బిలియనీర్లు పెరిగితే చాలా?
లిబరలైజేషన్(L), ప్రైవేటైజేషన్(P), గ్లోబలైజేషన్ (G) అనే LPG విధానాల వలన ప్రపంచమంతా వసుదైక కుటుంబంగా

లిబరలైజేషన్(L), ప్రైవేటైజేషన్(P), గ్లోబలైజేషన్ (G) అనే LPG విధానాల వలన ప్రపంచమంతా వసుదైక కుటుంబంగా, పెట్టుబడులతో, ఉద్యోగ కల్పనతో, వస్తు ఉత్పత్తులతో, ఉపాధి గణనీయంగా పెరిగి మానవ శ్రేయస్సుతో ప్రపంచ దేశాలన్నీ అభివృద్ధి చెందిపోతాయని, ముఖ్యంగా వెనుకబడిన దేశాలు అభివృద్ధిలో పెట్టుబడిదారుల దేశాల సరసన సమానంగా అభివృద్ధి చెందుతాయని అందరూ భావించారు.. కానీ మన పాల కులు మాత్రం ప్రభుత్వ రంగంలో పరిశ్రమలు పనిచేయ డం లేదని నష్టాలలో ఉన్నాయని చెబుతూ ఎల్‌పీజీ విధానాలకు పోయారు. ఇప్పుడు ఏమైంది? ఉత్పత్తి రంగం కుదేలైంది. దీంతో అనేక వస్తువులు అమెరికా, చైనా నుంచి దిగుమతి చేసుకుంటున్నాం. దేశంలో నిరుద్యోగిత, మానవ వనరుల విధ్వంసం పెరిగింది. సహజ వన రులు పెట్టుబడిదారుల వశమైపోయాయి. వృద్ధి ప్రక్రియ అంతా పెట్టుబడిదారుల కనుసన్నల్లోకి పోయింది.
మూడో ఆర్థిక వ్యవస్థ ఎలా..?
మన దేశం విద్యా వైద్య జీవన ప్రమాణాలు రీత్యా 191 దేశాలలో 132వదిగా ఉన్నది. ఆయుష్ ప్రమాణం రీత్యా మన దేశం 134వ స్థానంలో ఉన్నది. ఆకలి ఎక్కువగా ఉన్న జనాభా గల దేశాల్లో 125 దేశాల్లో 111వ దేశం మనది. ఎల్‌పీజీ ఫలితాల వలన ఏర్పడిన దుష్పరిమాణం ఇది. ఇంత దుర్భర స్థితి దేశంలో ఉన్నా త్వరలో మూడవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా మన దేశం అభివృద్ధి చెందుతున్నదని పాలకులు ఎలా చెబుతున్నారో అర్థం కావడం లేదు. ఎల్‌పీజీ ప్రారంభించిన తొలి రోజుల్లో ఇద్దరే ఇద్దరు బిలినియర్లు ఉన్న దేశంలో నేడు 332 మంది బిలినియర్లు పెరిగినందున దేశం మూడవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ అవుతున్నదా? ప్రజల ఆదాయాలు గాని ఉద్యోగితను గాని పరిగణలోకి తీసుకొనే అవసరం లేదా? పేదలకు ఉద్యోగితను కల్పించకుండా, ఆదాయ కల్పన చేయకుండా పాలకులు ఉచిత పథకాలు ప్రవేశపెట్టి పాలన సాగిస్తున్నారు. పేదల జీవనం సాగాలంటే ఉచితాలే గతి అయినాయి. అయినా దేశం మూడవ ఆర్థిక వ్యవస్థగా ఎదుగుతుందా?
సంపద కేంద్రీకృతం కావడం..
దేశ ఆర్థిక అభివృద్ధి తిరోగమనంలో ఉన్నప్పటికీ కార్పొరేట్ వర్గాలకు చెందిన పై స్థాయి బిలియనీర్ల సంఖ్య ప్రతి ఏడాది పెరుగుతున్నది. వీరి సంపదలోని పెరుగుదల ఏ విధమైన ఉత్పత్తి క్రమం నుంచీ వచ్చింది కాదు. దేశ సహజ వనరులను దేశ సంపదను కార్పొరేటర్లకు తాయిలాలుగా ప్రభుత్వమే ఇస్తున్నది. దేశంలో బడా కార్పొరేట్ సంస్థల చేతుల్లో దేశంలోని పోర్టులు 25%, సిమెంట్ ఉత్పత్తులో 45%, స్టీల్ పరిశ్రమలో 33%, టెలికాం రంగంలో 60%, బొగ్గు ఎగుమతులలో 65% కేంద్రీ కృతమై ఉన్నాయి. దేశ సంపద ప్రైవేట్ గుత్తాధిపత్య సంస్థల చేతుల్లో కేంద్రీకృతం కారాదని ప్రభుత్వం అలా కాకుండా చర్యలు తీసుకోవాలని రాజ్యాంగంలోని ఆదేశిక సూత్రాలు 39వ అధికరణలో స్పష్టంగా పొందుపరిచారు. వారి సంపద కేంద్రీకృతం అవుతుండడం రాజ్యాంగం ఉల్లంఘన కాదా? ఒక పక్క ద్రవ్యలోటు పేరుతో ప్రభుత్వ సంస్థలను కారు చౌకగా అమ్మేస్తున్నారు. మరోపక్క బడా బాబులు బ్యాంకులకు బకాయి పడ్డ లక్షల కోట్ల బకాయిలను మాఫీ చేస్తున్నారు.
ప్రజా శ్రేయస్సు శూన్యం
గత తొమ్మిదేళ్లలో పెద్దల బ్యాంకులలో బకాయిపడిన 14.5 లక్షల కోట్లు రుణాలను మాఫీ చేసి కేవలం 15% మాత్రమే వసూలు చేయగలిగారు. మూడేళ్లలో ప్రభుత్వ రంగ బ్యాంకులను 12 కి కుదించారు. ప్రజలకు ఉపయోగపడే వ్యవస్థలన్నింటిని చిన్నాభిన్నం చేశారు. బిలియనీర్ల కోసం అనేక విధానాలను రూపొందించి వారి సంపదను పలుకుబడిని ఉపయోగించుకొని ప్రజాస్వామ్యాన్ని భయపెట్టే రీతిలో ప్రపంచవ్యాప్తంగా బిలియనీర్ల ప్రజాస్వామ్యం ఉన్నది. ప్రజాస్వామ్యం వర్సెస్ సూపర్ రిచ్ అనే విధంగా ప్రపంచంలో అన్ని దేశాలలోన పెద్ద వ్యాపారవేత్తలు పలుకుబడి కలిగిన రాజకీయవేత్తలు కలసి ఎల్‌పీజీ విధానాలను రూపకల్పన చేస్తున్నారు. ఈ విధానాల వలన మిలియనీర్లు.. బిలినియర్లు అయినారు గానీ ప్రజా శ్రేయస్సు పాతాళానికి పోయింది. గ్లోబలైజేషన్ వలన ప్రపంచవ్యాప్తంగా నిరుద్యోగిత, ఆదాయ అసమానతలు పెరగడం, బిలియనీర్ల సంఖ్య పెరగడం జరిగింది కానీ ప్రజా శ్రేయస్సు శూన్యం.
డాక్టర్ ఎనుగొండ నాగరాజ నాయుడు
రిటైర్డ్ ప్రిన్సిపాల్, తిరుపతి
98663 22172