మణిపూర్‌పై చర్చ ఎందుకు వద్దు?

Why Manipur discussion not allowed in Parliament

Update: 2023-07-28 00:30 GMT

ణిపూర్‌పై పార్లమెంట్‌లో చర్చ అంటే ప్రధానికి భయం పట్టుకున్నది. గత పార్లమెంట్ సమావేశాల మాదిరి ఈ సమావేశాలను కూడా ఎలాంటి చర్చ లేకుండా వాయిదా వేసుకునే పరిస్థితి స్పష్టంగా కనిపిస్తున్నది. దొంగే దొంగ దొంగా అదేవిధంగా బీజేపీ పరిస్థితి ఉంది. ప్రపంచం మొత్తం భారతదేశంలో మణిపూర్‌లో జరుగుతున్న హింసాత్మక ఘటనలు, యువతుల మీద దాష్టికాల మీద ప్రశ్నిస్తుంటే, విదేశీ పార్లమెంట్‌లలో సైతం చర్చ జరుగుతుంటే మన పార్లమెంట్‌లో మాత్రం చర్చ మీద శ్రద్ద చూపకుండా, విపక్షాలు పారిపోతున్నాయని అనడం విడ్డూరం.

దేశంలో ఆ పరిస్థితి ఉందా?

నిజానికి ఇది బీజేపీకి కొత్త విషయం కాదు. తొమ్మిది ఏండ్ల నుంచి ఒక్క విషయం మీద కూడా సంపూర్ణంగా చర్చ జరిపింది లేదు. మణిపూర్ సమస్యను కేంద్రం చాలా లైట్‌గా తీసుకుంటున్నది. మానవత్వం సిగ్గుతో తల దించుకునే ఘటనలు మణిపూర్‌లో బోలెడు జరిగాయని స్వయంగా సీఎం బిరెన్ సింగ్ బహిరంగంగా చెప్పాడు. అలాగే వందల సంఘటనలు జరిగాయని నిస్సిగ్గుగా ఒక టీవీ ఛానల్ మహిళా రిపోర్టర్‌తో సీఎం చెప్పాడు. 19 సంవత్సరాల తమ్ముడి ముందు తన 21 సంవత్సరాల అక్కను వివస్త్రను చేసి ఊరేగించి, అత్యాచారం జరిపితే ఆ తమ్ముడి పరిస్థితి ఎలా ఉంటుంది, అలాగే తన తమ్ముడిని తన ముందే కొట్టి చంపితే ఆ బాధిత అక్క పరిస్థితి ఎలా ఉంటుంది?

ఈ ఆర్టికల్‌లో ఈ విషయం టైప్ చేస్తున్నప్పుడు నా కళ్లు నాకు తెలియకుండానే నీళ్లు తీసుకున్నాయి. ఎన్ని కోట్ల కళ్లు ఇద్దరు యువతుల పైన వందలాది మానవ మృగాల దాష్టికాన్ని వీడియోలో చూసి నీళ్లు తీసుకుని ఉంటాయి? దేశంలో 2014 తరువాత మానవత్వం సిగ్గుతో తల వంచుకునే ఎన్నో సంఘటనలు చోటు చేసుకున్నాయి. మనిషిలో మానవత్వాన్ని విద్వేష మార్గం చంపివేసింది. ఒకప్పుడు దేశం మొట్టమొదటి పీఎం జవహర్ లాల్ నెహ్రూ కాలర్ పట్టుకుని ఒక వృద్ధ మహిళ ప్రశ్నించింది. అప్పుడు ఆ అవకాశాన్ని దేశ స్వాతంత్ర్యం, ప్రజాస్వామ్యం మనకు ఇచ్చింది. కానీ ఈ రోజు ఆ పరిస్థితి ఉందా? పీఎం ఎక్కడికైనా టూర్‌కు వస్తే చిన్న పిల్లలను కలవాలన్నా భారీ సెక్యూరిటీ ఉంటుంది.సెలెక్టెడ్ పిల్లలకే ఆ అవకాశం ఉంటుంది. లేదా ముళ్ల కంచెల ఏర్పాటు ఉంటుంది. దాని నుంచే పీఎంను చూడాలి. ఇదీ పరిస్థితి.

38 సెకన్ల ఖండన తగునా!

పార్లమెంట్‌లో వరుస ప్రభుత్వ తప్పులను ఎత్తి చూపుతూ, కేంద్ర ప్రభుత్వాన్ని, ముఖ్యంగా పీఎం మోడీని ఊపిరి పీల్చుకొనివ్వడం లేదని, కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీకి ఒక కేసులో రెండేండ్ల శిక్ష పడిన ఘటన సాకుగా తీసుకుని, వెనువెంటనే ఆయన పార్లమెంట్ సభ్యత్వం రద్దు చేసి, ఆయన ఇంటిని కూడా ఖాళీ చేయించిన ఘనతను కేంద్ర ప్రభుత్వం సాధించుకుంది. రాహుల్ గాంధీ నిజానికి భారత్ జోడో యాత్ర అనంతరం జన నేత అయ్యారు. అయన ప్రతీ అడుగు కాంగ్రెస్ కోసమే అన్నట్లు కాదు, దేశం కోసం అనే టాక్ వచ్చింది. ఢిల్లీలో ఒక బాలయోగి మాట్లాడుతూ రాహుల్ గాంధీలో మన జాతిపిత మహాత్మా గాంధీ ఆత్మ ప్రవేశించిందా అని అనిపిస్తున్నది అన్నారు. పార్లమెంట్ బయట పీఎం మోడీ 38 సెకండ్లు మణిపూర్‌లో ఇద్దరు యువతులపైన జరిగిన దాష్టికం గురించి మాట్లాడితే, ఈ విషయం వెలుగు చూడక ముందే రాహుల్ గాంధీ మణిపూర్‌కు వెళ్లి 36 గంటల పాటు ఉండి, బాధిత కుటుంబాలను పరామర్శించి వచ్చారు.

