పెళుసు బారుతున్న బంధాలు

Why is the traditional Indian family on the decline

Update: 2023-10-12 00:15 GMT

ఒకప్పుడు ఉమ్మడి కుటుంబాలకు మన దేశం పుట్టిల్లు. ఈ వ్యవస్థ దేశానికి ఆత్మ వంటిది. ఉమ్మడి కుటుంబ వ్యవస్థలో తల్లి, తండ్రి, పిల్లలు, తాత, బామ్మలు..ఇలా మూడు, నాలుగు తరాలకు సంబంధించిన వారందరూ కలిసి హాయిగా జీవించేవారు. వారి మధ్య బలమైన, ఉన్నతమైన బంధాలు ఉండేవి. దీనివల్ల కుటుంబానికి ఒక రకమైన భద్రత లభించేది. గతంలో పెద్దగా ఆస్తులు, ఆదాయ వనరులు లేకపోయినప్పటికీ మనుషులు చక్కని ఆప్యాయత, అనుబంధాలతో ఉన్నంతలోనే తృప్తిగా గడిపారు. ‘వసుధైక కుటుంబం’ అనాదికాలం నుంచి భారతీయ కుటుంబ వ్యవస్థకు మార్గదర్శకంగా నిలిచింది. అయితే ప్రస్తుతం ఆధునిక మకిలిని ఒంటబట్టించుకుని మన దేశ సంస్కృతి తాలూకు ఔన్నత్యానికి భంగకరంగా ప్రవర్తిస్తున్నాం. ప్రగతి పేరిట ప్రవర్తన, ఆధునికత పేరిట అపసవ్య విధానాలతో తరతరాల మన సంస్కృతికి తూట్లు పొడుస్తూ, బంధాలను బలహీనం చేసుకుంటున్నాం.

పెరుగుతున్న అగాథం..

ప్రపంచీకరణ ప్రయాణంలో కుటుంబ సంబంధాలు, మానవ సంబంధాలలో పెను మార్పులు చోటుచేసుకున్నాయి. జారిపోతున్న బంధాలతో ఆధునిక మానవుడు ఒంటరివాడై పోతున్నాడు. జీవితం యాంత్రికమై పోయింది. బతుకు యాత్రలో ఊపిరి సలపని వేగంతో ఆందోళనను, ఒత్తిడిని గుండెలనిండా నింపుకొని పయనిస్తున్నాడు. తరాలు మారుతున్న నేపథ్యంలో బంధాలన్నీ తెగిపోతున్న దారంలా సన్నబారిపోతున్నాయి. పేగుబంధాలు, రక్తబంధాలు, వైవాహిక బంధాలు, స్నేహబంధాలు.. ఇలా అన్నీ ఆర్థిక సంబంధాల ముందు మసకబారిపోతున్నాయి. జీవనశైలిలో వచ్చిన మార్పులు కుటుంబ వ్యవస్థను, అనుబంధాలను చిన్నాభిన్నం చేస్తున్నాయి. కుటుంబంలోని అందాలు, ఆనందాలు హరించిపోతున్నాయి. కుటుంబ సభ్యులు కష్టసుఖాలు పరస్పరం పంచుకోవాల్సి ఉండగా ‘ఎవరికివారే యమునా తీరే’ అన్న విధంగా మెలుగుతున్నారు. జీవితంలో సౌఖ్యాలు, విలాసాలు పెరిగాయి కానీ పరిణతి చెందాల్సిన మనుషుల వ్యక్తిత్వం మాత్రం కుంచించుకుపోతోంది. నేడు పిల్లలకు అసలు కుటుంబ సంబంధాలు, బంధుత్వాలు పరిచయం చేయడం తగ్గిపోతుంది. దాంతో రేపటి రోజున మన తరువాత మన పిల్లలకు మన అనేవారే లేని, మిగలని పరిస్థితి ఏర్పడుతోంది. మన కుటుంబాల్ని మనమే ఎడంచేసుకుంటూ..మనలో మనమే దూరం పెంచుకుంటూపోతున్నాం.

