ఈ సంస్థలు హింసను ఆశ్రయించవు!
అన్నమయ్య జిల్లా రాయచోటి పట్టణంలో మార్చి 4వ తేదీన శ్రీ వీరభద్ర స్వామి 'పార్వేట' ఉత్సవం సందర్భంగా పోలీసుల సాక్షిగా

అన్నమయ్య జిల్లా రాయచోటి పట్టణంలో మార్చి 4వ తేదీన శ్రీ వీరభద్ర స్వామి 'పార్వేట' ఉత్సవం సందర్భంగా పోలీసుల సాక్షిగా హిందువులు ముస్లింలు ఘర్షణలకు దిగారు. మసీదు ముందర నుండి మేళ తాళాలతో హిందూ దేవుళ్ళ ఉత్సవ రథం వెళ్లరాదని ముస్లిములు అభ్యంతరం చెప్పడంతో హిందువులు ఆగ్రహంతో ఊగిపోయి, 'జై శ్రీరామ్' అంటూ నినాదాలు ఇవ్వడంతో పోలీసులు సంయమనం కోల్పోయి, ఆడ ,మగ తేడా లేకుండా హిందువులపై విరుచుకపడి, లాఠీచార్జి చేశారు. సమస్యకు కారకులను ఉపేక్షించి హిందువులపై విరుచుకపడడం ఏమిటని ఆదోని ఎమ్మెల్యే పార్థసారధి అసెంబ్లీలో ప్రశ్నించ డంతో ఈ విషయం పెద్ద చర్చనీయాంశమైంది.
వాస్తవానికి ఈ కార్యక్రమం వీరభద్ర స్వామి దేవస్థానం వారు నిర్వహించారు. అంటే ఇది దేవాదాయ శాఖ కార్యక్రమం. ప్రభుత్వ కార్య క్రమానికి ఒక మత సమూహం అడ్డు చెప్పడం చట్టాన్ని చేతుల్లోకి తీసుకొని, శాంతిభద్రతలకు భంగం కలిగించే విషయమే.
సేవాభావమే హిందూ సంస్థల లక్ష్యం!
భారతీయ సంస్కృతి, సంప్రదాయాలు పరమోత్కృష్టంగా భావించి, వాటి పరిరక్షణలో శక్తి వంచన లేకుండా కృషి చేస్తున్న హిందుత్వ సంస్థ లు ముఖ్యంగా రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (ఆర్.ఎస్.ఎస్), విశ్వహిందూ పరిషత్ ఏనాడు హింసను ప్రాతిపదికగా చేసుకొని లక్ష్యాలను సాధించుకోవాలనే ప్రయత్నం ఎప్పుడూ చేయ లేదు. ఈ సంస్థల పనితీరు ఈ దిశలో ఉండి ఉంటే, హిందూ సమాజంతో అవి మమేకం కావడం అసాధ్యమయ్యేదేమో! దేశంలో ఎక్కడ వరదలు సంభవించినా, భూకంపాలు ఏర్పడినా, రైలు ప్రమాదాలు జరిగినా 'సేవ చేయడానికి మేమున్నాం' అని ప్రభుత్వ సంస్థల కంటే ముందే ప్రజల ముందు వాలిపోతుంటారు ఆ సంస్థల కార్యకర్తలు. ఈ విషయాన్ని ఆ సంస్థలను నిరం తరం అకారణంగా ద్వేషించేవారు, దూషించేవారు మనస్సాక్షిగా ఒప్పుకుంటున్న విషయమనేది వాస్తవ విరుద్ధం కాదు.
మత ఉత్సవాలలో ఘర్షణలు దేనికి?
ఈ కార్యక్రమంలో ఘర్షణలు చోటు చేసుకోవడానికి కారణం ఆర్. ఎస్. ఎస్, వీ.హెచ్.పి కార్యకర్తలని, ఈ కార్యకర్తలు తనను కింద పడవేసి, గొంతు పై కాలు పెట్టి, చంపబోయారని స్థానిక ఎస్సై నరసింహారెడ్డి, జిల్లా ఎస్పీకి కంప్లైంట్ రాసి, 16 మందిపై క్రిమినల్ కేసును నమోదు చేయడంతో సమస్య మరింత జటిలమయ్యింది. హిందుత్వ సంస్థల పేర్లను కంప్లైంట్‌లో ప్రస్తావించడంతో పోలీసుల తీరుపై హిందుత్వ సంస్థలు అగ్గిమీద గుగ్గిలం కావడం, ఈ విషయంపై పదో తేదీన అన్ని జిల్లా కేంద్రాల్లో హిందుత్వ అభిమానులు ర్యాలీలు నిర్వహించి, కలెక్టర్లకు నిరసన లేఖలు అందజేయడం జరిగింది. వాస్తవంగా హిందువులు తమ మత ఉత్సవాలను ఏ మత వర్గానికి ఇబ్బంది కలిగించకుండా నిర్వహించుకోవడం ఈ దేశంలో ఒక ఆనవాయితీ. ఈ ఉత్సవాల నిర్వహణలో పోలీసులతో హిందువులు గానీ, హిందుత్వ సంస్థల కార్యకర్తలు గానీ ఘర్షణ పడిన దాఖలాలు లేవు.
