టీఎస్ ఎంసెట్ ఫలితాలు విడుదల
లక్షలాది మంది విద్యార్థుల ఎంతో ఉత్కంఠగా ఎదురుచూస్తున్న తెలంగాణ ఎంసెట్ ఫలితాలు ఇవాళ విడుదల అయ్యాయి.
దిశ, వెబ్ డెస్క్: లక్షలాది మంది విద్యార్థుల ఎంతో ఉత్కంఠగా ఎదురుచూస్తున్న తెలంగాణ ఎంసెట్ ఫలితాలు ఇవాళ విడుదల అయ్యాయి. హైదరాబాద్ జేఎన్టీయూ క్యాంపస్ లోని గోల్డెన్ జూబ్లీ హాల్ లో విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఈ రోజు ఉదయం 9.30 గంటలకు ఫలితాలను విడుదల చేశారు. ఇంజనీరింగ్ పరీక్షకు మొత్తం 1,95,275 మంది హాజరుకాగా 1,26,140 మంది ఉత్తీర్ణత సాధించినట్లు తెలిపారు. ఇక అగ్రికల్చర్ అండ్ మెడికల్ స్ట్రీమ్ విభాగంలో 80,575 మంది పరీక్షకు హాజరు కాగా.. 71, 180 మంది ఉత్తీర్ణత సాధించినట్లు మంత్రి తెలిపారు. ఇంజనీరింగ్ విభాగంలో 80 శాతం మంది, అగ్రికల్చర్, ఫార్మా విభాగంలో 86 శాతం మంది అర్హత సాధించినట్లు మంత్రి సబిత తెలిపారు. కౌన్సిలింగ్ కోసం త్వరలోనే తేదీలను ప్రకటిస్తామని ఆమె తెలిపారు.
ఇంజనీరింగ్, అగ్రికల్చర్, ఫార్మా విభాగాలకు సంబంధించిన పలు కోర్సుల్లో ఈ పరీక్ష ద్వారా అడ్మిషన్లు కల్పిస్తారు. ఇక రిజల్ట్స్ కోసం విద్యార్థులు eamcet.tsche.ac.in. వెబ్ సైట్ ను సంప్రదించవచ్చు. కాగా ఈ ఏడాది తెలంగాణ ఎంసెట్ (EAMCET) పరీక్షలకు మొత్తం 94.11 శాతం విద్యార్థులు హాజరయ్యారు. మొత్తం 3,20,683 దరఖాస్తులు రాగా.. వీటిలో 3,01,789 మంది విద్యార్థులు పరీక్షలు రాశారు. వీరిలో తెలంగాణ నుంచి 2,48,279 మంది దరఖాస్తు చేసుకోగా 2,35,918 మంది మాత్రమే పరీక్షకు హాజరయ్యారు. ఏపీ నుంచి 72,204 మంది దరఖాస్తు చేసుకోగా.. 65,871 మంది మాత్రమే పరీక్షలు రాశారు.
టాప్ ర్యాంకర్లు వీళ్లే
టీఎస్ ఎంసెట్ 2023 కు సంబందించి ఇంజనీరింగ్ విభాగంలో సనపాల అనిరుధ్ మొదటి ర్యాంకు సాధించాడు. ఇక యక్కంటిపని వెంకట మనీందర్ రెడ్డి 2వ ర్యాంకు, చల్లా ఉమేశ్ వరుణ్ 3వ ర్యాంకు, అభినీత్ మజేటీ 4వ ర్యాంకు, పొన్నతోట ప్రమోద్ కుమార్ రెడ్డి 5వ ర్యాంకు సాధించారు. ఇక అగ్రికల్చర్ అండ్ మెడికల్ స్ట్రీమ్ లో బారుగుపల్లి సత్యరాజ జస్వంత్ మొదటి ర్యాంకు సాధించగా.. నసిక వెంకట తేజ 2వ ర్యాంకు, సఫల్ లక్ష్మీ పసుపులటి 3వ ర్యాంకు, దుర్గెంపూడి కార్తికేయ రెడ్డి 4వ ర్యాంకు, బోర వరుణ్ చక్రవర్తి 5వ ర్యాంకు సాధించారు.