దిగజారిపోతున్న విలువలు

కాలానుగుణంగా వచ్చినమార్పుతో ఇప్పుడు ఉమ్మడి కుటుంబాలు తగ్గి చిన్న కుటుంబాలు ఎక్కువయ్యాయి. కానీ, కుటుంబవ్యవస్థ ఏదైనప్పటికీ శతాబ్దాలుగా భారతీయ కుటుంబాలను నిలబెట్టి పోషించిన ప్రధాన విలువలపై ఎప్పడూ రాజీ పడకూడదు. అయితే నేడు మనుషుల్లో హెచ్చుమీరుతున్న భేషజాలు, స్వార్థం, ఈర్ష్య, అసూయల వల్ల నైతిక విలువలు దిగజారిపోతున్నాయి. మానవ సంబంధాలు, మమతలు కరువైపోతున్నాయి. కుటుంబ విలువల్లేవు, కట్టుబాట్లు లేవు. పెద్దలంటే గౌరవం లేదు. అన్నదమ్ములు, అక్కాచెల్లెళ్ళు, భార్యాభర్తలు, అత్తాకోడళ్ళ మధ్య బలమైన అనుబంధం కొరవడింది. దైనందిన జీవితంలో విలువలతో కూడిన ప్రవర్తన, స్వభావం ద్వారా వ్యక్తిత్వ నిర్మాణం జరుగుతుంది. కానీ, నేటి యువతకు క్రమశిక్షణకు అవసరమైన సంస్కారాలను, విలువలను అందించడానికి కుటుంబంలో పెద్దలు కరువవుతున్నారు. కొన్ని కుటుంబాలలో పెద్దలు ఉన్నా వారిని లక్ష్యపెట్టడం లేదు. బంధం, అనుబంధం, బంధుత్వం, స్నేహం అనే సంస్కారం నేర్పే వ్యవస్థ లేనపుడు మనిషి మనిషిగా జీవించలేడు. భారతీయ సంస్కృతిలో వివాహ వ్యవస్థ అపూర్వమైనది. గతంలో మన సమాజంలో నిశ్చయ వివాహాలు ఒక పద్ధతిలో కట్టుబడి దీర్ఘకాలం మనగలిగేవి. అయితే నేడు మన వివాహ వ్యవస్థ బలహీనపడి పాశ్చాత్య దేశాలలో మాదిరి అవుతోంది. కారణం సామాజిక పెడపోకడలు. చిన్న చిన్న విషయాలకు కూడా భార్యాభర్తలు తరచూ గొడవలు పడటం, విలువలకు తిలోదకాలిచ్చి విడిపోవడాలు ఇప్పుడు సర్వసాధారణమైపోతోంది.

వృద్ధుల పట్ల నిరాదరణ

ఆధునిక సమాజంలో చాలా ఇళ్లల్లో ముసలి తల్లిదండ్రుల ఆలనా పాలనా కరువైంది. ఉద్యోగాలు, వ్యాపారాల వల్ల నేడు పిల్లలు ఎక్కడెక్కడో ఉంటున్నారు. దాంతో వృద్ధులు ఒంటరి జీవితం పాలై, బిడ్డల సాంత్వన కోసం, ఆత్మీయ స్పర్శ కోసం ఆరాటపడుతున్నారు. అనారోగ్య సమస్యలతో, ఒంటరితనంతో జీవన సంధ్యా సమయంలో వాళ్ళు అంతులేని ఘర్షణలకు, ఆవేదనలకు గురవుతున్నారు. పిల్లలతో కలిసి ఉంటున్న కుటుంబాల్లో సైతం చాలామంది పెద్దలు నిరాదరణకు గురికావడం మనం చూస్తూనే ఉన్నాం. చిన్న చిన్న కారణాలతోనే పిల్లల నుంచి అవమానాలు, ఈసడింపులు, సూటిపోటి మాటలు ఎదుర్కొంటున్నారు. బిడ్డలను పెంచి పెద్దచేసి లోకంలో జీవించడానికి కారణభూతులైన వారు తల్లిదండ్రులు. వారు ఇంటిల్లిపాదికీ పెద్ద దిక్కు. మన సమస్యల చిక్కుముడులను చిటికెలో విప్పే అనుభవమూర్తులు. ఇంట్లో పిల్లలకు తెలియని విషయాలు, నీతి కథలు నేర్పించే బోధకులు. తరతరాలుగా వస్తున్న బంధాల విలువల కొనసాగింపునకు మూలస్తంభాలు.అటువంటివారిని కంటికి రెప్పలా కాపాడుకోవాల్సింది పోయి వారిని నిర్లక్ష్యం చేయడం, వృద్ధాశ్రమాలకు పంపించడం వంటి చర్యలకు పాల్పడుతున్నారు కొందరు సంతానం. ఇలాంటి ప్రవర్తనలతో నేడు కుటుంబ బాంధవ్యాలు, సామాజిక విలువలు ఎంతగానో విచ్ఛిన్నమవుతున్నాయి.

