పీఎం యశస్వి పథకం పేద విద్యార్థులకు అద్భుత వరం
పేదరికం వల్ల ఉన్నత విద్యను అభ్యసించాలనుకున్న ఆర్థిక ఇబ్బందుల వల్ల చాలా మంది చదువును మధ్యలోనే ఆపేస్తున్నారు.
దిశ, వెబ్ డెస్క్:పేదరికం వల్ల ఉన్నత విద్యను అభ్యసించాలనుకున్న ఆర్థిక ఇబ్బందుల వల్ల చాలా మంది చదువును మధ్యలోనే ఆపేస్తున్నారు. అలాంటి వారికి అండగా నిలవడానికి కేంద్ర ప్రభుత్వం అద్భుతమైన స్కీంను తీసుకొచ్చింది. అదే పీఎం యశస్వి పథకం. ఈ స్కాలర్‌షిప్ పథకం కింద 9, 11, 12వ తరగతి విద్యార్థులకు కేంద్ర ప్రభుత్వం రూ.75 వేల నుంచి రూ.1.50 లక్షల వరకు ఆర్థిక సహాయం అందజేస్తుంది. దీంతో పాటు విద్యార్థులకు ఉచితంగా భోజన ఏర్పాట్లు చేయనున్నారు. ఈ పథకం కింద గ్రామంలోని రైతులు, నిరుపేదలు, అణగారిన కుటుంబాలకు విద్యా జ్యోతిని తీసుకెళ్లేందుకు కృషి చేస్తున్నారు. అయితే తల్లిదండ్రుల వార్షిక ఆదాయం రూ. 2.5 లక్షల కంటే తక్కువ ఉన్న విద్యార్థులు మాత్రమే ఈ పథకం ప్రయోజనాన్ని పొందవచ్చు. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఈ పరీక్షను ఇంగ్లీష్, హిందీ మీడియంలో నిర్వహిస్తుంది. కాగా 2023 ఏడాదికి గాను ఎన్టీఏ నోటిఫికేషన్ విడుదల చేసింది. దరఖాస్తు, అర్హత తదితర వివరాల కోసం https:/yet.nta.ac.in/ వెబ్ సైట్ ను సంప్రదించవచ్చు.
పీఎం యశస్వి స్కీంకు అర్హత
ఈ పథకం ప్రయోజనాన్ని పొందడానికి విద్యార్థి తప్పనిసరిగా భారతదేశానికి చెందినవారై ఉండాలి. తల్లిదండ్రుల వార్షిక ఆదాయం రూ.రెండున్నర లక్షలకు మించరాదు. ప్రవేశ పరీక్షలో అర్హత సాధించిన విద్యార్థులకు మాత్రమే ఈ ప్రయోజనం ఉంటుంది. స్కాలర్‌షిప్ నేరుగా బ్యాంక్ ఖాతాకు బదిలీ చేయబడుతుంది. ప్రవేశ పరీక్షలో అర్హత సాధించిన తర్వాత, స్కాలర్‌షిప్ కోసం మళ్లీ ఫారమ్ నింపాలి. ఈ సమయంలో బ్యాంక్ పాస్‌బుక్ ఫోటోకాపీని జతచేయడం మర్చిపోవద్దు.
ఎగ్జామ్ సిలబస్ ఇదే
పీఎం యశస్వి పరీక్షను దేశవ్యాప్తంగా హిందీ, ఇంగ్లీష్ భాషల్లో నిర్వహిస్తున్నారు. పరీక్ష రెండు గంటల పాటు ఉంటుంది. గణితం 30, సైన్స్, 25, సోషల్ 20, జనరల్ నాలెడ్జ్ కు 20 మార్కుల చొప్పున మొత్తం 100 మార్కులకు పరీక్ష ఉంటుంది. ఆబ్జెక్టివ్ రూపంలో ఉండే ఈ పరీక్షలో ఒక్కో ప్రశ్నకు ఒక్కో మార్కు కేటాయిస్తారు. ఇక ఎలాంటి నెగటివ్ మార్కులు లేవు.
పీఎం యశస్వి స్కాలర్ షిప్ దరఖాస్తు విధానం
- PM యశస్వి స్కాలర్‌షిప్ యోజన కోసం ముందుగా Department Of Social Justice & Empowerment అధికారిక వెబ్‌సైట్‌కి వెళ్లండి.
- హోమ్‌పేజీకి వెళ్లి PM Young Achievers Scholarship Award Scheme లింక్‌పై క్లిక్ చేయండి.
- మొదట రిజిస్ట్రేషన్ చేసుకోవాలి.
- రిజిస్ట్రేషన్ నంబర్, పాస్‌వర్డ్ SMS ద్వారా మీ ఫోన్‌కు పంపబడుతుంది.
- ఆ తర్వాత దరఖాస్తు ఫారమ్‌ను పూర్తిగా పూరించండి.
- అడిగిన అన్ని సర్టిఫికెట్లను స్కాన్ చేసి అప్‌లోడ్ చేయండి.
- మీ దరఖాస్తు ఫారమ్ ఆమోదించబడుతుంది.