మొహర్రం జరుపుకునేది హిందువులు కాదా?
ఇక 'మా ప్రార్థన స్థలం ముందు నుండి మీరు వెళ్ళేటప్పుడు మంగళ వాయిద్యాలను ఆఫ్ చేసి వెళ్లాలని' ముస్లింలు కోరడం, ఈ విషయంలో పోలీసు శాఖ సమస్యను పరిష్కరించే పద్ధతిలో కాకుండా సమస్యను జఠిలంగా చేసేందుకు ప్రయత్నం జరిగినట్లు ఘర్షణలకు కారణాలను విశ్లేషిస్తే వాస్తవం బయటపడుతుంది. 2024 డిసెంబర్‌లో అయ్యప్ప స్వామి గ్రామోత్సవం సందర్భంగా మసీదు దగ్గర ఇలాంటి ఘర్షణలు చోటు చేసుకున్నాయి. హిందువుల ఉత్సవాలకు మసీదు ముందు అభ్యంతరాలు వస్తే, హిందువులు కూడా వారి బాటలో నడిచి వారి మత కార్యక్రమాలను అడ్డుకుంటారు. మొహరం ఇరాక్ దేశానికి చెందిన ముస్లింలకు సంబంధించిన ఒక ఉత్సవం. ఆంధ్రప్రదేశ్‌లో గ్రామీణ ప్రాంతాల్లో ఈ పండుగను చేసేదంతా హిందువులే. హిందువులు దర్గాలకు మొక్కి, ముస్లిం మతానికి చెందిన పేర్లు తమ పిల్లలకు పెట్టుకుంటారు. ముస్లిములు రోజుకు ఐదు సార్లు మా దేవుడు నిజమైన వాడని లౌడ్ స్పీకర్లు ద్వారా హిందువులకు వినిపిస్తున్నా, వారు భరిస్తున్నారనేది వాస్తవం కాదా?
మతసామరస్యం బాధ్యత అందరిదీ!
రంజాన్ మాసం మొదలైనప్పటి నుండి కొన్ని ప్రాంతాల్లో తెల్లవారుజామున 3 గంటలకు లౌడ్ స్పీకర్లతో హిందువులకు నిద్రాభంగం కల్పిస్తున్నా హిందువులు సహిస్తున్నారు. హిందువుల సహనాన్ని బలహీనతగా భావిస్తే, భవిష్యత్తులో మత సామరస్యానికి దారులు మూసుకు పోతాయి. ఇలాంటి సహన స్థితిని ముస్లిం సమాజంలో కూడా మనం చూడాలి. ముస్లిం మత విషయాలలో ప్రభుత్వం, పోలీసు శాఖ సానుకూలంగా వ్యవహరిస్తాయని హిందువుల్లో అసంతృప్తి, ఆగ్రహం గూడు కట్టుకొని ఉంది. ఇది ఏదో ఒక రోజు హింస రూపంలోకి మారుతుంది. ఈ విషయాన్ని ప్రభుత్వాలను నడిపే హిందూ రాజకీయ నాయ కులూ, పోలీసు శాఖలోని ఉన్నత అధికారులు దూర దృష్టితో వ్యవహరించవలసిన అవసరం ఎంతైనా ఉంది. తప్పు ఎవరు చేసినా కఠిన వైఖరిని ప్రభుత్వాలు అనుసరిస్తేనే ఈ దేశంలో ప్రజాస్వామ్యం, శాంతియుత సహజీవనం పదికాలాలపాటు మనగలుగుతాయి.
ఉల్లి బాలరంగయ్య,
సామాజిక, రాజకీయ విశ్లేషకులు.
94417 37877