మతం మత్తుకు మాత్ర రాహుల్ గాంధీ
తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కులగణన విజయవంతం కావడంతో పాటు యావత్ దేశానికి ఆదర్శంగా నిలిచింది.

తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కులగణన విజయవంతం కావడంతో పాటు యావత్ దేశానికి ఆదర్శంగా నిలిచింది. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ దేశవ్యాప్తంగా అనేక సభల్లో తెలంగాణ ప్రభుత్వాన్ని ప్రశంస్తూ కులగణన ఆయుధాన్ని జాతీయ స్థాయి ఎజెండగా మలచడంలో విజయం సాధించారు. ఎంతలా అంటే కుల గణనపై మొదట్లో ససేమిరా అన్న ఆర్ఎస్ఎస్ లాంటి సంస్థలు కూడా కులగణనకు మేం వ్యతిరేకం కాదని ప్రకటన విడుదల చేసేంతలా..
డిమాండ్‌ని సిద్ధాంతంగా మార్చి
ఈ దేశ బడుగు బలహీన వర్గాలకు రాహుల్ అందించిన బ్రహ్మాస్త్రం కులగణన సిద్ధాంతం. గత కొన్ని సంవత్సరాలుగా కులగణనపై బహుజన సంఘాల నుండి డిమాండ్ ఉన్నప్పటికీ కులగణనని ఒక సిద్ధాంతంగా ప్రాచుర్యంలోకి తెచ్చింది మాత్రం రాహుల్ గాంధీ మాత్రమే. కుల గణన దేశానికి ఎక్సరే లాంటిది అని దాని ప్రాధాన్యతని జాతీయ స్థాయిలో అనేక సభలు సమావేశాల్లో వాదించారు. ఆయన మూలానా ఒక డిమాండ్‌గా ఉన్న కుల గణనను ఒక సిద్ధాంతంగా నిరూపించారు. కుల గణన అంటే అది కేవలం జనాభా లెక్కలు మాత్రమే కాదని ఈ దేశ సామాజిక ఆర్థిక రాజకీయ ముఖ చిత్రాన్ని గీయడం అని వాదిసున్నారు. ఏడూ దశాబ్దాలపైబడి ఈ దేశ నిర్మాణంలో భాగస్వామ్యం పంచుకున్న వర్గాల స్థితిగతులపై లోతైన అధ్యానం, చర్చ జరగలన్నది రాహుల్ గాంధీ మనోగతం. కేవలం మాటలతోనే సరిపెట్టకుండా కాంగ్రెస్ అధికారంలో ఉన్న రాష్ట్రాలైనా కర్ణాటక, తెలంగాణ రాష్ట్రాల్లో ఆ ప్రభుత్వాలచే కుల గణన చేయించి కులగణనపై రాహుల్ గాంధీ తన చిత్త శుద్ధి చాటుకున్నారు. గత కొంతకాలంగా దేశవ్యాప్తంగా ఎక్కడ సభలో ప్రసంగించిన బడుగు బలహీన వర్గాల కోణంలో మాత్రమే రాహుల్ ఉపన్యాసాలు ఉండటం గమనార్హం.
ఒక సిద్ధాంతాన్ని నమ్ముకుని..
దేశ రాజకీయాల్లో రాహుల్ గాంధీ సరికొత్త రాజకీయ సైద్ధాంతిక చర్చ లేవనెత్తుతూ అందరినీ ఆశ్చర్య పరుస్తున్నాడు. మార్క్సిజమ్, అంబేద్కరిజం, బుద్ధిజం కలగలిపి నూతన సమతా సిద్ధాంతాన్ని దేశ ప్రజల ముందు ఉంచుతున్నారు. ద్వేషాన్ని వీడండి దేశాన్ని ప్రేమించండి అంటూ ఆయన చేసిన భారత్ జోడో యాత్ర అజరామమైంది. కన్యాకుమారి నుండి కాశ్మీరు వరకు సాగిన జోడో యాత్రకు ప్రజలు బ్రహ్మరథం పట్టారు. ఈ యాత్ర తరవాత ఆయనలో ఎంతో పరిణతి కన్పిస్తుంది. రాజకీయంగా సిద్ధాంతపరంగా ఎంతో ఎదిగిన మేధావి నేతగా ప్రాచుర్యం పొందుతున్నారు. ఒక సిద్ధాం తాన్ని నమ్ముకుని తన ఆచరణను కొనసాగిస్తున్నారు. సామాజిక న్యాయ సూత్రాలపై రాహుల్ గాంధీకి స్పష్టమైన అవగాహన కనిపిస్తుంది. భారతీయ సమాజంలో పేదరికం కులాలకు అతీతంగా లేదన్నది ఆయన అభిప్రాయంగా కనిపిస్తుంది. కులగణన ఆలోచన స్థాయి నుండి ఆచరణలోకి అడుగులు వేస్తున్నారు. అందులో భాగంగానే తెలంగాణ శాసనమండలి అభ్యర్థి ఎంపికలో సామాజిక న్యాయం సూత్రాన్ని పాటించి దళిత, బహుజన వర్గాలకు సంబంధించిన బిడ్డలను ఎంపిక చేశారు. రాహుల్ గాంధీ, రేవంత్ రెడ్డి జోడితో సామాజిక సమీకరణకు తెలంగాణ వేదిక కానుంది.
- దొమ్మాట వెంకటేష్
ఫ్రీలాన్స్ జర్నలిస్ట్
98480 57274