతీరాజ్ అధికారులు, జిల్లా కలెక్టర్లు ప్రత్యేక దృష్టి పెట్టాలని, లోపాలు జరిగేతే బాధ్యత నిర్వహించాల్సి వస్తుందని హెచ్చరించారు. ఫోరమ్ ఫర్ గుడ్ గవర్నెన్స్ తరఫున గతేడాది గవర్నర్‌కు అందిన ఫిర్యాదును దృష్టిలో […]
దిశ, తెలంగాణ బ్యూరో : ప్రజా ప్రతినిధులుగా ఎన్నికైన మహిళల స్థానంలో వారి భర్తలు లేదా కుటుంబ సభ్యులు అధికారిక సమావేశాలకు హాజరైతే సహించబోమని, నిబంధనలకు విరుద్ధంగా జరిగే ఇలాంటి చర్యలపై కఠినంగా వ్యవహరిస్తామని పంచాయతీరాజ్ కమిషనర్ హెచ్చరించారు. అలాంటి సమావేశాలను నిర్వహించే సమయంలో పంచాయతీరాజ్ అధికారులు, జిల్లా కలెక్టర్లు ప్రత్యేక దృష్టి పెట్టాలని, లోపాలు జరిగేతే బాధ్యత నిర్వహించాల్సి వస్తుందని హెచ్చరించారు. ఫోరమ్ ఫర్ గుడ్ గవర్నెన్స్ తరఫున గతేడాది గవర్నర్‌కు అందిన ఫిర్యాదును దృష్టిలో పెట్టుకుని రాజ్‌భవన్ సమాచారం మేరకు పంచాయతీరాజ్ కమిషనర్ రఘునందన్ రావు ఈ సర్క్యులర్ జారీ చేశారు.
ఇటీవల కొన్ని అధికారిక సమావేశాల్లో మహిళా ప్రజా ప్రతినిధులు ఉన్నప్పటికీ వారి పక్కనే భర్తలు లేదా కుటుంబ సభ్యులు పాల్గొంటున్నట్లు వార్తలు వచ్చాయి. జిల్ల అధికార యంత్రాంగానికి కూడా ఈ విషయం తెలుసు. అయినా చూసీ చూడనట్లు వ్యవహరిస్తున్నారు. గ్రామ పంచాయతి సమావేశాల మొదలు మండల ప్రజా పరిషత్, జిల్లా ప్రజా పరిషత్ వరకు సమావేశాల్లో పాల్గొనడం, విధానపరమైన నిర్ణయాల ప్రక్రియలో మహిళా ప్రజా ప్రతినిధుల కంటే వారి భర్తలు, కుటుంబ సభ్యులే క్రియాశీలకంగా పాల్గొంటున్నారని కమిషనర్ ఆ లేఖలో ప్రస్తావించారు.
ఇకపైన ఎలాంటి అధికారిక సమావేశాల్లో ఈ లోపాలు జరగకూడదని, వాటిని ఉపేక్షించవద్దని తాజాగా జారీ చేసిన సర్క్యులర్‌లో జిల్లా కలెక్టర్లను, జిల్లా పంచాయతీ అధికారులను కమిషనర్ స్పష్టంచేశారు. ఒకవేళ అలాంటి ఉల్లంఘనలు జరిగినట్లయితే సీసీఏ నిబంధనల ప్రకారం సంబంధిత అధికారులు, ప్రభుత్వ సిబ్బందిపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. నిబంధనలకు విరుద్ధంగా పాల్గొన్న వ్యక్తులపై తెలంగాణ రాష్ట్ర పంచాయతీరాజ్ చట్టంలోని సెక్షన్ 37(5) ప్రకారం చర్యలు తీసుకుంటామని, క్రిమినల్ విచారణకు ఆదేశిస్తామని స్పష్టం చేశారు.