బంధాలు బలపడాలంటే..

కుటుంబ వ్యవస్థ పటిష్టంగా రూపుదిద్దుకుంటేనే బంధాలు బలపడతాయి. దానికి కుటుంబ సభ్యుల ఆలోచనా విధానంలో మార్పు రావాలి. వారి మధ్య ప్రేమానురాగాలు, అన్యోన్యతలు పెంపొందాలి. ముఖ్యంగా భార్య భర్తల మధ్య సర్దుబాట్లు, ఒకరి సమస్యల్ని మరొకరు అర్థం చేసుకునే ఓర్పు, పరిష్కరించుకొనే నేర్పు ఉండాలి. ఒకరి అభిరుచులను మరొకరు గౌరవించుకుంటూ, అరమరికలకు తావులేకుండా ఒకరి మనసులో మాటను మరొకరితో పంచుకోవాలి. అపుడే వారి బంధం మరింత బలపడుతుంది. కుటుంబంలో ఇల్లాలి పాత్రే ప్రధానం. భర్త, పిల్లలు, అత్తమామల్ని ఆప్యాయతతో చూసుకోవడంలోనూ, ఇంటి వ్యవహారాలు నిర్వహించడంలోనూ ఇల్లాలి పాత్ర కీలకం. అందుకే ‘ఇంటికి దీపం ఇల్లాలు’అన్నారు. ఇంట్లో వారి మధ్య ఎటువంటి పొరపొచ్చాలు లేకుండా ఉండాలంటే ఆ ఇంటి ఇల్లాలు ఓర్పు, సహనం, సంస్కారాలాతో మెలగాలి. వృద్ధులను ఆదరణతో చూసుకోవాల్సిన బాధ్యత కన్నవారిపై ఉంది. మానవీయ విలువలతో, సంస్కారంతో పెద్దరికానికి పెద్దపీట వేయాలి. మార్గనిర్దేశకులైన వారి సలహాలు, సూచనలు పాటించడం మేలైన మార్గం. కుటుంబంలో ఏదైనా సమస్య వచ్చినప్పుడు సమష్టి ఆలోచనల ద్వారా పరిష్కరించుకోవాలి. ‘నేను’ అని కాకుండా ‘మనం’అనే భావంతో కుటుంబ సభ్యులు మసలుకుంటే అనుబంధాలు వికసిస్తాయి. నేడు పిల్లలకు దగ్గర బంధుత్వాలు గురించి కూడా తెలియడం లేదు. అందువల్ల మన వారసత్వాన్ని పిల్లలకు తెలియజెప్పాలి. కుటుంబ విలువలను తెలియజేసే పాఠ్యాంశాలను, కార్యక్రమాలను రూపొందించి భావితరాలకు అవగాహన, ప్రేరణ కల్పించాలి. దూరమై పోతున్న చుట్టరికాలు, తరిగిపోతున్న ఆత్మీయతల వల్ల కుటుంబానికి తద్వారా సమాజానికి తీరని లేటవుతుంది. కాబట్టి బంధాలు, అనుబంధాల బలోపేతం కోసం ప్రతి ఒక్కరూ కంకణ బద్దులు కావలసిన అవసరం ఎంతైనా ఉంది.

పీ.వీ.ప్రసాద్

విజయవాడ

94401 76824

Tags:    

Similar News