ఎడతెరిపి లేకుండా మణిపూర్‌లో జరుగుతున్న దమనకాండ మీద ప్రధాని ఎందుకు మాట్లాడరు? ముందు పీఎం మాట్లాడిన తర్వాత చర్చిద్దాం అంటున్నాయి విపక్షాలు! ఇందులో తప్పు లేదు కదా! ప్రధానికి విపక్షాల ప్రశ్నలకు సమాధానం ఇవ్వడం అంటే ఎందుకు భయం? ఇప్పటికే ఆయన అదాని స్కామ్ పైన, పెగాసిన్, రాఫెల్ పైన మాట్లాడలేదు. మణిపూర్‌లో దమన కాండ మే 3 నుంచి కొనసాగుతుంటే, మొన్న 79 వ రోజు, అది కూడా రెండు నెలల క్రితం ఇద్దరు యువతుల పైన జరిగిన దాష్టీకం ఒక వీడియో ద్వారా వైరల్ అయి, సుప్రీంకోర్టు సుమోటో కింద తీసుకొని, కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాలను ప్రశ్నించిన తర్వాత పార్లమెంట్ బయట పీఎం మోడీ మణిపూర్‌ ఘటనపై 38 సెకండ్లు మాట్లాడి ఖండించారు.

ఆ స్టేట్మెంట్ తప్ప అసలు విషయం మీద పీఎం మాట్లాడింది లేదు. సోమవారం విపక్ష ఎంపీలు పార్లమెంట్ బయట మణిపూర్ విషయంలో ధర్నా చేయగా, బీజేపీ ఎంపీలు రాజస్థాన్‌లో నేరాలపై ధర్నా చేశారు. బీజేపీ అసలు విషయాన్ని తప్పుదారి పట్టించడం కోసమే కాంగ్రెస్ అధికారంలో ఉన్న రాజస్థాన్ లోనే మహిళల మీద అత్యధిక దాష్టికాలు జరిగినట్లు ఆరోపిస్తూ పోటీ ధర్నా నిర్వహించడం అసంబద్ధం కాదా? మణిపూర్‌లో శాంతి కోసం ప్రయత్నం చేసే బదులు, ఇలా పార్లమెంట్‌లో విపక్షాలను మాట్లాడనీయకుండా అడ్డుకునే ఉద్దేశంతో బీజేపీ ప్లాన్డ్‌గా అన్ని రకాల వ్యూహలను అమలు చేస్తున్నది. పీఎం కూడా అందుకే ఆ ఘటనపై ప్రకటన చేయడం లేదు.

ఆ ఘోషను వినిపించాలి!

మణిపూర్ సెగ అటు మిజోరంకు కూడా తగిలింది. దేశంలోని ఈశాన్య రాష్ట్రాల్లో మణిపూర్‌పై చర్చ జరుగుతున్నది. యూరప్, అమెరికాల లోనూ మణిపూర్ సంఘటన మీద చర్చ జరుగుతోంది. మణిపూర్‌లో శాంతిని నెలకొల్పాలని వారు కోరుతున్నారు. మానవహక్కుల, పౌర హక్కుల, మహిళా సంఘాల నేతలు డిమాండ్ చేస్తున్నారు. మణిపూర్ లోనే మహిళలపై అత్యాచారాల కేసులు ఒక్కొక్కటిగా వెలుగుచూస్తున్నాయి. మణిపూర్ సమస్యను పరిష్కారం దిశన తీసుకుని వెళ్లాల్సిన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల పెద్దలు విషయం మీద ఏమాత్రం శ్రద్ధ చూపడం లేదు. దీనికి తోడు విపక్షాల మీద ఏదో ఒక రాయి పడేసి, వారికి ఈడీ, ఐటీ, సీబీఐ బూచీలు చూపి మాట్లాడకుండా చేయాలి, అందుకు బీజేపీ ఐటి సెల్‌ను, యూట్యూబర్లను సిద్ధం చేసేసారు.

అయితే గతంలో మాదిరిగా ఇప్పుడు పరిస్థితి లేదు. నిజం తెలుసుకునే దిశగా దేశం యువత, మహిళలు, ఉద్యోగులు, కూలి పని చేసుకుని జీవించేవారు.... ధరలు విపరీతంగా పెరగడం వల్ల ఆగమైన కుటుంబాలు, హామీలు తప్ప లభించని ఉద్యోగాల వల్ల ఆందోళనలో ఉన్న నిరుద్యోగులు, రక్షణ లేని మహిళా లోకం అంతా ఒక్కటి అవుతున్నారు. ఈ సందర్భం చాలా ముఖ్యమైనదే కాక విద్వేష రాజకీయాలకు చెక్ పెట్టేది అంటే అతిశయోక్తి కాదు. మనం మణిపూర్ వాసుల ఘోషను వినిపించే గొంతుకలం కావాలి! ఆవాజ్ దో మణిపూర్ కో జోడో! మణిపూర్ కన్నీరు పెడుతున్నది. తాను ఏమి నేరం చేసానని తనకు ఈ శిక్ష అంటూ వాపోతున్నది. ఆదివాసీ బిడ్డ అయిన మన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈ విషయంలో జోక్యం చేసుకోవాలంటూ మణిపూర్ ప్రజలు కోరుతున్నారు!

ఎండి.మునీర్,

సీనియర్ జర్నలిస్ట్,విశ్లేషకులు

99518 65223

Tags:    

Similar News