ఆ విద్యార్థులను చేర్చుకుంటే లక్ష జరిమానా.. కేంద్రం కొత్త మార్గదర్శకాలు..
కేంద్ర విద్యా మంత్రిత్వ శాఖ కోచింగ్ ఇన్‌స్టిట్యూట్‌ల కోసం కొత్త మార్గదర్శకాలను విడుదల చేసింది.
దిశ, ఫీచర్స్ : కేంద్ర విద్యా మంత్రిత్వ శాఖ కోచింగ్ ఇన్‌స్టిట్యూట్‌ల కోసం కొత్త మార్గదర్శకాలను విడుదల చేసింది. కోచింగ్ ఇన్‌స్టిట్యూట్‌లలో 16 ఏళ్లలోపు విద్యార్థులను చేర్చుకోకూడదని తేల్చిచెప్పింది. ప్రయివేటు కోచింగ్ ఇన్‌స్టిట్యూట్‌లను నియంత్రించడానికి ఈ మార్గదర్శకాలు తీసుకొచ్చారని తెలిపింది. విద్యార్థుల పై పెరుగుతున్న ఒత్తిడి, వారు అవలంబిస్తున్న బోధనా పద్ధతుల పై ప్రభుత్వానికి వచ్చిన ఫిర్యాదుల మేరకు మంత్రిత్వ శాఖ ఈ మార్గదర్శకాలను జారీ చేసినట్లు పేర్కొంది. ఏ కోచింగ్ ఇన్‌స్టిట్యూట్ కూడా గ్రాడ్యుయేషన్ కంటే తక్కువ విద్యార్హత ఉన్న ఉపాధ్యాయులను నియమించకూడదని మార్గదర్శకాల్లో పేర్కొంది. కోచింగ్ ఇన్‌స్టిట్యూట్ లలో విద్యార్థులను చేర్చుకోవడానికి తల్లిదండ్రులను తప్పుదోవ పట్టించే వాగ్దానాలు, ఎక్కువ మార్కులు వస్తాయని నమ్మించే ప్రయత్నాలు చేయకూడదని మార్గదర్శకాల్లో తెలిపింది.
పాఠశాల స్థాయి విద్యాభ్యాసం పూర్తయి, 16 పై బడిన వారిని మాత్రమే కోచింగ్ సెంటర్ లలో చేర్పించుకోవాలని తెలిపింది. కోచింగ్ సెంటర్ లలో అధిక ఫీజులు కాకుండా న్యాయబద్దంగా ఉండాలని, రశీదులను పారదర్శకంగా ఉంచాలని తెలిపింది. కోర్స్ మధ్యలో కోచింగ్ ఆపే విద్యార్థులకు ఫీజు రీఫండ్ ఇవ్వాలని తెలిపింది. కోచింగ్ ఇన్‌స్టిట్యూట్ లలో అన్ని సౌకర్యాలు ఉండాలని తెలిపారు. కోచింగ్ ఇన్‌స్టిట్యూట్‌లకు వెబ్‌సైట్ లో అందులో ఉపాధ్యాయులు (ట్యూటర్లు) బోధన అర్హతలు, కోర్సు/సిలబస్, పూర్తి చేసిన వ్యవధి, హాస్టల్ సౌకర్యాలు, వసూలు చేసిన ఫీజుల వివరాలు ఉండాలని తెలిపారు.
లక్ష వరకు జరిమానా..
మార్గదర్శకాలను ఉల్లంఘించిన కోచింగ్ ఇన్‌స్టిట్యూట్‌లకు రూ.లక్ష వరకు జరిమానా విధించాలని లేదా అధిక ఫీజులు వసూలు చేస్తే వాటి రిజిస్ట్రేషన్‌ను రద్దు చేయాలని కేంద్రం సూచించింది. కోచింగ్ ఇన్‌స్టిట్యూట్‌ల పై సరైన పర్యవేక్షణ కోసం, మార్గదర్శకాలు అమల్లోకి వచ్చిన మూడు నెలల్లో కొత్త, ఇప్పటికే ఉన్న కోచింగ్ ఇన్‌స్టిట్యూట్‌లను నమోదు చేయాలని ప్రభుత్వం ప్రతిపాదించింది. మార్గదర్శకాల ప్రకారం, కోచింగ్ ఇన్‌స్టిట్యూట్ కార్యకలాపాలను పర్యవేక్షించే బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానిదే అని తేల్చి చెప్పింది.