ఫలించిన ఈటల వ్యూహం.. బీజేపీ గూటికి టీఆర్ఎస్ నేతలు!
దిశ, తెలంగాణ బ్యూరో : అధికార పార్టీ అసంతృప్తి నేతలపై బీజేపీ కన్నేసింది. మాజీ మంత్రి ఈటల రాజేందర్ నేతృత్వంలో ఉద్యమకారులను ఒక్కతాటిపైకి తీసుకువచ్చే ప్రయత్నాలు మొదలయ్యాయి. దీనిలో భాగంగా బీజేపీ ఆపరేషన్ ఆకర్ష్ మొదలైంది. తెలంగాణ ఉద్యమంలో ముందు నిలిచిన వారిలో ఇప్పుడు ఎలాంటి ప్రాధాన్యత లేకుండా తిరుగుతున్న నేతలను కాషాయ దళంలోకి తీసుకునేందుకు భారీ ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలోనే తెలంగాణ ఉద్యోగుల జేఏసీ నేతలు టీఆర్ఎస్ను వీడేందుకు సిద్ధమవుతున్నారు. ఇప్పటికే స్వామిగౌడ్ బీజేపీలో […]
దిశ, తెలంగాణ బ్యూరో : అధికార పార్టీ అసంతృప్తి నేతలపై బీజేపీ కన్నేసింది. మాజీ మంత్రి ఈటల రాజేందర్ నేతృత్వంలో ఉద్యమకారులను ఒక్కతాటిపైకి తీసుకువచ్చే ప్రయత్నాలు మొదలయ్యాయి. దీనిలో భాగంగా బీజేపీ ఆపరేషన్ ఆకర్ష్ మొదలైంది. తెలంగాణ ఉద్యమంలో ముందు నిలిచిన వారిలో ఇప్పుడు ఎలాంటి ప్రాధాన్యత లేకుండా తిరుగుతున్న నేతలను కాషాయ దళంలోకి తీసుకునేందుకు భారీ ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలోనే తెలంగాణ ఉద్యోగుల జేఏసీ నేతలు టీఆర్ఎస్ను వీడేందుకు సిద్ధమవుతున్నారు.
ఇప్పటికే స్వామిగౌడ్ బీజేపీలో చేరగా.. తాజాగా మరో ఉద్యోగ నేత కూడా కాషాయం కండువా కప్పుకోనున్నారు. టీఎస్పీఎస్సీ మాజీ సభ్యుడు సీ.విఠల్ ఈ వారం రోజుల వ్యవధిలోనే పార్టీలో చేరేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ప్రస్తుతం విఠల్ బీజేపీలో చేరుతుండగా.. వచ్చే కొద్ది రోజుల్లో మరికొంతమంది ఉద్యోగ జేఏసీ నేతలు కూడా బీజేపీ తీర్థం పుచ్చుకోనున్నారు. అలాంటి వారితో ఈటల రాజేందర్ బృందం చర్చలు సాగిస్తోంది.
ఏండ్లుగా అసంతృప్తి
తెలంగాణ ఉద్యోగుల జేఏసీని ముందుండి నడిపించిన నేతలకు ప్రస్తుతం అధికార పార్టీలో ప్రాధాన్యత కరువైంది. ఒకరిద్దరు మినహా.. చాలా మంది నేతలు ప్రభుత్వం నుంచి ఏదో ఒకటి ఆశించినా.. వారికి ప్రగతిభవన్ గేటు దాటి ఎంట్రీ రావడం లేదు. ఏండ్ల నుంచి అధిష్టానానికి మొర పెట్టుకుంటున్నా కనీసం అపాయింట్మెంట్ కూడా దక్కడం లేదు. ఈ నేపథ్యంలో ప్రత్యామ్నాయ రాజకీయ పరిస్థితుల కోసం ఎదురుచూస్తున్నారు. గతంలో టీఎన్జీఓ అధ్యక్షుడిగా, జేఏసీ చైర్మన్‌గా వ్యవహరించిన స్వామిగౌడ్ బీజేపీలో చేరిన విషయం తెలిసిందే. తాజాగా అదే దారిలో విఠల్ కూడా చేరిపోయారు. వాస్తవానికి తెలంగాణ ఉద్యమానికి పునాదులుగా నిలిచిన జేఏసీ నేతలు ఇప్పుడు ఎలాంటి ప్రాధాన్యత లేకుండా ఖాళీగా ఉన్నారు. బేవరేజెస్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ దేవీ ప్రసాద్, టీఎస్పీఎస్సీ మాజీ సభ్యుడు విఠల్ తో పాటుగా పలువురు ఉద్యమ నేతలు ప్రస్తుతం అసంతృప్తితో ఉన్నట్లు తెలుస్తోంది. ఈ అసంతృప్తిని అనుకూలంగా మల్చుకునేందుకు బీజేపీ చక్రం తిప్పుతోంది.
ఎవరెవరు ఉన్నారు..?
ప్రస్తుతం విఠల్ చేరిక ఖరారైంది. ఈ వారం రోజుల వ్యవధిలో ఢిల్లీలో ఆయన బీజేపీ గూటికి చేరనున్నారు. ఇదే వరుసలో మరో ఇద్దరు జేఏసీ నేతలు కూడా ఉన్నట్లు సమాచారం. ఉద్యోగ జేఏసీ నేత, ఓ కార్పొరేషన్ మాజీ చైర్మన్‌తో పాటుగా మెడికల్ జేఏసీకి చెందిన కీలక నేత కూడా బీజేపీకి టచ్‌లో ఉన్నట్లు తెలుస్తోంది. వీరితో పాటుగా కరీంనగర్ జిల్లాకు చెందిన ఓ మాజీ ఎమ్మెల్సీ, ఉద్యోగ సంఘం మాజీ నేత కూడా ఈటల రాజేందర్‌తో చర్చించినట్లు ప్రచారం జరుగుతోంది. ఇలాంటి నేతలను అధికార పార్టీకి దూరం చేస్తే ఉద్యమకారులకు ప్రాధాన్యత లేదనే అంశాన్ని క్షేత్రస్థాయికి తీసుకెళ్లే అవకాశం ఉంటుందని, దీంతో బీజేపీకి కలిసిరావడమే కాకుండా.. టీఆర్ఎస్ను దెబ్బకొట్టినట్లు ఉంటుందని భావిస్తున్నారు.
వారం రోజుల్లో చేరుతా : విఠల్
బీజేపీలో చేరుతున్నారనే ప్రచారం నేపథ్యంలో విఠల్ ఈ సందర్భంగా ‘దిశ’తో మాట్లాడారు. తాను బీజేపీలో చేరుతున్నానని, వారం రోజుల్లో ఢిల్లీలో సీనియర్ నేతల సమక్షంలో చేరుతున్నట్లు వెల్లడించారు. తెలంగాణ ఉద్యమం కోసం త్యాగాలు చేసిన ఉద్యమకారులను గుర్తించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.